London : వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్‌లో ఆందోళనలు
ABN , Publish Date - Aug 05 , 2024 | 03:05 AM
వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.
లండన్, ఆగస్టు 4: వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.
సెలవు కావడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు పాల్గొన్నారు. రాళ్లు, ఇటుకలు విసరడం, శరణార్థులు ఉంటున్న హోటళ్ల అద్దాలను పగులగొట్టడం, షాపులపై దాడి చేసి నిప్పుపెట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.
లివర్‌పూల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్‌పూల్, బెల్‌ఫాస్ట్, నోటింగ్‌హామ్, మాంచెస్టర్‌లలో ఆందోళనలు జరిగాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
తీవ్రవాదుల్లా వ్యవహరించే ఆందోళనకారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడాన్ని తాను సమర్థిస్తానని ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. అల్లర్లు చేసేవారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హోం మంత్రి వైవెట్టే కూపర్ హెచ్చరించారు.
వలసవచ్చిన ముస్లిం ఒకరు డ్యాన్స్ క్లాస్‌పై కత్తితో దాడి చేసి ముగ్గురు బాలికల మృతికి కారకుడయ్యాడంటూ తప్పుడు వదంతులు వ్యాపించడంతో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.