Korean flight: విమానంలో ఊహించని పరిణామం.. ప్రయాణీకుల ముక్కులు, చెవుల నుంచి కారిన రక్తం
ABN , Publish Date - Jun 24 , 2024 | 05:47 PM
దక్షిణకొరియా రాజధాని సియోల్ నుంచి తైవాన్‌లోని తైచుంగ్ వెళ్లాల్సిన ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’ విమానంలోని ప్రయాణీకులకు మార్గమధ్యంలో భయానక అనుభవం ఎదురైంది. విమాన క్యాబిన్ ‘ ప్రెషరైజేషన్ సిస్టమ్’ పనిచేయకపోవడంతో విమానం ప్రయాణిస్తున్న ఎత్తు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది.
సియోల్: దక్షిణకొరియా రాజధాని సియోల్ నుంచి తైవాన్‌లోని తైచుంగ్ వెళ్లాల్సిన ‘బోయింగ్ 737 మ్యాక్స్ 8’ విమానంలోని ప్రయాణీకులకు మార్గమధ్యంలో భయానక అనుభవం ఎదురైంది. విమాన క్యాబిన్ ‘ ప్రెషరైజేషన్ సిస్టమ్’ పనిచేయకపోవడంతో విమానం ప్రయాణిస్తున్న ఎత్తు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది. సెకన్ల వ్యవధిలోనే 30,000 అడుగుల నుంచి 9,000 అడుగులకు చాలా వేగంగా పడిపోయింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే 20 వేల అడుగుల మేర ఎత్తు తగ్గింది. ఈ ప్రభావంతో విమానంలోని పలువురు ప్రయాణీకుల ముక్కుల నుంచి రక్తం కారింది. అంతేకాదు పలువురు ప్రయాణీకులు చెవి నొప్పితో బాధపడ్డారు. అనూహ్యమైన ఈ పరిస్థితి కారణంగా విమానాన్ని దక్షిణకొరియాలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
ఈ ఘటనలో13 మంది ప్రయాణికులు ఆసుపత్రి పాలయ్యారని దక్షిణకొరియా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పలువురు ప్రయాణికులు చెవి నొప్పితో బాధపడ్డారని, హైపర్‌వెంటిలేషన్‌తో బాధపడ్డారని వెల్లడించాయి. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని వివరించాయి. కాగా శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన సమయంలో కేఈ189 ఫ్లైట్‌లో మొత్తం 125 మంది ప్రయాణికులు ఉన్నాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. కాగా విమాన అంతర్గత ఒత్తిడిని నియంత్రించే వ్యవస్థలో లోపం ఏర్పడినప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తుంటాయి. వేగంగా ఎత్తు తగ్గడం వల్ల ప్రయాణీకులు అసాధారణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాగా ఘటనకు సంబంధించిన వివరాలు ఓ ప్రయాణీకురాలు పంచుకుంది. మీల్ సర్వీస్ తర్వాత విమానం ఎత్తు అకస్మాత్తుగా పడిపోయిందని, క్యాబిన్ లోపల అల్లకల్లోలం ఏర్పడిందని వెల్లడించింది. రోలర్‌కోస్టర్ రైడ్‌కి సమానంగా విమానం ఎత్తు తగ్గిందని, చెవులు, తలలో బాగా నొప్పి వచ్చిందన్నారు. ఒక్కసారిగా మైకం వచ్చినట్టు అయిందని గుర్తుచేసుకున్నారు. అయితే క్యాబిన్ సిబ్బంది తక్షణమే అప్రమత్తం అయ్యారని, ఆక్సిజన్ మాస్క్‌లను పంపిణీ చేశారని వివరించారు. కాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ‘కొరియన్ ఎయిర్’ క్షమాపణలు చెప్పింది. అవసరమైన నిర్వహణ చర్యలు తీసుకున్నారా లేదా అని నిర్ధారించడానికి విమానాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. ఇక 19 గంటల ఆలస్యంగా ఆదివారం నాడు ప్రయాణీకులను గమ్యస్థానానికి చేర్చింది.
For more International News and Telugu News