Share News

Navya : ‘వీల్‌’ పవర్‌ అల్ఫియా జేమ్స్‌...

ABN , Publish Date - May 22 , 2024 | 02:14 AM

అల్ఫియా జేమ్స్‌...ఒకప్పుడు బాస్కెట్‌బాల్‌లో దేశానికి ఆశాకిరణమైన ఆమె ఒక దుర్ఘటన వల్ల వీల్‌ఛైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ ఆ వైకల్యాన్ని ఆమె ఆత్మవిశ్వాసంతో ఎదిరించారు. పారా-బ్యాడ్మింటన్‌లో పతకాల పంట పండిస్తూ...

Navya : ‘వీల్‌’ పవర్‌  అల్ఫియా జేమ్స్‌...

అల్ఫియా జేమ్స్‌...ఒకప్పుడు బాస్కెట్‌బాల్‌లో దేశానికి ఆశాకిరణమైన ఆమె ఒక దుర్ఘటన వల్ల వీల్‌ఛైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. కానీ ఆ వైకల్యాన్ని ఆమె ఆత్మవిశ్వాసంతో ఎదిరించారు. పారా-బ్యాడ్మింటన్‌లో పతకాల పంట పండిస్తూ... దేశంలోనే నెంబర్‌ వన్‌ ర్యాంక్‌లో నిలిచారు. ‘‘దృఢ సంకల్పాన్ని మించిన బలం లేదు. ఓటమి అనే ఆలోచన ఎన్నడూ మనసులోకి రానివ్వకూడదు’’ అంటున్న అల్ఫియా స్ఫూర్తిమంతమైన ప్రయాణం గురించి...

కిందటివారం... దుబాయ్‌లోని ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమం. సెలబ్రిటీగా ఆ వేడుకలో పాల్గొనడానికి వీల్‌ఛైర్‌లో వచ్చారు. అల్ఫియా జేమ్స్‌... తనను స్వాగతించడానికి అక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్‌ హోర్డింగ్స్‌నూ, నిర్వాహకులు, ఆహూతులు తనను అడుగడుగునా అభినందించిన తీరును చూసి ఆమె తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆ కార్యక్రమంలోనే ఆమెకు ‘గోల్డెన్‌ వీసా’కూడా ప్రదానం చేశారు. సత్కారం అనంతరం ఆమె ప్రసంగిస్తున్నప్పుడు... కరతాళ ధ్వనులతో ఆడిటోరియం మారుమోగింది. దురదృష్టం వెంటాడినా... విధిని ఎదిరించి నిలిచిన అల్ఫియా స్థైర్యం, ‘‘గట్టిగా నిశ్చయించుకుంటే ఏదీ అసాధ్యం కాదు’’ అనే ఆమె నినాదం... ప్రేక్షకుల్లో గొప్పస్ఫూర్తిని నింపింది. ‘‘ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఆలోచించాలి. దేన్నైనా మనసారా కోరుకుంటే.. దాని కోసం కష్టపడాలి. అప్పుడు మీరు తప్పకుండా అనుకున్నది సాధించగలరు’’ అంటున్న అల్ఫియా... వైకల్యం ఎదురైనా తన లక్ష్యానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకున్నారు.

  • కొన్నాళ్ళు ఒత్తిడిలో ఉన్నా...

కేరళలోని మువాత్తుపుళ ఆమె స్వస్థలం. ఆమెకు ఏడేళ్ళ వయసున్నప్పుడే తండ్రి జేమ్స్‌ మరణించారు. ‘‘మా అమ్మ బిజ్జీ నర్స్‌. నన్నూ, నా తమ్ముడు అల్ఫిన్‌నూ బాగా చదివించడానికి ఎన్నో కష్టాలు పడింది. హైస్కూల్‌లో ఉన్నప్పడు క్రీడలంటే ఇష్టం ఏర్పడింది. బాస్కెట్‌బాల్‌లో రాణించాను. ఎన్నో పోటీల్లో గెలిచాను. జాతీయ జట్టులో స్థానం సంపాదించాను’’ అని చెప్పారు అల్ఫియా. దేశానికి ఆశాకిరణంగా ఆమెను క్రీడాభిమానులతోపాటు మీడియా అభివర్ణించింది. ఒక నేషనల్‌ టోర్నీకి ఆమె సిద్ధమవుతున్న దశలో దుర్ఘటన జరిగింది. ‘‘అప్పుడు ప్లస్‌ టూ చదువుతున్నాను.


