Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పుల్లో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?
ABN , Publish Date - Oct 18 , 2024 | 10:11 AM
ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబర్ ఏడో తేదీన 1,200 మందిని చంపి, 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్న హమాస్ (Hamas) దళాలకు మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి సిన్వర్. ఏడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత ఇజ్రాయెల్ దళాలు సిన్వర్‌ను అంతమొందించాయి.
హమాస్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్ (Yahya Sinwar)ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఇజ్రాయెల్ (Israel)లో గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగిన నరమేథానికి కీలక సూత్రధారి అయిన సిన్వర్ గురించి ఇజ్రాయెల్ తీవ్రంగా గాలిస్తోంది. ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబర్ ఏడో తేదీన 1,200 మందిని చంపి, 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్న హమాస్ (Hamas) దళాలకు మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి సిన్వర్. ఏడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత ఇజ్రాయెల్ దళాలు సిన్వర్‌ను అంతమొందించాయి. ``గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడుల్లో సిన్వర్‌ను అంతమొందించిన దళాన్ని నేను ఇప్పుడు కలుసుకున్నాను`` అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ కల్నల్ హెర్జి హలేవి గురువారం సాయంత్రం ప్రకటించారు.
పాలస్తీనా కోసం పోరాటం..
1962లో దక్షిణ గాజా (Gaza)లోని ఖాన్ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో యహ్వా సిన్వర్ జన్మించాడు. గాజా శరణార్థి శిబిరాల్లో అత్యంత పేదరికం మధ్య ఎదిగిన సిన్వర్ పాలస్తీనా కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. గాజా నుంచి ఇజ్రాయెల్ వాసులను తరిమేయాలని నిర్ణయించుకున్నాడు. గాజాలో హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు. ఇజ్రాయెల్ సైన్యానికి పట్టుబడి ఏకంగా 22 ఏళ్ల పాటు ఇజ్రాయెల్ జైల్లో మగ్గిపోయాడు. 2011లో, గాజాలో కిడ్నాప్ అయిన ఒక ఇజ్రాయెల్ సైనికుడిని తిరిగి అప్పగించాలంటే తనతో సహా ఇజ్రాయెల్ కస్టడీలో ఉన్న 1,027 మంది ఖైదీలను వదిలిపెట్టాలని డిమాండ్ చేశాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత సిన్వర్ హమాస్‌పై గట్టి పట్టు సాధించాడు. ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది పాలస్తీనియన్లను చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు. దీంతో అతడిపై ``కసాయి`` అనే ముద్ర పడింది.
హనియే హతం
ఈ ఏడాది జులైలో ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మసౌద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌లో హతమార్చాయి. హనియే టెహ్రాన్‌లో హత్యకు గురైన తర్వాత హమాస్ రాజకీయ బ్యూరో అధిపతిగా సిన్వర్ నియమితుడయ్యడు. సిన్వర్ వ్యవహార శైలి పట్ల, అతడు ప్రేరేపించే హింస పట్ల హమాస్‌లోనే చాలా మందికి వ్యతిరేక భావం ఉంది. వారందరూ మరో గ్రూప్‌గా ఏర్పడ్డారు. సిన్వర్ నేతృత్వంలోని హమాస్ సంవత్సరాల తరబడి గాజాలో భూగర్భ సొరంగాన్ని తవ్వింది. గాజా కింద 500 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నట్టు పలు నివేదికలు వెల్లడించినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు.
ముమ్మరంగా గాలింపు
ఏడాది పాటు సిన్వర్ కోసం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, మొసాద్ తీవ్రంగా గాలించాయి. ఇజ్రాయెల్ తన మిలిటరీ, ఇంటెలిజెన్స్‌తో పాటు, అత్యాధునిక పెనెట్రేటింగ్ రాడార్‌ను ఉపయోగించింది. ఇజ్రాయెల్ ట్రాకింగ్‌కు చిక్కకుండా ఉండేందుకు సిన్వర్ అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అతడి జాడ తెలుసుకుంది. గాజాలోని ఓ సొరంగంలో ఉన్న సిన్వర్ చుట్టూ మానవ కవచాలు కూడా ఉన్నాయని తెలుసుకుంది. గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఐడీఎఫ్ చంపేసింది. వారిలో యాహ్యా సిన్వార్ ఉండే అవకాశం ఉందని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఆ తర్వాత కొన్ని గంటలకే సిన్వర్ మృతిని ఐడీఎఫ్ ధ్రువీకరించింది.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..