Share News

Aruna Tirkey : మనదైన ఆహార సంస్కృతి

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:15 PM

‘‘మన ఆహారం మన సంస్కృతిలో భాగం... దానికి దూరమైతే మనల్ని మనం పోగొట్టుకున్నట్టే’’ అంటారు అరుణా టిర్కీ. ఉన్నతోద్యోగాన్ని మానేసి, రెస్టారెంట్‌ తెరిచి, ఆదివాసీ ఆహార సంస్కృతి పరిరక్షణకు

Aruna Tirkey : మనదైన ఆహార సంస్కృతి

‘‘మన ఆహారం మన సంస్కృతిలో భాగం...

దానికి దూరమైతే మనల్ని మనం పోగొట్టుకున్నట్టే’’ అంటారు అరుణా టిర్కీ. ఉన్నతోద్యోగాన్ని మానేసి, రెస్టారెంట్‌ తెరిచి, ఆదివాసీ ఆహార సంస్కృతి పరిరక్షణకు

ఆమె పాటుపడుతున్నారు.

విదేశాల్లో సైతం భారతీయ గిరిజన

వంటకాల్ని రుచి చూపిస్తున్న నలభై తొమ్మిదేళ్ళ అరుణ కథ ఇది...

‘‘ఇది తొమ్మిదేళ్ళ క్రితం మాట. అప్పట్లో ఐక్యరాజ్యసమితి (యుఎన్‌)కి అనుబంధంగా... రాష్ట్రస్థాయిలో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నాను. ఆ బాధ్యతల్లో భాగంగా దేశమంతా పర్యటించేదాన్ని. నేను కలిసిన చాలామంది వ్యక్తులు మా స్థానిక ఆహార రుచుల గురించి అడిగేవారు. నేను జార్ఖండ్‌లోని ఓరాన్‌ తెగకి చెందినదాన్ని. నా చిన్నప్పుడు మా ప్రాంతంలో ఏ ఇంటికి వెళ్ళినా స్థానికమైన సంప్రదాయ ఆహారం కనిపించేది. మేమూ ఇష్టంగా వాటినే తినేవాళ్ళం. మా అమ్మ చేపలు పట్టి తెస్తే... నాన్న ఆకు కూరల్ని, కూరగాయల్నీ స్వయంగా పండించేవారు. దాదాపు గిరిజన కుటుంబాలన్నీ ఇలాగే చేసేవి. కాలక్రమేణా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిని తయారు చేసేవారి సంగతి దేవుడెరుగు... తలచుకొనేవారే కరువైపోయారు. అలాంటి పరిస్థితుల్లో... మీ గిరిజన తెగకు ప్రత్యేకమైన ఆహారం ఏమిటంటే ఏం చెప్పాలి? అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు... ఎన్నో గిరిజన తెగలు తమ వంటకాల మీద ఆసక్తి కోల్పోతున్నారని అర్థమయింది. ప్రతి ప్రాంతానికీ కొన్ని విలక్షణమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి.

అవి అక్కడి ప్రజల సంస్కృతిలో భాగం. అంతేకాదు... మనం ఉండే ప్రాంతంలో వాతావరణానికి తగినట్టు, స్థానికంగా పండే వాటితో పూర్వం ఆహారం ఉండేది. అది ఆరోగ్యప్రదం కూడా. ఇప్పుడు అన్ని చోట్లా అన్ని రుచులూ దొరుకుతూ ఉండడంతో... వాటి పట్ల జనం ఆకర్షితులవుతున్నారు. కొత్త తరం వాళ్ళకు ఇంటి భోజనం నచ్చడం లేదు. మన వాతావరణానికి అనువుకాని ఆహారమే అనేక జీవనశైలి వ్యాధులకు కారణమవుతోంది. ‘ఈ తరానికి సంప్రదాయ ఆహారం విలువను తెలియజెయ్యాలి. ప్రతి గిరిజన గృహంలో వాటిని మళ్ళీ భాగం చెయ్యాలి’ అని నిర్ణయించుకున్నాను. అంతరించిపోతున్న వంటలు, వాటి తయారీ పద్ధతుల గురించి వివరాలు సేకరించడంతో ఆ పని ప్రారంభించాను. దానికోసం ఎన్నో గ్రామాలు తిరిగాను. ఎందరినో కలిశాను. వారికి గుర్తున్న వంటలన్నిటినీ నమోదు చేసుకున్నాను. మా ఇంట్లోనే ప్రయోగాలు చేశాను. అన్నీ కుదిరాయనిపించిన తరువాత 2016లో రాంచీలో జరిగిన ‘అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం’లో... ఒక స్టాల్‌ ఏర్పాటు చేసి, ఆ వంటలను ప్రదర్శించాను. వాటి ప్రత్యేకతను వివరించాను. దానికి నేను ఊహించనంత స్పందన వచ్చింది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ రుచులను మెచ్చుకున్నారు. వాటిని వండే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అప్పుడు జరిగిన గిరిజన వంటకాల పోటీలో... మొదటి బహుమతి నాకే వచ్చింది. ఇది నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.

