Share News

BJP : ఉత్తర కమలం!

ABN , Publish Date - May 03 , 2024 | 05:25 AM

ఉత్తర తెలంగాణ..! ఒకప్పుడు మావోయిస్టుల కోట! ఉద్యమాల పురిటి గడ్డ! ఈ ప్రాంతం పేరు చెప్పగానే జగిత్యాల జైత్రయాత్ర, ఇంద్రవెల్లి గుర్తుకొస్తాయి! కానీ, ఇప్పుడు అక్కడ కొత్త సిద్ధాంతం పురుడు పోసుకుంటోంది. కమ్యూనిజం స్థానంలో కాషాయ దళం చిగురు తొడుగుతోంది! క్రమక్రమంగా బీజేపీ పట్టు

BJP : ఉత్తర కమలం!

విప్లవాల గడ్డలో కాషాయ వికాసం

ఉత్తర తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ

హైదరాబాద్‌, మే 2 (ఆంధ్రజ్యోతి): ఉత్తర తెలంగాణ..! ఒకప్పుడు మావోయిస్టుల కోట! ఉద్యమాల పురిటి గడ్డ! ఈ ప్రాంతం పేరు చెప్పగానే జగిత్యాల జైత్రయాత్ర, ఇంద్రవెల్లి గుర్తుకొస్తాయి! కానీ, ఇప్పుడు అక్కడ కొత్త సిద్ధాంతం పురుడు పోసుకుంటోంది. కమ్యూనిజం స్థానంలో కాషాయ దళం చిగురు తొడుగుతోంది! క్రమక్రమంగా బీజేపీ పట్టు సాధిస్తోంది! ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇవన్నీ కూడా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే! ఇక, 2018 ఎన్నికలకు వచ్చేసరికి రాష్ట్రవ్యాప్తంగా 119 స్థానాల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగింది. 105 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదు. హైదరాబాద్‌ గోషామహల్‌లో మాత్రమే విజయం సాధించింది. అప్పటి వరకూ హైదరాబాద్‌, చుట్టుపక్కల మాత్రమే ప్రాబల్యం కలిగిన బీజేపీ పరిస్థితి 2023 ఎన్నికలనాటికీ మారిపోయింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. మరో 18 అసెంబ్లీ స్థానాల్లో రెండో స్థానంలో, మరికొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 40 అసెంబ్లీ స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంది. ఈసారి గెలిచిన సీట్లలోనూ అత్యధికం ఉత్తర తెలంగాణలోనే! సిర్పూర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముథోల్‌, ఆర్మూర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగరేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఒక్క గోషా మహల్‌లో మాత్రమే గెలిచింది. ఈసారి బీజేపీ తన ఓటు బ్యాంకును కూడా గణనీయంగా పెంచుకుంది. 2018లో కేవలం 6.98 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. 2023 ఎన్నికల్లో 13.90 శాతం ఓటుబ్యాంకును సొంతం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులు గెలుపొందిన నిర్మల్‌లో 44 శాతం ఓటింగ్‌, ఆర్మూర్‌లో 31 శాతం, సిర్పూర్‌లో 30 శాతం వచ్చాయి. హుజారాబాద్‌, గజ్వేల్‌ సహా మరో 12 నియోజకవర్గాల్లో బీజేపీ 20 శాతం ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది.


గిరిజన ప్రాంతాల్లో పాగా

ఉత్తర తెలంగాణలో మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో బీజేపీ పాగా వేయడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబలం కలిగిన గిరిజన ప్రాంతాల్లో బీజేపీ, దాని అనుబంధ సంస్థలు చాప కింద నీరులా విస్తరించాయి. ఊరూరా ఛత్రపతి శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేశాయి. ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలను తనవైపు తిప్పుకోవడంలో సఫలమయ్యాయి. వీటితోపాటు ప్రతి గ్రామంలో హనుమాన్‌ ఆలయాలు, వ్యాయామ శాలలను విరివిగా ఏర్పాటు చేశారు. ఆర్‌ఎ్‌సఎస్‌ వ్యవస్థాపకుడు హెగ్డేవార్‌ పూర్వీకుల స్వస్థలం కూడా నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌ మండలం కందకుర్తి కావడంతో గత దశాబ్దకాలంలో చాలామంది యువత ఆర్‌ఎ్‌సఎస్‌ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. 2014కు ముందు తెలంగాణలో ఆర్‌ఎ్‌సఎస్‌ శాఖలు 1600 దాకా ఉండగా.. ప్రస్తుతం 3 వేలకు చేరాయి. అంతేకాకుండా ఆర్‌ఎ్‌సఎస్‌ అనుబంధ భావజాల వ్యాప్తిలో సరస్వతి విద్యామందిర్‌లు, శిశుమందిర్‌లు కూడా కీలక పాత్రను పోషిస్తున్నాయి. అడవుల్లో వనవాసీ కల్యాణ పరిషత్‌ (విశ్వహిందూ పరిషత్‌ అనుబం ధం) సంఘాలు క్రియాశీలంగా హిందూత్వ రాజకీయాల వ్యాప్తిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. మరోవైపు, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో బీజేపీ బలపడుతుండడం గమనార్హం. దీనికితోడు, ప్రధానంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలతోపాటు కేంద్రంలో అధికారంలో ఉండటం ఆ పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తోంది.

Updated Date - May 03 , 2024 | 05:25 AM