Share News

Airlines: ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఎయిర్‌పోర్టులోనే చిన్నారి మృతదేహం

ABN , Publish Date - May 11 , 2024 | 10:12 PM

అప్పటికే తమ కుమారుడు చనిపోయాడన్న బాధలో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. తమ ముందే ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే కొడుకు ఇక లేడన్న విషాదంలో కన్నీటిపర్యంతం అవుతున్నారు.

Airlines: ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. ఎయిర్‌పోర్టులోనే చిన్నారి మృతదేహం

అప్పటికే తమ కుమారుడు చనిపోయాడన్న బాధలో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. తమ ముందే ఆడుతూ పాడుతూ సరదాగా ఉండే కొడుకు ఇక లేడన్న విషాదంలో కన్నీటిపర్యంతం అవుతున్నారు. అలాంటి సమయంలో.. ఎయిర్‌పోర్టు సిబ్బంది చేసిన పనితో వాళ్లు మరింత నిర్ఘాంతపోయారు. తమ కుమారుడి మృతదేహాన్ని ఎయిర్‌పోర్టులోనే మర్చిపోవడంతో.. వాళ్లు మరింత రోధించారు. ఈ హృదయవిదారక ఘటన పాకిస్తాన్‌లో (Pakistan) చోటు చేసుకుంది.


ఆ వివరాల్లోకి వెళ్తే.. గిల్గిత్-బాల్టిస్థాన్‌లోని ఖర్మాంగ్ జిల్లాలో కాట్షి గ్రామానికి చెందిన ముహమ్మద్ అస్కారీకి ముజ్తాబా అనే ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం అతను తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో చేయించిన పరీక్షల్లో.. కణితి ఉన్నట్లు తేలింది. దీంతో.. మెరుగైన చికిత్స కోసం ఆ బాలుడ్ని రావల్పిండిలోని బెనజీర్ భుట్టో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ కొన్ని వారాలపాటు చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ బాలుడు చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచాడు. ఈ వార్త ఆ బాలుడి తల్లిదండ్రుల్ని ఎంతో కుంగదీసింది. ఆరేళ్ల కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో.. తీవ్ర విషాదంలో మునిగారు. గుండె బరువు చేసుకొని.. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని సొంతూరుకు తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కానీ రోడ్డు మార్గంలో వెళితే ఆలస్యమవుతుందని, విమానంలో ప్రయాణించాలని నిర్ణయించారు.

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA)కు చెందిన విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నాక.. కార్గో ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం తల్లిదండ్రులు విమానం ఎక్కేశారు. అక్కడి నుంచి బయలుదేరి గిల్గిత్‌లోని స్కర్దు ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాక.. ఆ పేరెంట్స్‌కి షాకింగ్ విషయం తెలిసింది. అసలు మృతదేహాన్ని విమానంలో ఎక్కించలేదని, ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్టులోనే మర్చిపోయారని తెలిసింది. దీంతో.. తల్లిదండ్రులు గుండెలవిసెలా ఏడ్చారు. అటు.. బంధువులు సిబ్బందిని నిలదీశారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్.. వెంటనే తమ తప్పు తెలుసుకొని, తిరిగి శనివారం నాడు బాలుడి బాడీని అప్పగించారు. కార్గో కంపెనీదే బాధ్యత అని తెలిపిన అధికారులు.. వారిపై చర్యలకు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - May 11 , 2024 | 10:12 PM