బాస్కెట్‌ బాల్‌ జాతీయ జట్టులో సభ్యురాలిని. ఒక రోజు వర్షం పడుతూ ఉండగా... హాస్టల్‌లోని నా గది నుంచి బయటికి వచ్చాను. ప్రమాదవశాత్తూ కాలు జారడంతో... రెండో అంతస్తు నుంచి కిందపడిపోయాను. తెలివి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. నా వెన్నెముక తీవ్రంగా దెబ్బతిందనీ, ఇక నడవలేననీ, నిలబడడం కూడా కష్టమనీ వైద్యులు చెప్పారు. ఎన్నో నెలలపాటు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. మానసికంగా అలసిపోయాను. నా జీవితం తల్లకిందులైనట్టు అనిపించింది. క్రీడాకారిణిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలన్నది నా కల. అది నెరవేరే పరిస్థితి లేదనే వాస్తవం నన్ను కుంగదీసింది.. కొన్నాళ్ళు డిప్రెషన్‌లోనే ఉన్నాను.

కానీ త్వరలోనే దాని నుంచి బయటపడ్డాను. చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ప్రైవేట్‌గా ఇంటర్‌ పూర్తి చేశాను. డిగ్రీలో మళ్ళీ హాస్టల్‌కు వెళ్ళడానికి మా అమ్మను కష్టం మీద ఒప్పించాను. అలా నా రెండో అధ్యాయాన్ని మొదలు పెట్టాను’’ అని గుర్తు చేసుకున్నారు అల్ఫియా.

  • క్రీడాస్ఫూర్తితో అధిగమిస్తున్నా...

కాలేజీలో చదువుతూనే.. ఆమె తన ఖాళీ సమయాల్లో జిమ్‌కు వెళ్ళి, పవర్‌ లిఫ్టింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. వివిధ పోటీల్లో పాల్గొని, గెలవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేషనల్‌ పారా-లిఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొని... రజత పతకం గెలుచుకున్నారు. ఆ తరువాత బ్యాడ్మింటన్‌ శిక్షణ తీసుకోవాలనుకున్నారు. కానీ కేరళలో వీల్‌ ఛైర్‌ బ్యాడ్మింటన్‌ శిక్షణ కేంద్రాలేవీ లేవు. ఆమె పరిస్థితి తెలుసుకున్న ట్రైనర్‌ బాలా తనే ఏర్పాట్లు చేశారు. అల్ఫియా గురించి తెలుసుకొని, ఆమెను స్పాన్సర్‌ చెయ్యడానికి ‘ఎలైట్‌ గ్రూప్‌’ ముందుకు వచ్చింది. ఉద్యోగం కూడా ఆఫర్‌ చేసింది. దాంతో ఆమె ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.


మొదటి చాంపియన్‌షిప్‌లోనే రెండు స్వర్ణ పతకాలను గెలిచారు. అప్పటినుంచీ ఆమె విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పుడు అల్ఫియా ప్రొఫెషనల్‌ పారా-బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. అనేక జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన ఆమె... భారతదేశం తరఫున దుబాయ్‌, బెహరీన్‌ తదితర దేశాల్లో జరిగిన ఆరు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొని... ఏడు పతకాలను దేశానికి సంపాదించిపెట్టారు. ప్రస్తుతం పారా-బ్యాడ్మింటన్‌లో ఆమె వరల్డ్‌ ర్యాంక్‌ పన్నెండు, ఆసియా ర్యాంక్‌ అయిదు.

భారతదేశంలో ఆమెది నెంబర్‌ వన్‌ ర్యాంక్‌. ‘‘ఈ ఏడాది సమ్మర్‌ పారా-చాంపియన్‌షిప్‌తో పాటు ప్రధానమైన కొన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది. 2026లో జరిగే ఆసియా క్రీడలకు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాను. నా జీవితంలోని చాలా దశల్లో అవరోధాలు ఎదురయ్యాయి. ఎల్లప్పుడూ నాలో ఉన్న క్రీడాస్ఫూర్తే వాటిని అధిగమించేలా చేస్తోంది. మా అమ్మ, తమ్ముడు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తోటి క్రీడాకారులు, అభిమానులు అండగా నిలుస్తున్నారు. వారందరి ప్రేమాభిమానాలే... మరిన్ని పతకాలు సాధించి, మన దేశానికి ప్రతిష్ట తేవాలనే నా లక్ష్యానికి ప్రేరణ’’అంటున్నారు అల్ఫియా.

అప్పుడు ప్లస్‌ టూ చదువుతున్నాను. బాస్కెట్‌ బాల్‌ జాతీయ జట్టులో సభ్యురాలిని. ఒక రోజు వర్షం పడుతూ ఉండగా... హాస్టల్‌లోని నా గది నుంచి బయటికి వచ్చాను. ప్రమాదవశాత్తూ కాలు జారడంతో... రెండో అంతస్తు నుంచి కిందపడిపోయాను. తెలివి వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. నా వెన్నెముక తీవ్రంగా దెబ్బతిందనీ, ఇక నడవలేననీ, నిలబడడం కూడా కష్టమనీ వైద్యులు చెప్పారు.

Updated Date - May 22 , 2024 | 02:17 AM