Navya: వాడాపావ్ టు బిగ్ బాస్ హౌస్
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:47 AM
చంద్రిక గెరా దీక్షిత్... ఈ పేరు చెబితే ‘ఈమె ఎవరు’ అనే సందేహం రావచ్చు. కానీ ‘వడాపావ్ గర్ల్’ అనగానే ఆమె రూపం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఢిల్లీ వీధుల్లో తోపుడు బండిపై వడాపావ్ విక్రయించే ఈ అమ్మాయి...
వైరల్
చంద్రిక గెరా దీక్షిత్... ఈ పేరు చెబితే ‘ఈమె ఎవరు’ అనే సందేహం రావచ్చు. కానీ ‘వడాపావ్ గర్ల్’ అనగానే ఆమె రూపం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఢిల్లీ వీధుల్లో తోపుడు బండిపై వడాపావ్ విక్రయించే ఈ అమ్మాయి... ఓ ఫుడ్ వ్లోగర్ వీడియోతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది. లక్షల్లో ఆదాయం... విలాసవంతమైన జీవితం... దేశమంతా ప్రాచుర్యం పొందిన చంద్రిక... ఇప్పుడు ‘బిగ్ బాస్ ఓటీటీ-3’ హౌస్‌లోకి అడుగు పెడుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ... సైనిక్ విహార్... ‘కేశవ్ మహా విద్యాలయ’ గేటు ముందు జనం కిటకిటలాడుతుంటారు. వేడి వేడి వడాపావ్ కోసం ఆర్డర్లు ఇచ్చి... ఎదురు చూస్తుంటారు. అలాగని అదేదో బడా ఛాట్ భండార్ కాదు. రోడ్డు పక్కన ఓ చిన్న ఫుడ్ కార్ట్. వీధికి రెండు మూడు వడాపావ్‌లు విక్రయించే స్టాల్స్ ఉన్నా... అక్కడే ఎందుకంత డిమాండ్ అంటారా..! అదంతా ఆ ఫుడ్ కార్ట్ యజమాని చంద్రిక దీక్షిత్ మహిమ. ఆమె చేత్తో చేసిన వడాపావ్‌కు ఢిల్లీవాసులు ఫిదా అవుతున్నారు.
బతుకుతెరువు కోసం ఢిల్లీకి...
మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన చంద్రిక తల్లితండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోయారు. ఆ తరువాత కొంత కాలానికి బతుకుతెరువు కోసం ఆమె తన నివాసాన్ని ఢిల్లీకి మార్చింది. తొలుత హల్దీరామ్స్‌లో పని చేసింది. ‘అదే సమయంలో మా అబ్బాయి రుద్రకు డెంగీ సోకింది. దాంతో ఇంటి దగ్గర ఉండి వాడిని చూసుకోవడానికి ఉద్యోగం వదిలేశాను. వాడు కోలుకున్నాక సొంతంగా ఏదైనా చేయాలని... సైనిక్ విహార్‌లో వడాపావ్ బండి ప్రారంభించాను’ అంటున్న చంద్రిక ఫుడ్ కార్ట్‌కు కొద్ది కాలంలోనే స్థానికంగా మంచి పేరు వచ్చింది. ‘ముంబయిస్ మోస్ట్ లవ్‌డ్ వడాపావ్’ అంటూ తన స్టాల్‌పై రాసుకున్న ఆమెకు... మొదటి నుంచీ వంటలపై ఆసక్తి. అందుకే ఫుడ్ కోర్టు ఆలోచన రాగానే, క్షణం ఆలోచించకుండా అమల్లో పెట్టేసింది.
రోజుకు నలభై వేలు..!
బిజినెస్ బానే సాగుతోంది. చుట్టూ వడాపావ్ స్టాల్స్ ఉన్నా... చంద్రిక ఫుడ్ కార్ట్‌కు మాత్రమే వచ్చేవారు రోజు రోజుకూ పెరుగుతూవచ్చారు. ఫుడ్ వ్లోగర్ అమిత్ భండారీ... ఆమె స్టాల్ గురించి గొప్పగా వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దాంతో ఆ ప్రాంతానికే పరిమితమైన చంద్రిక పేరు ఒక్కసారిగా దేశమంతా మారుమోగింది. ‘వడాపావ్ గర్ల్’గా అందరికీ పరిచయమైంది. ఆ వీడియోలో ఆమె విభిన్నమైన యాస వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అది మొదలు చంద్రిక జీవితం ఊహించని మలుపు తిరిగింది. అదే సమయంలో ‘ఎక్స్‌ప్లోర్ విత్ చంద్రిక’ పేరుతో ప్రారంభించిన యూట్యూబ్ చానల్‌కూ సబ్‌స్ర్కైబర్స్ భారీగా పెరిగిపోయారు.
