Share News

Lok Sabha Election Results 2024: నితీశ్ కుమార్ యూ-టర్న్.. ఇది దిమ్మతిరిగే ట్విస్ట్?

ABN , Publish Date - Jun 04 , 2024 | 02:36 PM

‘యూ-టర్న్ రారాజు’గా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ-టర్న్ తీసుకోబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన ఆయన..

Lok Sabha Election Results 2024: నితీశ్ కుమార్ యూ-టర్న్.. ఇది దిమ్మతిరిగే ట్విస్ట్?
Is Nitish Kumar Thinking Of Rejoining India Alliance

‘యూ-టర్న్ రారాజు’గా పేరొందిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ-టర్న్ తీసుకోబోతున్నారా? సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా కూటమిని వీడి ఎన్డీఏలో చేరిన ఆయన.. ఇప్పుడు తిరిగి ఇండియా కూటమిలోకి వెళ్లబోతున్నారా? ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఆ ప్రశ్నకు అవుననే సమాధానాలే రాజకీయ విశ్లేషకుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి. అఫ్‌కోర్స్.. ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్‌ని దాటేసిన మాట వాస్తవమే. కానీ.. ఇండియా కూటమికి వచ్చిన స్థానాలు మాత్రం ఎవ్వరూ ఊహించనివి.

ఎన్నికల ముందు బీజేపీ హవా ఎక్కువగా ఉండటం చూసి.. ఇండియా కూటమికి కనీసం 150 స్థానాలు కూడా రాకపోవచ్చని అందరూ అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అవే లెక్కలు చెప్పాయి. ఈసారి ఎన్డీఏ 350కి పైగా స్థానాలతో భారీ విజయం సాధిస్తుందని, ఇండియా కూటమి 150 స్థానాల్లోపే పరిమితం కావొచ్చని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కానీ.. ఆ అంచనాలకు భిన్నంగా కూటమి దూసుకుపోతోంది. 230 నుంచి 240 స్థానాల్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అంటే.. మ్యాజిక్ ఫిగర్ అయిన 272కు దరిదాపుల్లో ఆ కూటమి ఉంది. ఇలాంటి తరుణంలో.. నితీశ్ కుమార్ తిరిగి ఇండియా అలయన్స్‌లోకి వస్తే, కూటమి విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.

కొన్ని రోజుల క్రితమే.. ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఒక పెద్ద ప్రకటన చేశారు. తన పార్టీని కాపాడుకోవడం కోసం నితీశ్ కుమార్ ఏమైనా చేస్తారని, అందుకోసం జూన్ 4వ తేదీ తర్వాత ఎంత పెద్ద నిర్ణయమైనా తీసుకోవచ్చని కుండబద్దలు కొట్టారు. అంటే.. ఇండియా కూటమిలోకి ఆయన తిరిగి రావొచ్చని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. అసలే ఇండియా కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ అత్యంత కీలక పాత్ర పోషించారు కాబట్టి.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కూటమిలోకి తిరిగొచ్చినా ఆశ్చర్యనపోనక్కర్లేదు. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. ఎన్డీఏకు ఆయన గండి కొట్టినట్టే! అప్పుడు ఇండియా కూటమికే గెలుపవకాశాలు ఉంటాయి.

కేవలం నితీశ్ కుమార్ రావడంతో ఇండియా కూటమికి ఆధిక్యం దక్కకపోవచ్చు. కానీ, ఆయన ఇచ్చే ట్విస్ట్‌కి ఇతర ప్రాంతీయ పార్టీలూ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఇండియా కూటమి 240 స్థానాల్లో నెగ్గి, అటు జనతాదళ్ (యూ) బిహార్‌లో 13-14 సీట్లు గెలిస్తే.. అప్పుడు ఇండియా కూటమి ఖాతాలోకి 253-254 సీట్లు వచ్చి చేరుతాయి. మరోవైపు.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కి అటుఇటుగా స్థానాల్ని కైవసం చేసుకోవచ్చు. కాబట్టి.. ఇండియా కూటమి గెలవాలంటే, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకోవాల్సి వస్తుంది. మరి.. ఫైనల్ రిజల్ట్స్ ఎలా వస్తాయో చూడాలి.


మొత్తం ఐదుసార్లు హ్యాండిచ్చిన నితీశ్ కుమార్

* తొలుత 1990లో అప్పటి జనతాదళ్‌ సీనియర్‌ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ముఖ్యమంత్రిగా చేయడంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయితే.. 1994లో లాలూపై తిరుగుబావుటా చేశారు. అనంతరం ప్రముఖ సోషలిస్టు నాయకుడు జార్జ్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీని 2003లో శరద్‌ యాదవ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ (యునైటెడ్‌)లో విలీనం చేశారు. ఆ సమయంలోనే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్.. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

* బీజేపీ-జేడీయూ మధ్య 1998 నుంచి పొత్తులు కొనసాగుతున్నాయి. అయితే.. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరుని బీజేపీ అధిష్ఠానం ఖరారు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే.. 2013 జూన్‌ 16న ఎన్డీఏ నుంచి బయటకి వచ్చేశారు.

* 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగానే పోటీ చేసింది కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాల్ని మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. అప్పుడు రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ), కాంగ్రెస్‌తో కలిసి మహాగఠ్‌బంధన్‌ను ఏర్పాటు చేశారు. ఆర్జేడీకి చెందిన తేజస్వీయాదవ్‌ను డిప్యూటీ సీఎం చేశారు.

* 2017లో తేజస్వీ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. డిప్యూటీ సీఎం పదవి నుంచి వైదొలగాలని ఆయన్ను నితీశ్ కోరారు. అందుకు ఆర్జేడీ శాసనసభా పక్షం ఒప్పుకోకపోవడంతో విభేదాలు తలెత్తాయి. అప్పుడు నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేసి, బీజేపీతో పొత్తు పెట్టుకొని గంటల వ్యవధిలోనే సీఎంగా ప్రమాణం చేశారు.

* 2022లో ఆగస్టు 9న ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన ఆయన.. ఆ తర్వాతి రోజే ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఇండియా కూటమి ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. కానీ.. అక్కడ కూడా తగిన ప్రాధాన్యం లభించడం లేదని తిరిగి ఎన్డీఏలోకి వెళ్లిపోయారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 04 , 2024 | 10:36 PM