Share News

Geeta Madhuri : గొంతు ఒక మిషన్‌ కాదు..

ABN , Publish Date - Jun 09 , 2024 | 03:03 AM

ఈ తరం గాయనీమణులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవారిలో గీతా మాధురి ఒకరు.ప్రస్తుతం ‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3’కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. గత దశాబ్దకాలంగా తెలుగువారిని తన పాటల ద్వారా, షోల ద్వారా అలరిస్తున్న గీతా మాధురితో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

 Geeta Madhuri :  గొంతు  ఒక మిషన్‌ కాదు..

సండే సెలబ్రిటీ

ఈ తరం గాయనీమణులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవారిలో గీతా మాధురి ఒకరు.ప్రస్తుతం ‘ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 3’కి జడ్జీగా వ్యవహరిస్తున్నారు. గత దశాబ్దకాలంగా తెలుగువారిని తన పాటల ద్వారా, షోల ద్వారా అలరిస్తున్న గీతా మాధురితో ‘నవ్య’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

మీ గీతాల ప్రస్థానం ఎలా సాగుతోంది?

జర్నీ చాలా బావుంది. ఇప్పటిదాకా నేను సాధించిన దానికి నాకు తృప్తిగా ఉంది.

గొప్పగా వెలిగిన గాయకులు హఠాత్తుగా ఎందుకు మాయమయిపోతూ ఉంటారు?

కొందరికి వెలుగు వెలిగి ఆరిపోవటం అనేది ఉండదు. అయితే కొందరికి తప్పదు. దీనిని నేను వేరేగా ఆలోచిస్తా. ఒక కంపెనీని తీసుకోండి. దానికి ఒక ఉచ్ఛస్థితి ఉంటుంది. కొన్ని కంపెనీలు మూతపడిపోతాయి. కొన్ని కొనసాగుతూ ఉంటాయి. మరికొన్ని బోటాబోటిగా సాగుతాయి. ఇలాంటి పరిస్థితులు కంపెనీలకే కాదు గాయకులకు, నటులకు.. అందరికీ వస్తుంది. ఇక గాయకుల విషయానికి వద్దాం. అవకాశాలు రాక వదిలేశారా? వచ్చినా సరిగ్గా పాడలేకపోయారా? పరిస్థితులు అనుకూలించ లేదా? ఇలా ప్రతి వ్యక్తికీ ఒక్కో కథ ఉంటుంది. కొంతమంది వేరే కెరీర్స్‌లోకి వెళ్లిపోతారు. కొంతమంది ఇతర దేశాలకు వెళ్లిపోతారు. కొందరికి అవకాశాలు రావు. వీటన్నింటినీ ఒకే గాటన కట్టలేం. ప్రతి వ్యక్తికి ఒక వెలుగు ఉంటుంది. ఆ సమయంలోనే వారిని పిలుస్తారు.


మీ కెరీర్‌లో ఎక్కువ సంతృప్తి ఇచ్చిన సంఘటన ఏదైనా ఉందా?

ఇళయరాజాగారి షోలో పాటపాడటం అనేది నాకు అత్యంత సంతృప్తి ఇచ్చిన సంఘటన అని చెప్పాలి. సుమారు 15 ఏళ్ల క్రితం అనుకుంటా. అప్పుడప్పుడే సినిమాల్లో పాడటం మొదలుపెట్టా. ఆ సమయంలో ఇళయరాజా షోలో పాడటం పాడటం అనేది నాకు అమూల్యం. నేను కలలో కూడా అది అనుకోలేదు. ఆ తర్వాత మళ్లీ కుదరలేదు. ఈ రోజు (శనివారం) హైదరాబాద్‌లో జరుగుతున్న ఇళయరాజా షోలో యాంకరింగ్‌ చేస్తున్నా. మధ్యలో ఒకటి రెండు అవకాశాలు వచ్చాయి. ఒకసారి నేను హైదరాబాద్‌లో లేను. వేరే దేశానికి వెళ్లాను. మరో సారి కూడా కుదరలేదు.

ఒక గాయనిగా మీకు ఎక్కువ తృప్తిని ఇచ్చే విషయం ఏమిటి?

మాకు ఎలా ఉంటుందంటే- ఒక రికార్డింగ్‌ పూర్తయ్యే వరకు ‘సంగీత దర్శకుడికి నచ్చుతోందా? లేదా?’ అనే సందిగ్దత ఉంటుంది. ‘నేను వాళ్లకు నచ్చినట్లు పాడానా? సినిమాలో ఈ పాట ఉంటుందా? లేదా?’... ఇలాంటి అనుమానాలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ అనుమానాలు అందరిలోనూ ఉంటాయి. ఎందుకంటే మేము ఒక్క సంగీత దర్శకుడికే కాదు... అనేకమందికి పాటలు పాడతాం. షోలు చేస్తూ ఉంటాం. ప్రతి పాట, ప్రతి షో కొత్తదే! చాలా ముఖ్యమైనదే! అందువల్ల ఎప్పుడూ అలాంటి అనుమానాలు ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది. ఇదొకటి అయితే- నేను ఎప్పుడు గాయని అవుతానని అనుకోలేదు. అలాంటిది గాయని అయ్యానంటే ఇప్పటికీ ఆనందంగా అనిపిస్తుంది.


