Share News

UPSC Prelims Exam: నిమిషం లేటు.. భోరుమన్న సివిల్స్ అభ్యర్థి తల్లిదండ్రులు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 17 , 2024 | 08:32 PM

ఒకే ఒక్క నిమిషం ఆలస్యం ఒక కుటుంబానికి ఊహించని దు:ఖాన్ని కలిగించింది. ఓ యువతి తల్లిదండ్రులను భోరున విలపించేలా చేసింది. కన్నతల్లి సొమ్మసిల్లి పడిపోగా.. తండ్రి నిస్సహా స్థితికి జారుకున్నాడు.

UPSC Prelims Exam: నిమిషం లేటు.. భోరుమన్న సివిల్స్ అభ్యర్థి తల్లిదండ్రులు.. వీడియో వైరల్

ఒకే ఒక్క నిమిషం ఆలస్యం ఒక కుటుంబానికి ఊహించని దు:ఖాన్ని కలిగించింది. ఓ యువతి తల్లిదండ్రులను భోరున విలపించేలా చేసింది. కన్నతల్లి సొమ్మసిల్లి పడిపోగా.. తండ్రి నిస్సహా స్థితికి జారుకున్నాడు. కళ్ల ఎదుట తల్లిదండ్రుల పరిస్థితిని చూసి ఆ యువతి నిర్ఘాంతపోయింది. గురుగ్రామ్‌కు చెందిన ఓ యూపీఎస్సీ సివిల్స్ అభ్యర్థికి ఈ పరిస్థితి ఎదురైంది.


జూన్ 16న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ ప్రిలిమినరీ పరీక్ష కోసం గుర్‌గ్రామ్‌‌కు చెందిన దంపతులు తమ కుమార్తెను ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అయితే నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైన కారణంగా సదరు అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అధికారులు అనమతించలేదు. ఎగ్జామ్ సెంటర్‌లోకి ప్రవేశం కల్పించలేదు. ప్రాధేయపడినా అధికారులు కనికరించలేదు. దీంతో తమ కుమార్తె పడిన కష్టానికి ఫలితం దక్కే అవకాశం లేదని, మరో ఏడాది నిరూపయోగంగా మారుతుందని యువతి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీరుమున్నీరయ్యారు. తల్లి అయితే ఏకంగా సొమ్మసిల్లి కిందపడిపోయింది.


కళ్ల ఎదుటే తల్లిదండ్రులు ఈ విధంగా బాధపడుతుండడాన్ని చూసిన అభ్యర్థి ధైర్య తెచ్చుకొని తల్లిదండ్రులను ఓదార్చింది. ‘‘మంచి నీళ్లు తాగు నాన్నా’’, ‘‘వచ్చే సంవత్సరం రాయవచ్చు అమ్మా’’ అంటూ ఇద్దరికీ సముదాయించే ప్రయత్నం చేసింది. ‘మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు’’ అంటూ మృదువుగా మందలించింది. అయితే ఒక సంవత్సరం వృథాపోయిందంటూ తల్లిదండ్రులు ఇద్దరూ వాపోయారు. ఇదేమీ పెద్ద సమస్య కాదు అంటూ యువతి సమాధానం ఇచ్చింది. ఇంకా చాలా వయస్సు ఉందంటూ వారికి అర్థమయ్యేలా వివరించింది. సొమ్మసిల్లి పడిపోయిన తల్లిని యువతి, ఆమె తండ్రి పక్కకు తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్నవారు తమ సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. కూతురి కోసం తల్లిదండ్రులు ఆ విధంగా తల్లడిల్లిపోవడాన్ని చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా వారికి ధైర్యం చెబుతున్నారు.

Also Read: Read Latest National News and Telugu States News

Updated Date - Jun 17 , 2024 | 08:58 PM