Share News

Nepal PM: నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ నియామకం.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..?

ABN , Publish Date - Jul 14 , 2024 | 09:18 PM

నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారంనాడు నియమించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతి శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Nepal PM: నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ నియామకం.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..?

ఖాట్మండు: నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలి (K.P. Sharma Oli) తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారంనాడు నియమించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతి శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణస్వీకారం చేయనున్నారు.


పుష్కకుమార్ దహల్ ప్రపండ ఇటీవల నేపాల్ పార్లమెంటులో జరిగిన విశ్వాసపరీక్షలో ఓడిపోవడంతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. దీంతో సీపీఎన్-యూఎంఎల్‌కు నేపాలీ కాంగ్రెస్ (ఎన్‌సీ) అధ్యక్షుడు షేర్ బహదూర్ డ్యూబా మద్దతు ప్రకటించారు. సీపీఎన్-యూఎన్ఎన్‌కు 77 సీట్ల బలం ఉండగా, ఎన్‌సీకి 88 సీట్ల బలం ఉంది. దీంతో తమ కూటమికి 165 మంది సభ్యుల బలం ఉందంటూ సంతకాలతో కూడిన పత్రాన్ని నేపాలి అధ్యక్షుడికి ఓలి సమర్పించారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి గతవారం ఓలి, షేర్ బహదూర్ డ్యూబా మధ్య ఏడు పాయింట్లతో కూడిన డీల్ కుదిరింది. అధికారాన్ని ఒకరి తర్వాత పంచుకోవాలనే షరతు ఇందులో కీలకంగా ఉంది. తొలుత 18 నెలలు ఓలి ప్రధానిగా ఉంటారు, ఆ తర్వాత డ్యూబా ప్రధానిగా పగ్గాలు చేపడతారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమవారంనాడు చిన్నగానే తన క్యాబినెట్‌ను ఓలి ఏర్పాటు చేయనున్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు.

Updated Date - Jul 14 , 2024 | 09:18 PM