Russia-Ukraine War: తక్షణమే యుద్ధం ఆపేందుకు సిద్ధమేనన్న పుతిన్.. ట్విస్ట్ ఇచ్చిన ఉక్రెయిన్
ABN , Publish Date - Jun 15 , 2024 | 08:03 AM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ప్రారంభమై రెండేళ్లు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై మరొకరు పరస్పర దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఓ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో సంధికి తాము సిద్ధమేనని పేర్కొన్నారు. కానీ.. కొన్ని షరతులు విధించారు. ఈ యుద్ధంలో భాగంగా రష్యా సేనలు ఆశక్రమించిన నాలుగు ప్రాంతాలను ఉక్రెయిన్ వదులుకోవాలని, నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను సైతం ఆ దేశం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ షరతులకు అంగీకరిస్తే.. తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానని వెల్లడించారు.
పుతిన్ డిమాండ్లు
ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే విషయమై.. ప్రపంచ దేశాల నేతలతో శని, ఆదివారాల్లో స్విట్జర్లాండ్ భేటీ నిర్వహిస్తోంది. అయితే.. ఈ భేటీకి హాజరయ్యేందుకు రష్యా నిరాకరించింది. ఈ భేటీ ఉక్రెయిన్ సమస్యను పక్కదారి పట్టించే యత్నంగా ఉందన్న పుతిన్.. ఈ క్రమంలోనే సంధి ప్రతిపాదన తెచ్చారు. ‘‘రష్యా ఆక్రమించిన క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి. అలాగే.. రష్యా సేనలు ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తన బలగాల్ని ఉపసంహరించుకోవాలి. తన సైనిక బలాన్ని పరిమితం చేసుకోవడంతో పాటు అణ్వాయుధ రహిత దేశంగానే ఉక్రెయిన్ కొనసాగాలి. నాటో కూటమిలో చేరే యత్నాన్ని విరమించుకోవాలి’’ అని పుతిన్ డిమాండ్ చేశారు.
Read Also: బస్సుపై ఉగ్రదాడి.. అందరినీ చంపేయాలన్న కసి వారిలో..
అంతేకాదు.. ఉక్రెయిన్‌లో రష్యన్ భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలను కాపాడాలని, రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలను సైతం ఎత్తివేయాలని పుతిన్ కోరారు. ఉక్రెయిన్‌తో తుది పరిష్కారం కోసమే ఈ సంధి ప్రతిపాదన తెచ్చామని.. ఎలాంటి ఆలస్యం లేకుండా చర్చలు ప్రారంభించేందుకు కూడా సిద్ధమని పుతిన్ పేర్కొన్నారు. తమ డిమాండ్లన్నీ ప్రాథమిక అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా ఉండాలన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఐక్యతను దశళవారీగా పునరుద్ధరించాలని కోరారు. ఒకవేళ తన ప్రతిపాదనని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలు తిరస్కరిస్తే.. ఈ రక్తపాతం కొనసాగుతూనే ఉంటుందని హెచ్చరించారు.
ఉక్రెయిన్ రియాక్షన్
అయితే.. ఈ ప్రతిపాదనని ఉక్రెయిన్ తిరస్కరించింది. పుతిన్ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ స్పందించింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండటంతో.. దానిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే పుతిన్ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. పుతిన్ ప్రతిపాదన కొత్తదేమీ కాదని, ఆయన చర్యలు అడాల్ఫ్ హిట్లర్‌ని పోలి ఉన్నాయని చెప్పారు. మరోవైపు.. యుద్ధాన్ని ముగించే ఉద్దేశం పుతిన్‌కు లేదని, ఆయన డిమాండ్లలో కొత్తవేమీ లేవని జెలెన్‌స్కీ సలహాదారు మైఖెలో పొదొల్యాక్ ఆరోపించారు.
Read latest International News and Telugu News