Dharma Padham : మరణం తరువాత ఏమౌతుంది?
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:19 AM
బౌద్ధం పునర్జన్మను అంగీకరిస్తుంది. మరణించిన ప్రాణి మళ్ళీ జన్మిస్తాడని బౌద్ధ ధర్మ గ్రంథాలు పేర్కొన్నాయి. హిందూ ధర్మ గ్రంథాల్లో కూడా ఇదే విషయం ఉంది.
బౌద్ధం పునర్జన్మను అంగీకరిస్తుంది. మరణించిన ప్రాణి మళ్ళీ జన్మిస్తాడని బౌద్ధ ధర్మ గ్రంథాలు పేర్కొన్నాయి. హిందూ ధర్మ గ్రంథాల్లో కూడా ఇదే విషయం ఉంది.
బౌద్ధం నాస్తికతకు వ్యతిరేకి. బౌద్ధులు భౌతిక జీవన విధానాన్ని, నాస్తికతను ఎన్నడూ సమర్థించలేదు. దీనికి ఉదాహరణలు కోకొల్లలు. త్రిపిటకాలలో ఒక ఘట్టాన్ని చూద్దాం. పాయాసి రాజు ఆనాటి మేటి తత్త్వాన్వేషి. అతను సేతవ్యా అనే ధన, ధాన్య పరిపూర్ణమైన నగరానికి ప్రభువు. ఆ నగరాన్ని అతనికి బుద్ధ భగవానుడి సమకాలీకుడైన ప్రసేనజిత్తు ఇచ్చాడు. ప్రసేనజిత్తు కోసల రాజ్యానికి రాజు. పాయాసి పూర్ణ భౌతికవాది. కనిపించేవాటిని తప్ప మరి వేటినీ ఒప్పుకొనేవాడు కాదు. పరలోకం, పాపపుణ్యాలు కనిపించవు కాబట్టి వాటిని అంగీకరించేవాడు కాదు. ఆత్మనైతే ససేమిరా ఒప్పుకొనేవాడు కాదు. జీవుడు మరణానంతరం మళ్ళీ పుడతాడన్న సిద్ధాంతాన్ని కూడా అతను అంగీకరించలేదు. మంచి, చెడు కర్మల మీద కూడా అతనికి విశ్వాసం ఉండేది కాదు. పాయాసి రాజు సిద్ధాంతాన్ని బుద్ధుడి శిష్యుడైన కుమార కాశ్యపుడు ఒప్పుకోలేదు. ఒక రోజు పాయాసి పరిపాలించే సేతవ్యా నగరానికి కుమార కాశ్యపుడు వెళ్ళాడు. అతణ్ణి పాయాసి ఆదరాభిమానాలతో ఆహ్వానించాడు. తన సిద్ధాంతాన్ని అతనికి వినిపించాడు.
అయితే బౌద్ధం పునర్జన్మను అంగీకరిస్తుంది. మరణించిన ప్రాణి మళ్ళీ జన్మిస్తాడని బౌద్ధ ధర్మ గ్రంథాలు పేర్కొన్నాయి. హిందూ ధర్మ గ్రంథాల్లో కూడా ఇదే విషయం ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే... శబ్ద ప్రమాణాన్ని నమ్మడం... అంటే పూర్వచార్యులు, ఆప్తులు చెప్పే మాటలను విశ్వసించడం ఎంతో అవసరం. ఎందుకంటే... చనిపోయిన వ్యక్తి నుంచి వేరయిన ఆత్మ మళ్ళీ కొత్త శరీరంలోకి ప్రవేశించే సంఘటనను ఇంతవరకూ ఎవ్వరూ కళ్ళతో చూడలేదు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు యోగ సాధనద్వారా అవగతం అవుతాయేమో కానీ... మామూలు కళ్ళకు కనిపించవు. ఆ సంఘటనను చూద్దామంటే వీలు పడదు.
కానీ పాయాసి చాలా పట్టుదల కలిగిన వ్యక్తి. ‘జీవుడు మరణానంతరం వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాడా?’ అనేది తెలుసుకోవడానికి అతను చాలా ప్రయత్నం చేశాడు. దుష్కర్మలను ఆచరించి, మరణానికి సిద్ధంగా ఉన్న కొంతమంది మిత్రులతో ‘నరకానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చాక, మరణానంతరం ఎక్కడ ఎలా జన్మిస్తారు?’ అనే విషయాన్ని తనతో చెప్పమన్నాడు. కానీ పాయాసి మిత్రులెవరూ తిరిగి వచ్చి ఆ విశేషాలను అతనికి చెప్పలేదు. అలాగే సత్కర్మలను ఆచరించే తన మిత్రులతో ‘త్రాయస్తింశలోకం’ నుంచి, అంటే స్వర్గం నుంచి మళ్ళీ భూలోకానికి వచ్చాక... ఆ విశేషాలు తనతో చెప్పమన్నాడు. కానీ ఎవ్వరూ తిరిగి రాలేదు, ఆ విషయాలను చెప్పనూ లేదు. దాంతో అతను పరలోకం ఒకటి ఉందని ఒప్పుకోవడం మానేశాడు. అయితే పాయాసి సిద్ధాంతాన్ని కుమార కాశ్యపుడు అంగీకరించలేదు.
ఆచార్య చౌడూరి ఉపేంద్ర రావు,
జేఎన్‌యు, న్యూఢిల్లీ.
+91 98189 69756