Share News

Littles : తగిన శాస్తి

ABN , Publish Date - Jul 16 , 2024 | 12:28 AM

రామాపురంలో క్రిష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో తెలివైన వాడు ఇంకా సాహసవంతుడు కానీ చాలా దురాశా పరుడు ఒక రోజు ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.

Littles : తగిన శాస్తి

Littles : రామాపురంలో క్రిష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో తెలివైన వాడు ఇంకా సాహసవంతుడు కానీ చాలా దురాశా పరుడు ఒక రోజు ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం ఏమీ లేకున్నా, ఇంటి లోపలి విలువైన వస్తువులు కాలి బూడిదవుతున్నాయి.

ఇంతలో అక్కడికి వచ్చిన రామనాథం వ్యాపారానికి కావల్సిన డబ్బు నాలుగు లక్షలు లోపల పెట్టాను అది కూడా బూడిదైతే ఎలా అని పెద్దపెట్టున ఏడవ సాగాడు. ఇంతలో అక్కడికి వచ్చిన క్రిష్ణయ్య ‘రామనాథం గారూ మీ డబ్బు లోపలినుండి నేను క్షేమంగా తెచ్చి ఇస్తాను. కానీ తెచ్చిన డబ్బులో నాకు ఇష్టమైనది మీకు ఇచ్చి మిగతాది నేను తీసుకుంటాను. సరేనా?


సరే అన్నాడు రామనాథం. అప్పుడు క్రిష్ణయ్య ఎంతో ధైర్యంగా లోపలికి వెళ్లి, డబ్బుమూట బయటకు తెచ్చాడు కానీ, తెచ్చిన సొమ్ములో వంద రూపాయలు మాత్రం రామనాథానికి ఇచ్చి, మిగతా డబ్బు మొత్తం తన సంచీలో వేసుకుని, వెళ్లబోయాడు. ఇది అన్యాయం అని క్రిష్ణయ్యను ఆపాడు రామనాథం. ‘నేను చెప్పినట్లే కదా చేశాను ఇంకేం అన్యాయం’అన్నాడు క్రిష్ణయ్య.

విషయం పంచాయితీ దాకా వెళ్లింది,పంచాయితీ పెద్ద కేశవరావు జరిగినదంతా విని, క్రిష్ణయ్యతో ఇలా అన్నాడు.‘ క్రిష్ణయ్యా ఆ డబ్బుమూట మరియు వంద రూపాయలు చెరోవైపున పెటు’్ట అన్నాడు. అలాగే చేశాడు క్రిష్ణయ్య. ఇప్పుడు చెప్పు క్రిష్ణయ్యా ఈ రెండిటిలో నీకు ఇష్టమైనది ఆ పెద్ద డబ్బు మూటనే కదా అని అడిగాడు. అవును అని జవాబు చెప్పాడు క్రిష్ణయ్య.


‘నువ్వు నీకు ఇష్టమైనది రామనాథానికి ఇస్తాను అని కదా అన్నావు? కాబట్టి మారు మాట్లాడకుండా ఆ డబ్బు మూటను అతనికి ఇచ్చేసి, అతను సంతోషంగా ఎంత ఇస్తే అంత పుచ్చుకో’ అన్నాడు కేశవరావు దానికి క్రిష్ణయ్య ‘నా ఉద్దేశం అది కాదు నాకు ఇష్టమైనది అంటే నాకు నచ్చినంత అని అర్థం’ అన్నాడు. దానికి కేశవరావు ‘నీ ఉద్దేశం మంచిదైతే ఈ గొడవే లేదు కదా. నువ్వు తెలివైనవాడివి.. కానీ ఈ దురాశ మంచిది కాదు మానుకో అని హితవు చెప్పి, అతన్ని అక్కడినుండి పంపేశాడు పంచాయితీ పెద్ద. అతని దురాశకు తగిన శాస్తి జరిగిందని అందరూ అనుకున్నారు.

Updated Date - Jul 16 , 2024 | 12:28 AM