Share News

కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు

ABN , Publish Date - Aug 21 , 2024 | 04:58 AM

విపక్షాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. వివాదాస్పదంగా మారిన నేరుగా నియామకాల(లేటరల్‌ ఎంట్రీ) ప్రక్రియను నిలిపివేసింది. 2018 నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన

కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు

పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం

4 రోజుల కిందటి నోటిఫికేషన్‌ నిలిపివేత

విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన మోదీ సర్కారు

నియామకాల్లో సమానత్వం, సామాజిక

న్యాయానికి మోదీ కట్టుబడి ఉన్నారు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌

రిజర్వేషన్లు కాపాడటానికి ఎంతవరకైనా వెళ్తాం: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, ఆగస్టు 20: విపక్షాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. వివాదాస్పదంగా మారిన నేరుగా నియామకాల(లేటరల్‌ ఎంట్రీ) ప్రక్రియను నిలిపివేసింది. 2018 నుంచి అమలు చేస్తున్న ఈ విధానాన్ని పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఇచ్చిన ఆదేశం మేరకు నాలుగు రోజుల క్రితమే ఇచ్చిన ఉద్యోగ నియామకాల ప్రకటనను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రద్దు చేసింది. నోటిఫికేషన్‌ వెలువడగానే కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌గాంధీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లకు గండి కొడుతున్నారని మండిపడ్డారు. దొడ్డిదారిలో ఆరెస్సెస్‌ సానుభూతిపరులను కేంద్ర ప్రభుత్వంలోని కీలక ఉద్యోగాల్లోకి తెచ్చి పెట్టేందుకు ఈ విధానాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయనతో విపక్షాలే కాకుండా ప్రభుత్వంలో భాగస్వాములైన ఎల్‌జేపీ, జేడీయూలు గొంతు కలిపాయి. ఎల్‌జేపీ అధ్యక్షుడు, దళితనేత, కేంద్ర మంత్రి చిరాగ్‌ పాశ్వాన్‌ నేరుగా నియామకాల మీద అభ్యంతరం తెలిపారు. పైవేటు సెక్టారులో ఎలాగూ రిజర్వేషన్లు లేవని, ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్లకు గండి కొడితే ఎలా అని చిరాగ్‌ ప్రశ్నించారు. దాంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు కాంగ్రె్‌సపై ఎదురుదాడికి దిగారు. 2005లో కాంగ్రెస్‌ పాలనలోనే నేరుగా నియామకాల ప్రక్రియకు బీజం పడిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ అన్నారు. వీరప్ప మొయిలీ నేతృత్వంలోని సివిల్‌ సర్వీస్‌ సంస్కరణల కమిటీ వివిధ రంగాల నిపుణులను నేరుగా ఉన్నతోద్యోగాల్లోకి తీసుకోవాలని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు.


2013లో ఆరో వేతన సంఘం కూడా అదే చెప్పిందన్నారు. దాన్నే 2018లో మోదీ సర్కారు అమలు చేసిందని తెలిపారు. కాగా, కూటమిలో అభ్యంతరాల నేపథ్యంలో ప్రధాని కార్యాలయం చిరాగ్‌ పాశ్వాన్‌తో సంప్రదింపులు జరిపింది. పీఎంవో ఆదేశాల మేరకే రద్దు నిర్ణయం వెలువడింది. కేంద్రంలోని వివిధ శాఖల్లో జాయింట్‌ సెక్రెటరీ, డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో 45 మందిని నేరుగా నియమించడానికి ఈ నెల 17న యూపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దానిపై రాజకీయ వివాదం రాజుకోవడంతో మంగళవారం ఉదయమే సిబ్బంది శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ సదరు ఉద్యోగ ప్రకటనను రద్దు చేయాలని కోరుతూ యూపీఎస్సీకి లేఖ రాశారు. నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ మంగళవారం యూపీఎస్సీ సర్క్యులర్‌ జారీ చేసింది. నేరుగా నియామకాల ప్రక్రియను పునఃపరిశీలించాలని నిర్ణయించామని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే ఆధార్‌ సంస్థ యూఐడీఏఐ చైర్మన్‌గా నందన్‌ నీలేకనిని ఇదే పద్దతిలో నియమించారని గుర్తు చేశారు. కేంద్రం నిర్ణయం వెలువడగానే రాహుల్‌గాంధీ.. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ల వ్యవస్థను రక్షించడం కోసం ఎంత వరకైనా వెళతామని ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated Date - Aug 21 , 2024 | 04:58 AM