మీరు పరిశ్రమకు వచ్చే నాటికీ, ఇప్పటికీ తేడా ఏదైనా ఉందా?

ఇప్పుడు ఇంకా ఎక్కువ పోటీ ఉందనిపిస్తోంది. ఇప్పుడు సోషల్‌ మీడియాకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ మందికి పాటలు చేరుతున్నాయి. ఇవన్నీ కూడా ‘మనం దేన్ని కోరుకుంటున్నాం?’ అనే విషయంపై ఆధారపడి ఉంటాయి. సినిమాలలో పాడాలనుకొనేవారికి అదే లక్ష్యం కాబట్టి దానికొక మార్గం ఉంటుంది. పోటీ వేరేగా ఉంటుంది. పాటలు పాడి యూట్యూబ్‌లో పెట్టుకొనేవారికి పోటీ వేరేగా ఉంటుంది. అది యూట్యూబ్‌ కాంపిటేషన్‌. కానీ ఎక్కువ మంది సినిమాల్లో పాడాలనుకుంటారు.

కొత్తగా వచ్చిన వారు విజయం సాధించాలంటే ఏం చేయాలి?

ఓర్పు, కష్టపడి పనిచేయటం, ఎప్పుడూ నేర్చుకోవటం. వీటన్నింటిలోను నేర్చుకోవటం ముఖ్యం. మంచి గురువు దగ్గరకు వెళ్లాలి. ఆ తర్వాత అనుభవం చాలా ముఖ్యం. ప్రతి పోటీకి వెళ్లాలి. పాడాలి. ఎన్ని డబ్బులు వస్తున్నాయని చూసుకోకూడదు. మొదటే ‘పుష్ప’లో పాడేయ్యాలనుకోకూడదు. అనుభవం వస్తే ఎక్కువ కాలం నిలబడగలుగుతారు. ‘‘కేరాఫ్‌ కంచరపాలెం’’ అనే సినిమాలో ‘ఆశాపాశం...’ అనే పాట అనురాగ్‌ కులకర్ణి పాడాడు. చిన్న సినిమా అని తను వదిలేస్తే ఆ పాట వచ్చేది కాదు కదా!

కానీ జర్నీ అంత సులభం కాదు కదా?

మన ఊహాలు ఎక్కువగా ఉంటే బాధ కూడా ఎక్కువే ఉంటుంది. మనకన్నా లేని వాళ్లతో పోల్చుకుంటే ఎక్కువ నిరాశ ఉంటుంది. నేను ఎప్పుడూ నాకు లభించిన చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ఆనందపడతాను. దేవుడు నాకు ఎంతో ఇస్తున్నాడు అనుకుంటా! అంతే కాదు. నేను మనందరినీ నడిపించే ఒక శక్తి ఉందని నమ్ముతా!

మీరు ఎమోషనల్‌ వ్యక్తా?

నేను ఎమోషనల్‌గా ఉండకూడదని ప్రయత్నిస్తాను. నా ఎమోషన్స్‌ ఆపుకోను. కాను వీలైనంత వరకు బ్యాలెన్స్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను.

మీరు పాడలేని పాటలేవైనా ఉన్నాయా?

కొన్ని పాడక వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు చాలా సులభమైన పాటలు కూడా పాడలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడో విషయం చెప్పాలి. ఇది మూడ్‌కు సంబంధించిన విషయం. గొంతు అనేది మిషన్‌ కాదు. ఒకో రోజు ఒకేలా ఉంటుంది. గొంతు అనేది మన చేతుల్లో ఉండదు.


మీకు నచ్చిన గాయకులు ఎవరు?

బాలుగారు, చిత్రగారు, శ్రేయ ఘోషల్‌, సునీతగారు నాకు చాలా ఇష్టం.

మీ గొంతులో ఉన్న స్పెషాలిటీ ఏమిటి?

నేను కెరీర్‌ మొదలుపెట్టినప్పుడు నా గొంతు భిన్నంగా ఉందని అందరూ అనేవారు. పదిమందిలో పాడినా నా గొంతు అందరికీ వినిపిస్తుంది. అందుకే నాకు పాటలు వచ్చాయని అనుకుంటున్నా. ఇప్పుడు భిన్నంగా పాడేవాళ్లే వస్తున్నారు. అందువల్ల ఇప్పుడు సాధారణమైపోయింది.

బ్బింగ్‌ అనేది నాకు ప్రత్యామ్నాయ ప్రొఫెషన్‌ కాదు. నా గొంతు నచ్చి, బాగా ఒత్తిడి పెట్టినప్పుడు మాత్రమే డబ్బింగ్‌ చెప్పాను. అందుకే రెగ్యులర్‌గా డబ్బింగ్‌ చెప్పలేదు.

-సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Jun 09 , 2024 | 03:15 AM