Share News

Bharat Ratna: భారతరత్నం ‘పీవీ’..

ABN , Publish Date - Feb 10 , 2024 | 04:36 AM

దక్షిణాది నుంచి తొలిసారిగా భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమేగాక దేశానికి ఆర్థిక సంస్కరణల పథాన్ని వేసిన తెలుగుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పీవీతోపాటు మరో

Bharat Ratna: భారతరత్నం ‘పీవీ’..

ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం

మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌, హరిత విప్లవ

పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌కూ..

ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న.. రికార్డు

సంస్కరణల సారథి.. సిసలైన భారత రత్నం

పీఠాధిపతి అవుదామనుకుని.. ప్రధానిగా

బహుభాషా కోవిదుడు.. ఎన్నింటికో ఆద్యుడు

ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పీవీ చలవే

సాహితీమూర్తి.. పాములపర్తి నరసింహారావు

యద్యపి శుద్ధం, లోక విరుద్ధం,

నాచరణీయం, నా కరణీయం

ఆలోచన మంచిదైనప్పటికీ,

ప్రజలు వ్యతిరేకిస్తే దానిని ఆచరించకూడదు

- పీవీ ఇష్టపడే సంస్కృత వాక్యం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది నుంచి తొలిసారిగా భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమేగాక దేశానికి ఆర్థిక సంస్కరణల పథాన్ని వేసిన తెలుగుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పీవీతోపాటు మరో మాజీ ప్రధాని, రైతు నేత చరణ్‌సింగ్‌, విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌లకు కూడా ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు శుక్రవారం తెలియజేసింది. ఇప్పటికే బిహార్‌ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌, బీజేపీ కురువృద్ధ నేత ఎల్‌కే ఆడ్వాణీలకు భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధంగా ఒకే ఏడాది ఐదుగురికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించటం ఇదే ప్రథమం. 1999లో నలుగురికి భారతరత్న ఇచ్చారు. పీవీ, చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు భారతరత్న పురస్కారంపై ప్రధాని మోదీ ట్విటర్‌లో స్పందిస్తూ వారి సేవల్ని కొనియాడారు. ‘మన మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారిని భారతరత్నతో గౌరవిస్తున్నామని తెలియజేయటానికి సంతోషిస్తున్నా. విఖ్యాత మేధావిగా, రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు గారు దేశానికి పలు హోదాల్లో అపారమైన సేవలు అందించారు. ఉమ్మడి ఏపీసీఎంగా, కేంద్రమంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా అనేక సంవత్సరాలపాటు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. భారత్‌ను ఆర్థికంగా ఆధునిక దేశంగా మలచటంలో, దేశాభివృద్ధికి, సుసంపన్నతకు పటిష్ఠమైన పునాది వేయటంలో ఆయన దార్శనిక నాయకత్వం కీలకమైనది. ప్రధానమంత్రిగా నరసింహారావుగారి హయాంలోనే భారత మార్కెట్ల తలుపులను ప్రపంచానికి తెరిచే కీలక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఓ కొత్త ఆర్థిక శకానికి నాంది పలికారు’ అని మోదీ పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానం, భాషలు, విద్యారంగాల్లో పీవీ కృషి, అందించిన సేవలు ఆయన బహుముఖ ప్రజ్ఞను తెలియజేస్తాయన్నారు.

క్లిష్టమైన పరివర్తన దశలో భారత్‌కు సారథ్యం వహించిన నరసింహారావు గారు మన దేశ సాంస్కృతిక, మేధోరంగాలను కూడా సుసంపన్నం చేశారని ప్రధాని మోదీ శ్లాఘించారు. చౌదరీ చరణ్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వటంపై మోదీ స్పందిస్తూ.. ‘రైతు సంక్షేమం కోసం, రైతుల హక్కుల కోసం చరణ్‌సింగ్‌ జీవితాంతం కృషి చేశారు. యూపీ సీఎంగా, కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన రైతుల కోసం అనేక చర్యలు తీసుకున్నారు. జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చరణ్‌సింగ్‌ చేసిన పోరాటం, ప్రజాస్వామ్యం పట్ల ఆయన అంకితభావం జాతి యావత్తుకూ స్ఫూర్తి కలిగించింది’ అని పేర్కొన్నారు. విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ను తాను దగ్గరి నుంచి చూశానని, ఆయన సలహాలకు సూచనలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే వాడినని ప్రధాని వెల్లడించారు. ‘వ్యవసాయం, రైతు సంక్షేమం రంగాల్లో దేశానికి డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ చేసిన సేవలు నిరుపమానమైనవి. భారత వ్యవసాయరంగం గట్టి సవాళ్లను ఎదుర్కొంటూ కూడా స్వయంసమృద్ధి సాధించటంలో, సాగును ఆధునీకరించటంలో ఆయన అత్యంత ముఖ్యపాత్ర పోషించారు. ఆయన దార్శనిక నాయకత్వం దేశ వ్యవసాయరంగం ముఖచిత్రాన్ని మార్చివేయటమే కాదు, దేశానికి ఆహార భద్రతను కల్పించి సంపదను సృష్టించింది’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు.

దిగ్గజాల నేపథ్యం

1991-96 మధ్య దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన పీవీ నరసింహారావు 1921లో జన్మించారు. ఆయన స్వస్థలం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వంగర. వరంగల్‌లో ప్రాథమిక, హైస్కూలు ఉన్నత విద్యాభ్యాసం తర్వాత హైదరాబాద్‌, నాగపూర్‌, పూణేలలో చదివారు. నిజాం వ్యతిరేక పోరాటంతోపాటు స్వాతంత్రోద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. శాసన సభ్యుడుగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, కేంద్రంలో విదేశాంగ, మానవ వనరుల మంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత.. రాజీవ్‌గాంధీ మరణానంతరం ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటు స్థిరంగా దేశాన్ని పాలించిన పీవీ బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, పండితుడుగా గుర్తింపు పొందారు.

రాజకీయ కారణాలు

బీజేపీయేతర పార్టీల నేపథ్యం నుంచి వచ్చిన పీవీ, చరణ్‌సింగ్‌లకు భారతరత్న ప్రకటించటం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తనకు ఆమోదయోగ్యతను సాధించుకునే వ్యూహం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పీవీకి కాంగ్రెస్‌ తగిన గౌరవం ఇవ్వలేదన్న విమర్శ ఎంతోకాలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు భారతరత్న ప్రకటించటం వల్ల కాంగ్రె్‌సపై పైచేయి సాధించటానికి బీజేపీకి మరో కారణం లభిస్తుందని అంటున్నారు. మరోవైపు, చరణ్‌సింగ్‌ మనవడు జయంత్‌సింగ్‌ ప్రస్తుతం రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ) పార్టీకి సారథ్యం వహిస్తున్నారు.

ప్రధానికి పీవీ కుమారుడి కృతజ్ఞతలు

పీవీకి భారతరత్న పురస్కారంపై ఆయన తనయుడు ప్రభాకర్‌రావు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలుగువారికే కాక మొత్తం భారతీయులకు సంతోషం కలిగించే సందర్భమన్నారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు విధ హోదాల్లో దేశానికి సేవ చేసిన తన తండ్రి స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన దూరదృష్టి వల్ల దేశం అభివృద్ధి పథంలోకి పయనించిందని చెప్పారు.

Updated Date - Feb 10 , 2024 | 06:42 AM