Share News

మానవుల స్వేచ్ఛ కోసం...

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:08 AM

తెలుగు గడ్డ మీద పుట్టిన జిడ్డు కృష్ణమూర్తి 20వ శతాబ్దపు తత్త్వవేత్తలందరిలో మకుటాయమానమైనవాడు. కృష్ణమూర్తిని హ్యూమ్‌, లోక్‌, కాంట్‌, హుసర్ల్‌, సారే్త్ర లాంటి ప్రసిద్ధమైన పాశ్చాత్య తత్త్వవేత్తలతో ఒకవైపు, పతంజలి, కపిలుడు, బుద్ధుడు,

మానవుల స్వేచ్ఛ కోసం...

తెలుగు గడ్డ మీద పుట్టిన జిడ్డు కృష్ణమూర్తి 20వ శతాబ్దపు తత్త్వవేత్తలందరిలో మకుటాయమానమైనవాడు. కృష్ణమూర్తిని హ్యూమ్‌, లోక్‌, కాంట్‌, హుసర్ల్‌, సారే్త్ర లాంటి ప్రసిద్ధమైన పాశ్చాత్య తత్త్వవేత్తలతో ఒకవైపు, పతంజలి, కపిలుడు, బుద్ధుడు, శంకరాచార్యుడు లాంటి భారతీయ తత్త్వవేత్తలతో ఇంకొకవైపు పోలిస్తే... ఆయన గొప్పతనం అర్థమవుతుంది. ఆయన ఆలోచనల్లో, ప్రతిపాదనల్లో ఉన్న పటిష్ఠత ప్రాక్పశ్చిమ తత్త్వవేత్తలు ఎవరిలోనూ కనిపించదు. కృష్ణమూర్తి ‘సృష్టికర్త ఉన్నాడా? ఆత్మ ఆద్యంతరహితమైనదా? మనిషి మేధస్సు పరిమితులు, కార్య కారణాల మధ్య సంబంధం, కాలం, మంచి-చెడు’ లాంటి సైద్ధాంతికమైన తాత్త్విక అంశాలను మాత్రమే చర్చింలేదు. ‘మనిషి మనుగడతో ముడిపడిన ప్రేమ, అహంకారం, అసూయ, కామం, క్రోధం, హింస, భయం, అధికారం, బానిసత్వం’ తదితర విషయాలను కూడా ఆయన విశ్లేషించారు. ‘చైతన్యం అంటే ఏమిటి? కాలం ఎలా ఉద్భవిస్తుంది? దాన్ని ఎలా అధిగమించవచ్చు? చావు పుట్టుకల అర్థం ఏమిటి? కుండలినీ శక్తి నిజంగానే ఉందా?’ అనే ప్రశ్నల విశ్లేషణలో... కృష్ణమూర్తి తాత్త్వికత పరాకాష్టను చేరుకుంది. ఆయన వినియోగించే పద్ధతి.. ఫిలసాఫికల్‌ మెథడ్‌. ఆయన చూపిన మార్గం వినూత్నమైనది. తత్త్వవేత్తలందరూ తమ పూర్వకాలం వారి సిద్ధాంతాల మీద, వారి అభిప్రాయాల మీద, ఆప్త వచనాల మీద ఆధారపడతారు. కృష్ణమూర్తి అలా కాదు... వేటిని పాటిస్తే మనిషికి ఆ సమస్యలు స్పష్టంగా అర్థమవుతాయో, తార్కికవాదం, ఊహ సైతం అందుకోలేని సత్యం దర్శనమిస్తుందో... ఆ అంశాలను ఆయన శ్రోతలకు విశదంగా వివరిస్తారు. ‘మనిషి తన ప్రశ్నలకు జవాబుల కోసం ఇతరుల మీద ఆధారపడకూడదు, తనకు తానే మార్గదర్శి కావాలి’ అనేది ఆయన అభ్యర్థన. సత్యాన్వేషణలో స్వేచ్ఛ అతి ప్రధానమైనది. దాంట్లో గురువులకు, మతాలకు తావు లేదు. ఊత కర్రలాంటి ఇతరుల సిద్ధాంతాలను దూరంగా ఉంచాలి... ఇదీ కృష్ణమూర్తి సందేశం. తాత్త్విక ప్రపంచంలో ఇదొక విప్లవం. సంప్రదాయాలమీద, గురువులమీద ఒక తిరుగుబాటు.


