Guneet Monga Kapur : ఎంత లోకల్ అయితే అంత గ్లోబల్ అవుతాం
ABN , Publish Date - Sep 22 , 2024 | 05:50 AM
‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’, ‘లంచ్ బాక్స్’, ‘ఎలిఫెంట్ విష్పరర్స్’, ‘కిల్’... ఇలా భిన్నమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత గునీత్ మోంగా కపూర్. వాటిలో ‘ఎలిఫెంట్ విష్పరర్స్’... గత ఏడాది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తీసిన ‘గెహరా... గెహరా’ వెబ్ సిరీస్ జీ5లో ప్రసారమవుతోంది. ఆస్కార్ తర్వాత మారిన తన జీవితం గురించి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
సండే సెలబ్రిటీ
‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’, ‘లంచ్ బాక్స్’, ‘ఎలిఫెంట్ విష్పరర్స్’, ‘కిల్’... ఇలా భిన్నమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత గునీత్ మోంగా కపూర్. వాటిలో ‘ఎలిఫెంట్ విష్పరర్స్’... గత ఏడాది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తీసిన ‘గెహరా... గెహరా’ వెబ్ సిరీస్ జీ5లో ప్రసారమవుతోంది. ఆస్కార్ తర్వాత మారిన తన జీవితం గురించి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
‘ఎలిఫెంట్ విష్పరర్స్’కు ఆస్కార్ లభించిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులేమిటి?
జాతీయంగా, అంతర్జాతీయంగా చాలా మంచి పేరు వచ్చింది. ఆస్కార్ లభించిన తొలి నిర్మాణ సంస్థ మాదే కావటం, ఆస్కార్ లభించిన తొలి భారతీయ చిత్రం కావటం- ఇలా అనేక రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే- అనేక అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు మాతో భాగస్వాములు కావటానికి ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థలకు మనం మంచి సినిమాలు తీయగలమనే నమ్మకం కుదిరింది.
ఓటీటీ మన జీవితంలో భాగమయిన తర్వాత సినిమాను చూసే విధానం ఏదైనా మారిందా?
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కొవిడ్ చాలా మేలు చేసింది. ఆ సమయంలో ఎక్కువ మంది ఇళ్లల్లోనే ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం మంది ఏం చేయాలో తెలియక ఓటీటీల్లో చిత్రాలు చూడటం మొదలుపెట్టారు. భారతీయ భాషల్లో వచ్చే సినిమాలు, సిరీ్‌సలు, షోలు మాత్రమే కాకుండా... ఇంగ్లీషు, కొరియన్, జపనీస్‌లాంటి భాషల్లో వచ్చిన కంటెంట్‌ను కూడా చూసేశారు. ఓటీటీకి ప్రేక్షకులను ఆకర్షించే శక్తి ఉంది. దీనివల్ల ప్రేక్షకుల్లో మార్పు తప్పనిసరిగా వస్తుంది. కొవిడ్‌వల్ల ఆ మార్పు వేగంగా వచ్చేసింది. అంటే మామూలుగా ఐదేళ్లలో రావాల్సిన మార్పు ఏడాదిలో వచ్చేసింది. దీనివల్ల ప్రేక్షకుల అభిరుచి మారింది.
మంచి కంటెంట్ ఇవ్వాలనే ఒత్తిడి ఫిల్మ్ మేకర్ప్‌పై పెరిగిందా?
ఒత్తిడి పెరిగింది. కానీ ఆ ఒత్తిడి ప్రేక్షకుల నుంచి రావటం లేదు. ఫిల్మ్‌మేకర్స్ తమకు తాముగానే అంతర్జాతీయ కంటెంట్‌తో పోటీ పడుతున్నారు. ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫాంనైనా తీసుకోండి. దానిలో మన వాళ్లు తీసిన కంటెంట్ ఉంటుంది. ఇతరులు తీసిన కంటెంట్ కూడా ఉంటుంది. ప్రేక్షకులు ఏ కంటెంట్ బావుంటే దాన్నే చూస్తున్నారు. దీనివల్ల ఫిల్మ్ మేకర్స్ మీద మంచి కంటెంట్ ఇవ్వాలనే ఒత్తిడి పెరిగింది. ఇక్కడొక విషయం చెప్పాలి. చిత్ర నిర్మాణంలో మనం ప్రపంచంలో ఎవరి కన్నా తక్కువ కాదు. మన దగ్గర అద్భుతమైన టాలెంట్ ఉంది. ఈ టాలెంట్ బయటకు రావాల్సిన సమయం ఆసన్నమయింది. ఇక ఛాలెంజ్‌ల విషయానికి వస్తే- సినిమాను కావాలంటే మూడు నెలల్లో తీయవచ్చు. కానీ ఎనిమిది గంటలు ఉండే వెబ్ సిరీస్ తీయాలంటే ఏడాది నుంచి రెండేళ్లు పడుతుంది. ఇదీ మన ముందున్న సవాల్.
సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మీరు ఎప్పుడైనా వివక్ష ఎదుర్కొన్నారా?
ఒక మహిళగా నాకు ఎటువంటి సమస్యలు రాలేదు. కానీ వయస్సు విషయంలో వచ్చింది. నన్ను చాలామంది చిన్న పిల్లలా చూసేవారు. నేను చిన్న వయస్సులోనే సినీ రంగంలోకి వచ్చాను. 26 ఏళ్ల వయస్సులో ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’ తీశా. 28 ఏళ్లకు ‘లంచ్‌బాక్స్’ సినిమా తీశాను. అవి తీసింది నేనేనంటే ఎవరూ నమ్మేవారు కాదు. ‘మీ టూ’ ఉద్యమం వచ్చిన తర్వాత నాకు ఎదురవుతున్న సమస్య ఏమిటో అర్థమయింది. అప్పటిదాకా ‘నా వయస్సు చిన్నది కాబట్టి.. నన్ను సీరియ్‌సగా తీసుకోవటం లేదు’ అని ఎప్పుడూ అనుకోలేదు. నా పని బాగా చేయాలనుకున్నానంతే! ‘మీ టూ’ ఉద్యమం సమయంలో మహిళ వివక్షతో పాటుగా వయస్సుకు సంబంఽధించిన వివక్ష కూడా ఉంటుందనే విషయం అర్థమయింది.
మీ దృష్టిలో సినీ రంగంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలేమిటి?
అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో టాలెంట్‌ను దెబ్బతీసే ఒక సమస్య కూడా ఉంది. సాధారణంగా సినీ రంగంలో పనిచేసే మహిళలకు... వారు పెళ్లి చేసుకున్న తర్వాత బ్రేక్ వస్తుంది. కొద్ది కాలం తర్వాత మళ్లీ తిరిగి వస్తే- వారికి పని దొరకదు. ఒకప్పుడు అద్భుతమని పొగిడిన వాళ్లు కూడా పని ఇవ్వటానికి ముందుకు రారు. ఈ వివక్ష పురుషులకు ఉండదు. ఎడిటర్స్, రైటర్స్, సినిమాటోగ్రాఫర్స్, డ్యాన్సర్స్- ఇలా నేను ఎంతోమందితో మాట్లాడాను. మిడ్ కెరీర్ ఎంట్రీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి. సోషల్ మీడియాలో చూస్తే వాళ్లకు అన్నీ ఉన్నాయనిపిస్తాయి. కానీ మాట్లాడితే అసలు విషయం తెలుస్తుంది.
మీరు సోషల్ మీడియాను ఫాలో అవుతారా?
అవుతాను. సోషల్ మీడియా కూడా పాప్‌కల్చర్ లాంటిదే! మనకు వెంటనే రెస్సాన్స్ తెలిసిపోతుంది. ఇంతకుముందు మనకు ప్రజల నుంచి స్పందన తెలియాలంటే వెంటనే తెలిసేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. నేరుగా ప్రేక్షకుల నుంచే మనకు స్పందన తెలిసిపోతుంది. ఇదొక మంచి కోణం. అంతే కాదు. సోషల్ మీడియా వల్ల ప్రజలకు సాధికారత వచ్చింది. యూట్యూబ్‌లో పెట్టే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ‘ఇంత టాలెంట్ మన దగ్గర ఉందా?’ అనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో అపరిమితమైన సమాచారం ఉంటుంది. మనకు అవసరమైనదాన్ని తెలుసుకోవాలంటే ఫిల్టర్స్ తప్పనిసరి. బహుశా ప్రస్తుత తరం వారికి సోషల్ మీడియా అవసరమేమో! ఒకప్పుడు ఫోన్ నెంబర్లు గుర్తు పెట్టుకొనేవారు. ఇప్పుడా అవసరం లేదు. మొబైల్స్ వచ్చేసాయి. సోషల్ మీడియా కూడా అంతే! ఇక నా విషయానికి వస్తే- ఒక ఫిల్మ్ మేకర్‌గా మార్పునకు సిద్ధంగా ఉండాలి. కొత్త కొత్త ఆవిష్కరణలను గౌరవించాలి. వాటిని వాడుకోవటానికి సిద్ధంగా ఉండాలి.
- సివిఎల్‌ఎన్ ప్రసాద్