Share News

Bangladesh Clashes: హసీనా బ్రిటన్ పయనంపై సందిగ్ధత.. మరో రెండ్రోజులు భారత్‌లోనే

ABN , Publish Date - Aug 06 , 2024 | 04:49 PM

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ నిమిత్తం భారత్‌కి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)కు సంబంధించిన పలు అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Bangladesh Clashes: హసీనా బ్రిటన్ పయనంపై సందిగ్ధత.. మరో రెండ్రోజులు భారత్‌లోనే

ఢిల్లీ: రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ నిమిత్తం భారత్‌కి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌ హసీనా(Sheikh Hasina)కు సంబంధించిన పలు అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోమవారం సాయంత్రమే ఆమె భారత్‌కు రాగా.. మరి కొంత కాలం ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హసీనాకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే షేక్‌ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. కాగా.. ఆమెకు బ్రిటన్ నుంచి ఇంకా అనుమతి లభించలేదని తెలుస్తోంది. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్(UK) అనుమతులు వచ్చే వరకు ఆమె భారత్‌లోనే ఉండనున్నారు.

యూఎన్‌తో విచారించాలి..

బంగ్లాదేశ్‌ తాజా పరిణామాలపై బ్రిటన్‌ ప్రభుత్వం మంగళవారం స్పందించింది. అల్లర్ల కారణంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ప్రాణ నష్టంపై ఐరాసతో దర్యాప్తు జరిపించాలని బ్రిటన్ కోరింది. బంగ్లాలో ప్రభుత్వ మార్పు శాంతియుతంగా జరిగేందుకు అందరూ కృషి చేయాలంది. యూకే విదేశాంగ కార్యదర్శి ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసినా.. అందులో షేక్‌ హసీనాకు ఆశ్రయమిచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.


యూకే పౌరురాలిగా హసీనా సోదరి..

భారత్ నుంచి యూకేకి వెళ్లాలనుకుంటున్న హసీనాకు బ్రిటన్‌లో సోదరి ఉన్నారు. ప్రస్తుతం యూకే పౌరురాలిగా ఉన్న ఆమె పేరు రెహానా. ఆమె కుమార్తె తులిప్‌ ప్రస్తుతం లేబర్‌ పార్టీ తరఫున ఆ దేశ పార్లమెంటులో ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో లేబర్‌ పార్టీనే అధికారంలో ఉండటంతో హసీనా బ్రిటన్‌ని ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. అయితే బ్రిటన్ కూడా ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరిస్తే మరో దేశానికి వెళ్లాలని హసీనా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆమె తన వ్యక్తిగత సిబ్బందితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

For Latest News and National News click here

Updated Date - Aug 06 , 2024 | 04:49 PM