Modelling : స్టయిల్ అదిరే..!
ABN , Publish Date - Aug 12 , 2024 | 05:28 AM
అవకాశం వచ్చినప్పుడే కాదు... ఏ అవకాశం లేకపోయినా... తన నుంచి చూపు తిప్పుకోనివ్వడంలేదు జీనత్ అమన్. ‘దమ్ మారో దమ్... మిట్ జాయే గమ్’ అంటూ నాడు యువతరాన్ని ఊపేసిన జీనత్... ఆ తరువాత విభిన్న పాత్రలకు పెట్టింది పేరుగా... మంచి నటిగా కోట్లమంది హృదయాల్లో కొలువయ్యారు.
ఐకాన్
వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే... కాదనగలరా..! అదీ ఈ అపు‘రూపం’ చూశాక..!
దీపికా... అలియా... సారా... నవతరం తారలు హొయల సునామీలోనూ...
అలనాటి అందం నేటికీ ప్రత్యేకమే అనక తప్పదు... జీనత్ అమన్ చిత్రాలు చూశాక.
వైవిధ్యమైన డ్రెస్సులు ధరించి... నయా లుక్స్‌తో అభిమానులను అలరిస్తూ... ర్యాంప్‌పైనే కాదు...
ఇన్‌స్టాలోనూ సరికొత్త ఫ్యాషన్ ఐకాన్ అయ్యారు జీనత్.
అవకాశం వచ్చినప్పుడే కాదు... ఏ అవకాశం లేకపోయినా... తన నుంచి చూపు తిప్పుకోనివ్వడంలేదు జీనత్ అమన్. ‘దమ్ మారో దమ్... మిట్ జాయే గమ్’ అంటూ నాడు యువతరాన్ని ఊపేసిన జీనత్... ఆ తరువాత విభిన్న పాత్రలకు పెట్టింది పేరుగా... మంచి నటిగా కోట్లమంది హృదయాల్లో కొలువయ్యారు. ఇప్పటికీ... డెబ్భై రెండేళ్ల వయసులోనూ ఆమెలో అదే వైవిధ్యం. ‘వయసనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే’ అని మాటల్లో చెప్పడం కాకుండా... చేతల్లో చూపిస్తున్నారు. సందర్భం ఏదైనా ఎప్పటికప్పుడు ట్రెండీ టచ్‌తో నవతరానికి స్ఫూర్తినిస్తున్నారు.
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో వినూత్న ఆహార్యంతో రన్‌వేపై మైమరిపించినా... ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్‌పేజీ మీద మెరిసినా... చాలా ఏళ్ల తరువాత మళ్లీ రంగస్థలంపై కస్తూర్బా గాంధీగా అద్భుతమైన అభినయంతో ఆకట్టుకున్నా... జీనత్‌కే ప్రత్యేకం. వయసు మీద పడుతున్నా... కాలంతో పోటీపడుతూ... అందుకు అనుగుణంగా తనను తాను మలుచుకొంటున్నారు. నిత్యనూతనంగా కనిపిస్తూ... అందానికి సరికొత్త నిర్వచనం ఇస్తున్నారు.
జీనత్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళితే... ఫ్యాషన్‌కు పుట్టిల్లులా అనిపిస్తుంది. ఫొటో షూట్లు... ర్యాంప్ వాక్‌ల చిత్రాలతో కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వాటితోపాటు అప్పుడప్పుడూ తన సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలు... రోజువారీ జీవనగమనంలో ఎదురయ్యే అనుభవాలను అందరితో పంచుకొంటారు జీనత్. సందర్భానుసారం అలనాటి తన పాత్రల ఫొటోలు వదులుతుంటారు. వయసు మనసుకు కాదని... అది ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉరకలేస్తూ ఉంటుందని చెప్పకనే చెబుతారు జీనత్.
అంతేకాదు... అమూల్యమైన సందేశాలు, సూచనలు, సలహాలతో సాధికారత దిశగా మహిళలను ప్రోత్సహిస్తున్నారు. వారి విజయాలను తన విజయాలుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ... స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నారు. యువతలో చైతన్యం రగిలించి, వారిని లక్ష్యం వైపు నడిపించేందుకు సామాజిక మాధ్యమాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు.