Wayanad Landslides: తల్లిని మించిన యోధులు ఎవరూ లేరన్నది ఇందుకేనేమో..!!
ABN , Publish Date - Aug 04 , 2024 | 08:22 AM
‘ కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే ’.. అని ఓ కవి చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏ బిడ్డ అయినా ఆకలితో ఉన్నా.. ఏడ్చినా అమ్మ చూస్తూ ఊరుకోదు.. ఏదో ఒకటి చేసేంత వరకూ అమ్మ మనసు ఊరుకోదు అంతే..! ఇలాంటి సన్నివేశమే కేరళలో కనిపించింది.. ఒకే ఒక్క సందేశంతో కోట్లాది మనసులను గెలుచుకుంది ఆ అమ్మ..! అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ..!
వయనాడ్, ఆంధ్రజ్యోతి: ‘ కంటేనే అమ్మ కాదు.. కరుణించే ప్రతీ దేవత అమ్మే ’.. అని ఓ కవి చెప్పిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఏ బిడ్డ అయినా ఆకలితో ఉన్నా.. ఏడ్చినా అమ్మ చూస్తూ ఊరుకోదు.. ఏదో ఒకటి చేసేంత వరకూ అమ్మ మనసు ఊరుకోదు అంతే..! ఇలాంటి సన్నివేశమే కేరళలో కనిపించింది.. ఒకే ఒక్క సందేశంతో కోట్లాది మనసులను గెలుచుకుంది ఆ అమ్మ..! అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ..!
ఒకే ఒక్క ప్రకటనతో..!
ప్రకృతి ప్రకోపానికి కేరళలోని వయనాడ్ (Wayanad Landslides) వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ విలయంతో ఎక్కడ చూసినా విషాదమే.. రాత్రికి రాత్రే ఈ ప్రాంతాన్ని పూడ్చిపెట్టేసింది..! ప్రకృతి కోపానికి ఇప్పటికే వందలాది మంది మృతి చెందగా.. శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో ఊహించుకోవడానికి లెక్కలేసుకోవడానికి కూడా గుండె బలం సరిపోవడం లేదంటే ఇది ఎంత పెను విషాదమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా తప్పిపోయినట్లు అధికారులు చెబుతున్నారు కానీ.. ఇదే కన్ఫామా అంటే ఇక్కడే పెద్ద కన్ఫ్యూజన్. కొండచరియలు విరిగిపడటంతో ఎంతో మంది తమ ఆత్మీయులను, చిన్నారులను కోల్పోయిన పరిస్థితి. ఈ క్రమంలో ఆ అనాథ బిడ్డలను దత్తత తీసుకొని బంగారంలా చూసుకుంటామని ఎంతో మంది ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఆ చిన్నారులు పెడుతున్న కన్నీళ్లు, ఆర్తనాదాలు విన్న.. ఇడుక్కికి చెందిన సజిన్, భావన అనే దంపతులు చలించిపోయారు. ‘తల్లిపాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా సజిన్ ప్రకటన చేశారు.
మేం రెడీ.. ఫోన్ చేస్తే చాలు!
‘ చిన్న పిల్లలకు తల్లి పాలు కావాలంటే నాకు తెలియజేయండి.. ఆ బిడ్డలకు పాలివ్వడానికి ( బ్రెస్ట్ ఫీడింగ్) నా భార్య సిద్ధంగా ఉంది. మాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సహాయక శిబిరాల్లో ఎవరైనా బిడ్డ ఉంటే జాగ్రత్తగా చూసుకోవడానికే కాదు.. రక్షించడానికి రెడీ.. ’ అని సోషల్ మీడియా ద్వారా సజిన్ పరకార తెలియజేశారు. ఈ ప్రకటన ప్రతి ఒక్కరి మనసును మెలిపెడుతోంది. నిజంగా భావన తీసుకున్న నిర్ణయం.. అమ్మ మనసుకు అద్దం పడుతోందని నెటిజన్లు దండం పెట్టేస్తున్నారు. ఇద్దరి పిల్లలు తల్లి అయినా ఏ మాత్రం సంకోచించకుండా కష్టకాలంలో తనవంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చిన ఈ దంపతుల సాహసాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ‘అమ్మా.. అందుకో వందనం’.. నిజంగా ‘ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు’ అన్న విషయాన్ని అక్షరాలా నిజం చేశారని భావనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. మనుషులే కాదు ప్రకృతి సైతం సైలాం చెప్పేంతలా ఉందీ ప్రకటన అంటూ జనాలు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు చూసిన పలువురు వయనాడ్‌కు రావాలని కబురు పంపగా దంపతులిద్దరూ బయల్దేరి వెళ్లారు. ప్రస్తుతం ఈ దంపతులు వయనాడ్‌లోని మెప్పడి క్యాంపులో ఉన్నారు.