Share News

మినీ ఇండియాలో.. ముక్కోణపు పోరు

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:11 AM

సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం 1957లో ఏర్పడగా, అప్పటినుంచి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్‌ గెలిచింది.

మినీ ఇండియాలో.. ముక్కోణపు పోరు

సికింద్రాబాద్‌ బరిలో హేమాహేమీలు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రతిష్ఠకు సవాలు

మోదీ గ్యారంటీయే ప్రధాన ప్రచారాస్త్రం

ఎమ్మెల్యేల బలం కలిసొస్తుందని బీఆర్‌ఎస్‌ ధీమా

అధికారం అండతో నెగ్గుతామని కాంగ్రెస్‌ అంచనా

ఇప్పటివరకు జాతీయ పార్టీలదే విజయం

దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసించే ప్రాంతం.. అన్ని మతాలు, తెగలకు చెందినవారితో ‘మినీ ఇండియా’ను తలపిస్తుంది.. సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం. ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలు, సిక్కు మతస్తులు కలిపి 20 శాతానికి పైగా జనాభా ఉన్న ఈ పార్లమెంటు స్థానంలో ఓటర్లపై రాష్ట్ర రాజకీయాల కన్నా జాతీయ రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు మాత్రమే గెలుపొందడమే ఇందుకు నిదర్శనం. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌.. తమ పూర్వవైభవం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో సికింద్రాబాద్‌లో ఈసారి ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం 1957లో ఏర్పడగా, అప్పటినుంచి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. ఐదుసార్లు బీజేపీ నెగ్గింది. 1971లో మాత్రమే తెలంగాణ ప్రజా సమితి గెలిచింది. బీజేపీ తరఫున 4 సార్లు బండారు దత్తాత్రేయ విజయం సాధించారు. 1991లో దత్తాత్రేయ తొలిసారి గెలుపొందగా, 1996లో ఈ స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. ఇక 1998, 1999లో బీజేపీ గెలుపొందితే.. 2004, 2009లో కాంగ్రెస్‌ దక్కించుకుంది. 2014, 2019లో బీజేపీ గెలుపొందింది. ఇలా 25 ఏళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌ వరుసగా రెండు దఫాలుగా గెలుస్తూ వస్తున్నాయి. అయితే సికింద్రాబాద్‌లో గెలిచిన పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుండడం విశేషం. కాగా, ఈసారి ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగిన అభ్యర్థులు ముగ్గురూ నగరంలో రాజకీయంగా తలపండిన నేతలే. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిది కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావుగౌడ్‌ రాష్ట్ర మంత్రులుగా సుపరిచితమైనవారు. దాంతో పోటీ హోరాహోరీగా మారింది.

బీఆర్‌ఎ్‌సకు ఎమ్మెల్యేలే బలం..!

అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లకుగాను ఆరింటిని బీఆర్‌ఎస్సే కైవసం చేసుకుంది. ఓట్లపరంగా కూడా దానికే అత్యధికం వచ్చాయి. పైగా గెలుపొందిన ఎమ్మెల్యేలంతా హేమాహేమీలవడంతో పాటు స్థానికంగా పట్టున్న నేతలు. వీరిలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మినహా మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సను అంటిపెట్టుకొని ఉండి పద్మారావు గెలుపు కోసం పనిచేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే అయిన పద్మారావుకు ఇతర నియోజకవర్గాల్లోనూ గట్టి పట్టుంది. 2019 ఎన్నికల సందర్భంగానూ ఈ లోక్‌సభ స్థానం పరిధిలో బీఆర్‌ఎ్‌సకు ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు. పైగా, రాష్ట్రంలో అధికారంలోనూ ఉంది. అయినా, ఈస్థానంలో ఓడింది. ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తారా? అనే అనుమానాలున్నాయి.

Untitled-16.jpg


మోదీ గ్యారంటీతో బీజేపీ..

సికింద్రాబాద్‌ ఎంపీగా, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. పార్టీలో పోటీ లేకపోవడంతో మొదటి జాబితాలోనే ఆయన పేరు ఖరారైంది. కానీ, ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండడం ఆయన ప్రతిష్ఠకు సవాలుగా మారింది 2019లో బీజేపీకి ఈ లోక్‌సభ స్థానంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. మోదీ హవాలో నెగ్గారు. ఈసారి కూడా మోదీ క్రేజ్‌తో గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా అభివృద్ధికి ఆశించిన మేర నిధులు తీసుకురాలేదనే అభిప్రాయాలున్నాయి. అయినప్పటికీ మోదీ గ్యారంటీతో వాటన్నింటినీ అధిగమిస్తామని బీజేపీ నేతలు అంటున్నారు. కిషన్‌రెడ్డికి మళ్లీ కేంద్రమంత్రి పదవి దక్కడంతోపాటు కీలక బాధ్యతలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీ కావడంతో నెగ్గుతామని కాంగ్రెస్‌..

కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న దానం నాగేందర్‌.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అధికార పార్టీలో చేరిపోయారు. ఆయనకు వెంటనే ఎంపీ టికెట్‌ ఖరారు చేశారు. కాగా, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం లో నాగేందర్‌కు నగరంలో విస్తృత పరిచయాలున్నాయి. పైగా, కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో ఆ చరిష్మా పని చేస్తుందని, ఆరు గ్యారంటీలతో పాటు లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు తన విజయానికి దోహదపడుతాయనే అంచనాతో ఉన్నారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పదేళ్లుగా ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ గెలవలేదు. దీంతో పార్టీ బలహీనంగా ఉందన్న అభిప్రాయాలున్నాయి. కానీ, మోదీ పాలనలో విఫలమైన అంశాలను ఏకరువు పెట్టి ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.

Updated Date - Apr 30 , 2024 | 05:11 AM