ఒక్క వీడియోతో హాఠాత్తుగా స్టార్ అయిపోయిన చంద్రిక... తనలోని నటనాభిరుచిని కూడా బయటకు తీసింది. తన చానల్‌లో ఫుడ్ రెసిపీలే కాకుండా విభిన్న వేషాల్లో సరదా వీడియోలు చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఆమెకు దాదాపు రెండున్నర లక్షలమంది సబ్‌స్ర్కైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నాలుగున్నర లక్షలమంది ఫాలో అవుతున్నారు. వడాపావ్ వ్యాపారానికే పరిమితం కాకుండా... కంటెంట్ క్రియేటర్‌గా కూడా తనదైన ముద్ర వేసింది చంద్రిక. ఫుడ్ కార్ట్ ద్వారా రోజుకు నలభై వేల రూపాయల ఆదాయం లభిస్తుందని ఇటీవల ఓ వీడియోలో చెప్పుకొచ్చింది ఈ భామ. ‘ఇది నమ్మశక్యంగా లేదం’టూ కొందరు కామెంట్ చేశారు. చంద్రిక భర్త యష్ దీక్షిత్ కూడా వీధి వ్యాపారే.
సెలబ్రిటీల ఫేవరెట్...
చంద్రిక వడాపావ్‌కు సినీ తారలు కూడా అభిమానులే. తరచూ స్టాల్‌కు వచ్చి రుచి చూస్తుంటారు. మరో విశేషమేమంటే... సాయంత్రం పూట ఒకరికి నాలుగుకు మించి వడా పావ్‌లు విక్రయించదు. అంత డిమాండ్ అక్కడ. స్వశక్తితో ఎదిగిన మహిళ కావడంతో ‘బిగ్‌బాస్ 17’ ఫేమ్ సన్నీ ఆర్య, పునీత్ సూపర్‌స్టార్, ‘డాలీ చాయ్‌వాలా’గా పాపులర్ అయిన సునీల్ పాటి తదితరులు చంద్రికకు మద్దతుగా నిలిచారు. తమ సామాజిక మాఽధ్యమాల ద్వారా ఆమెను ప్రోత్సహించారు. దీంతో ‘వడాపావ్ గర్ల్’ ఇమేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆమె కొన్ని బ్రాండ్లకు ఇన్‌స్టాలో ప్రచారం కూడా చేస్తున్నారు.
వివాదాలు ఉన్నాయి...
సెలబ్రిటీ హోదాతో పాటు అదే స్థాయిలో చంద్రికను వివాదాలు, సమస్యలు చుట్టుముట్టాయి. వీధిలో బండి పెట్టడంవల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందంటూ ‘ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్’ (ఎంసీడీ) ఆమెకు నోటీసులు ఇచ్చారు. అది పెద్ద వివాదంగా మారి దుమారం రేపింది. నెట్టింట కొందరు మద్దతుగా నిలిస్తే... మరికొందరు ప్రజలకు ఇబ్బంది కలిగించడాన్ని తప్పు పట్టారు. అయితే తాను 35 వేల రూపాయలు ఎంసీడీ అధికారులకు ఇచ్చానంటూ చంద్రిక చేసిన ఆరోపణ అగ్నికి ఆద్యం పోసింది. దాంతోపాటు పోటీ వ్యాపారులు కూడా తమ అమ్మకాలు దెబ్బతింటున్నాయంటూ ఆమెతో గొడవకు దిగారు. అయితే వీటన్నిటినీ తట్టుకొని ఆమె నిలబడింది.
బిగ్ బాస్ ఓటీటీలో...
ఇవన్నీ ఒక ఎత్తయితే... ఇటీవల ‘ఫోర్డ్ ముస్తాంగ్’ కారుతో పోజులిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ‘ఇది నా కొత్త కారు’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ఆ ఫొటోలు చూసిన అభిమానుల నోట మాట రాలేదు. కారణం... ఆ కారు ఖరీదు 76 లక్షల పైమాటే. ఏదిఏమైనా... వీధిలో వడాపావ్ అమ్మే ఒక అమ్మాయి... ఫోర్డ్ ముస్తాంగ్ డ్రైవ్ చేసే స్థాయికి ఎదిగిన క్రమం తమకు ప్రేరణ కలిగిస్తుందంటూ నెటిజనులు చంద్రికను అభినందనలతో ముంచెత్తుతున్నారు. ‘ఎవరు ఏమనుకున్నా, ఎంతగా విమర్శించినా నా ఈ ప్రయాణం నా కుటుంబం కోసం. మా అబ్బాయి బంగరు భవిత కోసం’ అంటున్న ఈ ‘వడాపావ్ గర్ల్’... బిగ్‌బాస్ ఓటీటీ3కి ఎంపికైన మొదటి కంటెస్టెంట్.