Share News

Navya : నాన్‌వెజ్‌తో వంకాయల దోస్తీ

ABN , Publish Date - Jul 27 , 2024 | 05:39 AM

వంకాయలతో గుత్తొంకాయ, వంకాయ చట్నీ, వంకాయ ఫ్రై చేసుకోవటం కామన్‌. అయితే చికెన్‌, మటన్‌తో వంకాయలను కలిపి చేసుకోవటం డిఫరెంట్‌. వంకాయ చికెన్‌, వంకాయ మటన్‌ కర్రీలను ఈ వీకెండ్‌లో వండుకోండిలా...

 Navya : నాన్‌వెజ్‌తో వంకాయల దోస్తీ

వంటిల్లు

  • వంకాయ చికెన్‌ కర్రీ

కావాల్సిన పదార్థాలు

చికెన్‌ ముక్కలు- అర కేజీ, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, మీడియం సైజ్‌ ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్‌- 2 టీస్పూన్లు, మీడియం సైజ్‌ టమోటాలు-2 (సన్నగా తరగాలి), కారం పొడి- 2 టీస్పూన్లు, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, పసుపు- చిటికెడు, ఎండు మిరపకాయలు- 2, పచ్చ వంకాయలు - 300 గ్రాములు (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి), గరం మసాలా- టీస్పూన్‌, కొత్తిమీర- టేబుల్‌ స్పూన్‌

  • తయారీ విధానం

కుక్కర్‌లో నూనె వేడయ్యాక.. ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయల రంగు మారిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, టమోటా ముక్కలు వేసి.. గరిటెతో టమోటా ముక్కలను ఒత్తినట్లు కలపాలి. తగినంత ఉప్పు వేశాక.. కారంపొడి, ధనియాల పొడితో పాటు కొద్దిగా పసుపు వేసి, ఎండు మిరపకాయలను సన్నగా తుంచేసి గరిటెతో కలపాలి. మూడు నిముషాల తర్వాత నూనె పైకి తేలి ఉడికినట్లు ఉన్నప్పుడు.. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్‌ ముక్కలు వేసి కలపాలి.

వెంటనే వంకాయ ముక్కలు వేసి కలిపాక.. అరకప్పు నీళ్లు పోసి కలపాలి. కుక్కర్‌ మూత పెట్టి మూడు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. కుక్కర్‌ మూత తీసి కలిపిన తర్వాత మరో ఐదు నిముషాలు ఉడికిస్తే నీటిశాతం తగ్గిపోయి గ్రేవీ బాగా వస్తుంది. గరం మసాలా, కొత్తిమీర వేసిన తర్వాత మరో మూడు నిముషాలు ఉడికిస్తే గ్రేవీ చికెన్‌ ముక్కలకు బాగా పడుతుంది. నూనె పైకి తేలుతుంది. గరిటెతో ఒకసారి తిప్పి రెండు నిముషాల తర్వాత దించేసుకోవాలి. ఈ వంకాయ చికెన్‌ కర్రీని చపాతీ, పరోటా లేదా అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.


కావాల్సిన పదార్థాలు

మటన్‌- 600 గ్రాములు, పచ్చ వంకాయలు- అర కేజీ, మీడియం సైజ్‌ టమోటాలు-4 (సన్నగా తరగాలి), నూనె- అరకప్పు, ఎండుమిర్చి- 8, ఎండు కొబ్బెర- పది పొడవైన ముక్కలు, ధనియాలు- రెండున్నర టీస్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు టీస్పూన్లు, కొత్తిమీర- రెండు టేబుల్‌ స్పూన్లు, పసుపు- చిటికెడు, ఉప్పు- రుచికి తగినంత, గరం మసాలా- టీస్పూన్‌, దాల్చిన చెక్క- చిన్న ముక్క, లవంగాలు- 6

తయారీ విధానం

ముందుగా శుభ్రంగా మటన్‌ను కడిగి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత బౌల్‌లో మటన్‌ వేసి.. ఉప్పు, పసుపు వేసి కలిపిన తర్వాత కుక్కర్‌లో వేయాలి. ఒకటిన్నర టేబుల్‌ స్పూన్ల నూనె వేసిన తర్వాత అరకప్పు నీళ్లు పోసి.. కుక్కర్‌ మూత పెట్టి ఆరు విజిల్స్‌ వచ్చేంత వరకూ ఉడికించి పక్కన ఉంచుకోవాలి.

ప్యాన్‌లో ధనియాలు, మిరపకాయలు వేసి వేయించుకోవాలి. వీటిని చల్లార్చిన తర్వాత జార్‌లో ధనియాలు, మిరపకాయలతో పాటు ఎండుకొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, గరం మసాలా వేసి మిక్సీ పట్టాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కొత్తిమీర వేసి కొన్ని నీళ్లు పోసి మిక్సీపట్టాలి. చట్నీలా మెత్తగా అవుతుంది.

ముందుగా ఉప్పు నీళ్లలో వంకాయ ముక్కలను పది నిమిషాల ముందు నానబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. వెంటనే గుంతప్యాన్‌లో మిగిలిన నూనె పోసి.. మిక్సీ పట్టిన మిశ్రమం వేసి గరిటెతో కలపాలి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే మిక్సీ పట్టిన మసాలాను కుక్‌ చేస్తే నూనె పక్కకు వస్తుంది. అప్పటి వరకూ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత వంకాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసి కలపాలి. రెండు నిముషాల తర్వాత ఉడకబెట్టిన మటన్‌ వేశాక గ్లాసు నీళ్లు పోసి కలిపిన తర్వాత ప్యాన్‌ మీద మూత ఉంచి ఆరు నిముషాల పాటు కుక్‌ చేయాలి. గరిటెతో కలిపిన తర్వాత మళ్లీ కుక్‌ చేయాలి. ఇలా బాగా ఉడుకుపట్టి నూనె తేలేంత వరకూ ఉడికించాలి. మంచి గ్రేవీ కూడా పడుతుంది. వంకాయ ముక్కలు ఉడికాయో లేదో చూసుకుని దించేసుకోవటమే. అన్నంతో లేదా చపాతీతో తింటే రుచిగా ఉంటుంది.

Updated Date - Jul 27 , 2024 | 05:46 AM