రుచిగా, ఆరోగ్యంగా...

కేవలం గిరిజన వంటకాలతో ఒక రెస్టారెంట్‌ తెరిస్తే బాగుణ్ణనిపించింది. రెండేళ్ళపాటు డబ్బు కూడబెట్టాను. 2018లో... ఉద్యోగాన్ని వదిలేసి, రాంచీలో రెస్టారెంట్‌ ప్రారంభించాను. దాని పేరు‘ అజెమ్‌ ఎంబా’. అంటే ‘గొప్ప రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం’ అని అర్థం. మొదట్లో ఓరాన్‌, ముండా తెగల గిరిజన కుటుంబాలతో వండించి తెచ్చి విక్రయించేవాళ్ళం. ఆ తరువాత సొంత కిచెన్‌ ఏర్పాటు చేశాను. ఉద్యోగం వదిలేసి... పూర్తి సమయాన్ని రెస్టారెంట్‌ కోసమే కేటాయిస్తున్నాను. మా రెస్టారెంట్‌ పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. అక్కడ వంట నుంచి వడ్డనల వరకూ అన్ని పనులూ గిరిజన మహిళలే చేస్తారు. సేంద్రియమైన దినుసుల్ని అటవీ ప్రాంతాల నుంచి సేకరించి తీసుకువచ్చేవాళ్ళం. యువతను ఆకర్షించడం కోసం మాండ్వా మొమోల్లాంటి వాటితో సహా... నాలుగు తెగలకు చెందిన ఇరవైకి పైగా రుచులను ప్రస్తుతం అందిస్తున్నాం. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పాతికమందికి పైగా స్థానికులకు ఉపాధి కల్పించడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ఉద్యోగం నాకు దేశంలోని వివిధ ప్రాంతాలను పరిచయం చేస్తే... గిరిజన వంటకాల పునరుద్ధరణ ఇటలీ, తైవాన్‌, జపాన్‌ దేశాలకు తీసుకువెళ్ళింది. ఆ దేశాల్లో నిర్వహించిన వివిధ ఆదివాసీ ఉత్సవాల్లో మా వంటకాలు ప్రదర్శించాం. మా రెగ్యులర్‌ కస్టమర్లలో గిరిజనేతరులు కూడా ఎంతోమంది ఉన్నారు. గ్రామీణాభివృద్ధిలో పీజీ డిప్లమా చేసిన నేను పదిహేనేళ్ళపాటు జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆదివాసీలతో కలిసి పని చేశాను. అనేక ఐరాస ప్రాజెక్టుల్లో భాగస్వామినయ్యాను. వాటన్నిటికన్నా ప్రస్తుతం చేస్తున్న పనిని చాలా ఆస్వాదిస్తున్నాను. దాదాపు నూట యాభై దేశాల్లో స్థానిక ఆహారాలను, సంప్రదాయ వంట పద్ధతులను ప్రోత్సహిస్తున్న ‘స్లో ఫుడ్‌’ సంస్థలో సభ్యురాలుగా ఉన్నాను. వివిధ దేశాలకు మా ప్రాంత గిరిజన రుచుల్ని పరిచయం చేస్తున్నాను. సంప్రదాయ ఆహారాన్ని ఆదరించేవారు ఎప్పుడూ ఉంటారనేది నేను తెలుసుకున్న పాఠం. సరైన ప్రచారం, మార్కెటింగ్‌ ఉంటే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల పోటీ తట్టుకోవచ్చు. వీలైనన్ని గిరిజన వంటకాలను పునరుద్ధరించడం, జార్ఖండ్‌ బయట కూడా వాటికి ప్రాచుర్యం కల్పించడం, మరింతమంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడం... ఇవీ నా లక్ష్యాలు.’’.

ఉద్యోగం నాకు దేశంలోని వివిధ ప్రాంతాలను పరిచయం చేస్తే... గిరిజన వంటకాల పునరుద్ధరణ ఇటలీ, తైవాన్‌, జపాన్‌ దేశాలకు తీసుకువెళ్ళింది. ఆ దేశాల్లో నిర్వహించిన వివిధ ఆదివాసీ ఉత్సవాల్లో మా వంటకాలు ప్రదర్శించాం. మా రెగ్యులర్‌ కస్టమర్లలో గిరిజనేతరులు కూడా ఎంతోమంది ఉన్నారు. పదిహేనేళ్ళపాటు జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆదివాసీలతో కలిసి పని చేశాను.

Updated Date - Feb 20 , 2024 | 11:15 PM