Share News

Nipah Virus: కేరళలో నిఫా కలకలం.. వైరస్ సోకిన బాలుడి మృతి

ABN , Publish Date - Jul 21 , 2024 | 02:43 PM

నిఫా వైరస్(Nipah infection) సోకి చికిత్స పొందుతున్న మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం మృతి చెందినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.బాలుడు ఉదయం 10:50కు తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. అతని ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారని, దురదృష్టవశాత్తు ఉదయం 11:30కు బాలుడు మరణించినట్లు తెలిపారు.

Nipah Virus: కేరళలో నిఫా కలకలం.. వైరస్ సోకిన బాలుడి మృతి

తిరువనంతపురం: నిఫా వైరస్(Nipah infection) సోకి చికిత్స పొందుతున్న మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆదివారం మృతి చెందినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.బాలుడు ఉదయం 10:50కు తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు.

అతని ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారని, దురదృష్టవశాత్తు ఉదయం 11:30కు బాలుడు మరణించినట్లు తెలిపారు. మళప్పురం జిల్లాలో 14 ఏళ్ల బాలుడికి నిఫా వైరస్‌ సోకినట్లు వీణా జార్జ్‌ శనివారమే చెప్పారు. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV) ఈ విషయాన్ని నిర్ధారించినట్లు వివరించారు.


బాధితుడిని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించనున్నట్లు, అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారన్నది ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతలోనే బాలుడు మృతిచెందడంతో అతని కుటుంబంలో తీరని విషాదం నిండింది.

ఆదివారం ఉదయం బాలుడికి మూత్రం ఆగిపోయిందని.. కాసేపటికి గుండెపోటు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బాలుడి అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారన్నారు.


జాగ్రత్తలు తప్పనిసరి..

మలప్పురం జిల్లాలో నిఫా వ్యాప్తికి పాండిక్కాడ్ కేంద్రంగా ఉంది. ప్రజలు, సమీప ఆసుపత్రులు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, ఆసుపత్రుల్లో రోగుల వద్దకు వెళ్లొద్దని ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని వీణా జార్జ్ పేర్కొన్నారు.

పుణె ఎన్ఐవీలో నిల్వ చేసిన ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీ ఆదివారం రాష్ట్రానికి వస్తుందని మంత్రి ప్రకటించారు. ఆరోగ్య శాఖ మంజేరి మెడికల్ కాలేజీలో 30 ఐసోలేషన్ గదులు, ఆరు పడకల ఐసీయూను ఏర్పాటు చేసి కరోనా సోకిన బాలుడితో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరినీ ఐసోలేట్ చేసినట్లు చెప్పారు.

Updated Date - Jul 21 , 2024 | 02:43 PM