Maharashtra Elections: ఓటేస్తే పెళ్లి చేస్తాం.. బ్యాచిలర్స్‌కు ఎమ్మెల్యే అభ్యర్థి బంపర్ ఆఫర్
ABN , Publish Date - Nov 07 , 2024 | 02:41 PM
పెళ్లికాని ప్రసాదులకు విచిత్ర హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ముంబై: తనకు ఓటేసి గెలిపించిన యువకులకు పెళ్లిళ్లు జరిపిస్తామంటూ ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఇచ్చిన హామీ నెట్టింట వైరలవుతోంది. మరఠ్వాడాలోని బీడ్ జిల్లా నుండి పర్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్సీపీ అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ పోటీ చేస్తున్నాడు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైతే పర్లీకి చెందిన బ్రహ్మచారులందరి పెళ్లి బాధ్యత తనదే అంటూ వాగ్దానం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వీడియో వెలుగులోకి వచ్చింది.
‘‘పర్లిలోని అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు. ఎక్కడికెళ్లినా అబ్బాయిలు ఉద్యోగాలు చేస్తున్నారా లేదా ఏదైనా వ్యాపారంలో ఉన్నారా అనే ప్రశ్నలే అడుగుతున్నారు. ప్రభుత్వం ఉపాధి కల్పించకపోతే వారికి ఉద్యోగాలు ఎలా వస్తాయి? సంరక్షక మంత్రి ధనంజయ్ ముండే చొరవ చూపకపోతే పరిశ్రమలు ఎలా వస్తాయి? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? నాకు ఓటేసి గెలిపిస్తే బ్యాచిలర్స్ కు పెళ్లి చేయడంతో పాటు జీవనోపాధిని కూడా కల్పిస్తానని హామీ ఇస్తున్నాను’’అని మంగళవారం పర్లీలో జరిగిన ప్రచార ర్యాలీలో దేశ్‌ముఖ్ చెప్పాడు. నవంబర్ 20న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో దేశ్‌ముఖ్.. సిట్టింగ్ ఎన్‌సిపి ఎమ్మెల్యే క్యాబినెట్ మంత్రి ధనంజయ్ ముండేపై పోటీ చేస్తున్నారు.
దేశ్‌ముఖ్ వ్యాఖ్యలను ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి అంకుష్ కాక్డే సమర్థించారు. "యువత పెళ్లి చేసుకోకపోవడం - ముఖ్యంగా మరఠ్వాడాలో బిజేపీ, దాని మిత్రపక్షాలు అభివృద్ధి చేశాయని చెప్పినప్పటికీ గత దశాబ్దం కాలంగా ఉపాధి కల్పన దాదాపు శూన్యం. ఇది సామాజిక సమస్యగా మారింది. అలాంటి యువతకు సహాయం చేస్తామని మన నాయకులు ఎవరైనా ప్రతిజ్ఞ చేస్తే తప్పు లేదు. మాట్రిమోనీలు ఏర్పాటు చేయడం సామూహిక వివాహ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అవసరమైన వారికి మేలు చేయొచ్చు" అని అతను చెప్పాడు.
ప్రతిపక్ష అభ్యర్థి ముండే మాట్లాడుతూ.. "నా నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి, నేను సృష్టించిన ఉపాధి అవకాశాల గురించి పర్లి ప్రజలకు తెలుసు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పర్లిలో సిమెంట్ ఫ్యాక్టరీ, సోయాబీన్ పరిశోధన కేంద్రం, సీతాఫలం ఎస్టేట్, వ్యవసాయ కళాశాలలు వచ్చాయి" అన్నాడు. రిజర్వేషన్ సమస్య కారణంగా మరాఠ్వాడాలో పర్లీ వెనుకబడిన నియోజకవర్గాలలో ఒకటిగా ఉంది. ఎన్నికల బరిలో మరాఠా వర్సెస్ ఓబీసీ పోరు కనపడుతోంది.