Share News

పసరుమందుతో కామెర్లు తగ్గుతాయా?

ABN , Publish Date - Jul 25 , 2024 | 05:20 AM

డాక్టర్‌! మా అబ్బాయికి 13 ఏళ్లు. కామెర్లు సోకడంతో బడి మాన్పించి ఇంటికే పరిమితం చేశాం. అలాగే ఉప్పు, కారాలు లేని చప్పని భోజనంతోనే సరిపెడుతున్నాం. పసరు మందు ఇప్పిస్తున్నాం. కాబట్టి సాధారణ వైద్యం

పసరుమందుతో కామెర్లు తగ్గుతాయా?

డాక్టర్‌! మా అబ్బాయికి 13 ఏళ్లు. కామెర్లు సోకడంతో బడి మాన్పించి ఇంటికే పరిమితం చేశాం. అలాగే ఉప్పు, కారాలు లేని చప్పని భోజనంతోనే సరిపెడుతున్నాం. పసరు మందు ఇప్పిస్తున్నాం. కాబట్టి సాధారణ వైద్యం అవసరం లేదని అంటున్నారు. పసరు మందు సరిపోతుందా లేదంటే అదనంగా ఇతరత్రా మందులేమైనా అవసరమవుతాయా?

కామెర్లకు కారణం కాలేయం జబ్బు పడడమే! అయితే కాలేయం ఎందుకు జబ్బు పడిందో కారణం తెలుసుకుని తగిన వైద్యం ఇప్పించడం అవసరం. హెపటైటిస్‌ బి, సి వైర్‌సల వల్ల కూడా కాలేయం దెబ్బతింటుంది. ఈ వైర్‌సలను సమూలంగా నాశనం చేయాలంటే వైద్యులను కలిసి సమర్థమైన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. సోకిన వైరస్‌నుబట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా కామెర్లకు నాటు మందులు వాడడం ప్రమాదకరం. వాటిలోని హెవీ మెటల్స్‌ కాలేయానికి కీడు చేసి, సమస్యను తీవ్రతరం చేస్తాయి. నాటుమందులు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా, కాలేయం మరింత దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నాటు మందుల జోలికి వెళ్లకుండా అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. ఒకవేళ పదే పదే కామెర్లు వేధిస్తున్నా, నిస్సత్తువ, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నా కాలేయ వ్యాధిగా పరిగణించి, వైద్యులను ఆశ్రయించాలి. తోచిన చికిత్సలకు, చిట్కాలకు స్వస్థి చెప్పి వైద్యులను కలిసి తగిన పరీక్షలతో కామెర్లకు మూల కారణాన్ని గుర్తించి సమర్థమైన చికిత్సలు అందించడం శ్రేయస్కరం. ఇక పత్యం విషయానికొస్తే, జబ్బుపడిన కాలేయం నుంచి ఎంజైమ్స్‌ స్రావం తగ్గుతుంది కాబట్టి తేలికగా అరిగే ఆహారం అందించాలి. అలాగని పోషకాల కొరతకు గురయ్యేలా పత్యం ఉంచవలసిన అవసరం లేదు. నూనె తగ్గించాలి. పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. కూరగాయలు, పప్పు, ఆకుకూరలు, పండ్లు, నట్స్‌ భోజనంలో ఉండేలా చూసుకోవాలి. బలవర్థకమైన ఆహారంతో కామెర్ల నుంచి త్వరగా కోలుకోగలుగుతారు. కాబట్టి మాంసాహారం మినహా మిగతావన్నీ మునుపటిలాగే తినిపించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా పసరు మందులు మానేసి, వైద్యులు సూచించిన కామెర్ల మందులను వాడుకోవాలి.

డాక్టర్‌ రమేష్‌,

గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - Jul 25 , 2024 | 05:20 AM