Share News

కాల్షియమ్ అవసరం ఎంత?

ABN , Publish Date - Feb 22 , 2024 | 02:49 AM

పెద్ద వయసులో ఎముకలు గుల్లబారకుండా ఉండాలంటే కాల్షియం సప్లిమెంట్‌ తీసుకోక తప్పదని మన నమ్మకం. కానీ కాల్షియం సప్లిమెంట్లు రెండంచుల పదునున్న కత్తిలాంటివి.

  కాల్షియమ్ అవసరం ఎంత?

డాక్టర్‌! 30 ఏళ్లు దాటిన వాళ్లందరూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం అని విన్నాను. క్యాల్షియం మాత్రలను ఎలా ఎంచుకోవాలి? వీటిని ఎవరికి వారు స్వయంగా వాడుకోవచ్చా?

- ఓ సోదరి, హైదరాబాద్‌.

పెద్ద వయసులో ఎముకలు గుల్లబారకుండా ఉండాలంటే కాల్షియం సప్లిమెంట్‌ తీసుకోక తప్పదని మన నమ్మకం. కానీ కాల్షియం సప్లిమెంట్లు రెండంచుల పదునున్న కత్తిలాంటివి. వీటి వాడకంలో అప్రమత్తత ఎంతో అవసరం. 19 నుంచి 50 సంవత్సరాల మహిళలకు రోజుకి 1000 మి.గ్రా, 51-70 ఆ పైవయసులో ఉన్న మహిళలకు 1200 మి.గ్రా కాల్షియం అవసరమవుతుంది. కానీ ఈ కాల్షియం ఆహారం ద్వారా పొందే ప్రయత్నం చేయాలి. వైద్యులు చెప్పకపోయినా కాల్షియం సప్లిమెంట్లను వాడేవాళ్లు ఇతరత్రా ఆరోగ్య ఇబ్బందులకు కూడా గురికాక తప్పదు అవసరానికి మించి కాల్షియం శరీరంలో చేరటం వల్ల కిడ్నీలో రాళ్లు, మిల్క్‌ ఆల్కలై సిండ్రోమ్‌ లాంటి రుగ్మతలతోపాటు శరీరం ఐరన్‌ను పీల్చుకునే స్వభావం కుంటుపడుతుంది. అలాగే ఇతరత్రా వ్యాధులకు వాడే మందుల మీద కూడా ప్రభావం పడుతుంది. ఆహారం ద్వారా శరీరంలోకి ఎంత కాల్షియం చేరుతుందో గమనించి లోపించిన కాల్షియంను మాత్రల ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేయాలేగానీ చేతికందిన సప్లిమెంట్‌ను తీసుకోకూడదు. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు ఎముకల నొప్పలు, నీరసం లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించి తగిన మోతాదు కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి.

డాక్టర్‌ దశరాధరామి రెడ్డి,

ఆర్థోపెడిక్‌ సర్జన్‌, హైదరాబాద్‌.

Updated Date - Feb 22 , 2024 | 02:49 AM