స్వేచ్ఛకు, సత్యానికి ఇంత విలువ ఇచ్చిన జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 12న... మదనపల్లిలో నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు ఎనిమిదవ బిడ్డగా జన్మించారు. ఆయన జాతకాన్ని పరిశీలించిన దైవజ్ఞుడు కుమారశ్రౌతులు ‘‘ఈ పిల్లవాడు భావికాలంలో జగద్గురువు అవుతాడు’’ అని జోస్యం చెప్పాడు. కానీ బాల్యంలో కృష్ణమూర్తి చదువుల పట్ల ఎలాటి ఆసక్తి చూపలేదు. గంటల తరబడి చీమల బారులను, ఆకాశంలో మబ్బులను చూస్తూ కూర్చొనేవారు. ఆయన చేష్టలను అందరూ పిచ్చిగా పరిగణించారు. పదేళ్ళ వయసులో ఆయన తల్లి మరణించడంతో... తండ్రి నారాయణయ్య బతుకుతెరువు కోసం కుటుంబాన్ని మద్రాసుకు (చెన్నైకి) మార్చారు. మద్రాసు అడయార్‌లో ఉన్న దివ్యజ్ఞాన సమాజం (థియోసోఫికల్‌ సొసైటీ)లో చిన్న ఉద్యోగిగా చేరారు. అక్కడ సముద్ర తీరంలో తన తమ్ముడు నిత్యానందుతో ఆడుకుంటున్న కృష్ణమూర్తి వర్చస్సును దివ్యజ్ఞాన సమాజం సభ్యుడైన లెడ్‌ బీటర్‌ గమనించారు. ‘ఇతను గౌతమ బుద్ధుడి అవతారం. పెద్దవాడయ్యాక జగద్గురువు అవుతాడు’ అని నిర్ధారణ చేసుకున్నారు. ఆ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. సమాజం అధ్యక్షురాలైన అనిబిసెంట్‌ మన దేశ స్వాతంత్రం కోసం చాలా పాటుపడ్డారు. ఆమె కృష్ణమూర్తిని, అతని తమ్ముణ్ణి దత్తత తీసుకున్నారు. వారిద్దరినీ పై చదువుల కోసం ఇంగ్లండ్‌కు పంపించారు. కృష్ణమూర్తి అక్కడ ఎంత శ్రమపడినా మెట్రిక్యులేషన్‌లోనైనా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కానీ మాతృభాష అయిన తెలుగును మరచిపోయారు. ఒక బ్రిటిష్‌ పెద్దమనిషిగా మారారు. దివ్యజ్ఞాన సమాజంలో అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియాలకు చెందిన చాలా మంది సంపన్నులు సభ్యులుగా ఉండేవారు. వారు తమ ఆస్తులను, కోటలను, తోటలను భావి జగద్గురువు కృష్ణమూర్తికి విరాళంగా ఇచ్చారు.

ఆ సమాజం సిద్ధాంతం ప్రకారం... 1929 ఆగస్టు మూడో తేదీన మైత్రేయ బుద్ధుడి ఆత్మ... కృష్ణమూర్తి ఆత్మను ఆవహిస్తుంది. ఆ క్షణం నుంచి కృష్ణమూర్తి జగద్గురువు అవుతారు. అదే నమ్మకంతో అందరూ ఆ క్షణం కోసం ఎదురుచూశారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశదేశాల నుంచి ఎంతోమం హాలెండ్‌కు వచ్చి, ఆ రోజు కృష్ణమూర్తి నిలబడిన వేదిక ముందు భయభక్తులతో కూర్చున్నారు. జగద్గురువుగా కృష్ణమూర్తి ప్రపంచానికి ఇవ్వబోయే సందేశాన్ని ప్రసారం చేసేందుకు రేడియో బృందాలు తయారుగా ఉన్నాయి. కానీ ఆ చారిత్రక సందర్భంలో కృష్ణమూర్తి ఇచ్చిన సందేశం సొసైటీ సభ్యుల మీద పిడుగుపాటులా పడింది, కల్లోలం సృష్టించింది. ‘‘మతాలు, సంస్థలు, సమాజాలు సత్యాన్ని అణగదొక్కి, వ్యక్తిని అవిటివాణ్ణి చేస్తాయి. సత్యానికి సంస్థలకు పొత్తు కుదరదు. నేను ఒక కొత్త సిద్ధాంతాన్ని, మతాన్ని స్థాపించడం లేదు. మనిషిని బేషరతుగా ఒక సంపూర్ణ స్వేచ్ఛాజీవిని చేయడం ఒక్కటే నా జీవిత ధ్యేయం’’ అని ఆయన ప్రకటించారు. ఆ కారణంగా ఆయన దివ్యజ్ఞాన సమాజం నుంచి, ఇతర సంస్థల నుంచి విడిపోయారు. ఆస్తులను వాటి పూర్వ యజమానులకు వాపసు ఇచ్చేశారు. మానవుల మనుగడ మీద తాత్త్విక ఉపన్యాసాలు ఇస్తూ, పుస్తకాలు రాస్తూ, మేధావులతో, శాస్త్రవేత్తలతో, కళాకారులతో, రచయితలతో చర్చలు జరుపుతూ జీవితాన్ని గడిపిన కృష్ణమూర్తి 1986లో మరణించారు.

గుంటూరు వనమాలి

(మ్యూనిక్‌ విశ్వవిద్యాలయంలో జిడ్డు కృష్ణమూర్తిపై డాక్టరేట్‌ చేశారు, ఇక్కడే కృష్ణమూర్తి ఫిలాసఫీని బోధించారు)

Updated Date - Nov 29 , 2024 | 12:08 AM