Navya : ఒక పెళ్లి... అనేక ముచ్చట్లు
ABN , Publish Date - Jul 21 , 2024 | 01:22 AM
అనంత్ అంబానీ పెళ్లి జరిగిన ఆ ఐదు రోజులూ బాలీవుడ్‌కు అనధికారిక సెలవు ప్రకటించినట్లైంది. బాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ అంతా అక్కడే ఉన్నారు. హీరో, హీరోయిన్లు షూటింగ్‌కు హాజరవ్వలేదు.
అసలే అంబానీల ఇంటపెళ్లి అది... ఐదు రోజుల పెళ్లి, రూ. 5 వేల కోట్ల పెళ్లి... సెలబ్రిటీల సందడి ప్రత్యేకార్షణగా నిలిచిన అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లిలో బాలీవుడ్ అందాలు మొత్తం కనువిందు చేశాయి. దక్షిణాది తారలన్నీ కల్యాణానికి తరలివచ్చాయి. పెళ్లయినా, పేరంటం అయినా తారాలోకం ఊరకనే రాదు కదా ఈసారీ మరెన్నో విశేషాలను వెంటపెట్టుకు వచ్చింది.
అనంత్ అంబానీ పెళ్లి జరిగిన ఆ ఐదు రోజులూ బాలీవుడ్‌కు అనధికారిక సెలవు ప్రకటించినట్లైంది. బాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ అంతా అక్కడే ఉన్నారు. హీరో, హీరోయిన్లు షూటింగ్‌కు హాజరవ్వలేదు. నటీనటులు అందరూ ఒక చోట చేరి సెలబ్రేషన్ మోడ్‌లో గడిపారు. అయితే ఈ పెళ్లిపై చిత్ర పరిశ్రమ నుంచి కొన్ని పెదవి విరుపులు వినిపించకపోలేదు.
మొదటి దూస్రా దూసుకొచ్చింది మాత్రం బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ కూతురు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ అలియా కశ్యప్ నుంచే. ఆమె అంబానీల పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అనంత్ అంబానీ పెళ్లి అసలు పెళ్లే’ కాదు అన్నారు.
అంతా ఓ సర్క్‌సను తలపిస్తోందన్నారు. పీఆర్ స్ట్రాటజీగా కొట్టిపారేశారు. పెళ్లికి హాజరవ్వాలని తనకూ ఆహ్వానం అందిందని, పీఆర్ రీల్స్ చేయడం ఇష్టం లేకనే వెళ్లలేదన్నారు. ‘వేరే వాళ్ల పెళ్లి కోసం నా ఆత్మాభిమానాన్ని అమ్ముకోలేను. నా వ్యక్తిత్వం మీద నాకు గౌరవం ఉంది’ అని పరోక్షంగా సినీ స్టార్స్‌ను దెప్పిపొడిచారు అలియా కశ్యప్.
బాంద్రాలో బంగ్లా?
అతిథి మర్యాదలకు లోటు లేకుండా చూసుకోవడంలో అంబానీల నైపుణ్యం గురించి చాలా సార్లు విన్నదే, కన్నదే. ఇప్పుడు ఈ పెళ్లికి గెస్ట్‌లుగా వచ్చిన సినిమా యాక్టర్స్‌కే రూ. కోట్ల విలువైన వాచీలను బహుమతిగా పంచడం చూసిందే. అలాంటిది మరి ఏకంగా అంబానీల ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలిని వెతికిపెట్టిన వ్యక్తికి ఇంకెంత ఘనమైన బహుమతి అందుతుందో అనే ఆసక్తి సహజమే.
జావీద్ జాఫ్రీ తనయుడు మీజాన్ జాఫ్రీ అనంత్ అంబానీకి రాధికామర్చంట్‌ను పరిచయం చేశారట. వారిద్దరి మనసులు కలిసి, మనువుకు బాటలు వేసినందుకు బాంద్రాలోని సంధు ప్యాలె్‌సను అంబానీ ఫ్యామిలీ మీజాన్ జాఫ్రీకి బహుమతిగా ఇచ్చారు, దాని విలువ రూ. 30 కోట్లు అని బాలీవుడ్ సినీ విమర్శకుడు కేఆర్‌కే పరోక్షంగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని జావీద్ జాఫ్రీ వివరణ ఇచ్చుకున్నారు.
భోజనానికైనా వెళ్లుండాల్సింది
అనంత్, రాధిక వివాహానికి హాజరుకాకపోవడంపై తాప్సీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా స్పందించారు. ‘వాళ్లతో నాకు పరిచయం లేదు. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి మనకు మధ్య ఏదో ఒక అనుబంధం ఉండాలి.
అలాంటి పెళ్లిళ్లకు మాత్రమే నేను హాజరవుతాను. తెలియని వారి పెళ్లికి వెళ్లి కృతకమైన ఆనందం పొందడం నాకు తెలియదు. నేను కాగితం పువ్వును కాదు, సువాసన వెదజల్లే నిజమైన పుష్పాన్ని’ అని కవితాత్మకంగా స్పందించారు. కానీ నెటిజన్లు ఊరకుంటారా...పెళ్లికి వెళ్లకపోతే పాయే, కనీసం భోజనానికైనా వెళ్లి ఉండాల్సిందని తాప్సీని ఉడికించే ప్రయత్నం చేశారు.
టెక్కులాడి వంటూ...
బాలీవుడ్ నటడు సంజయ్ కపూర్ కూతురు షనయా కపూర్ ఈ పెళ్లిలో సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన వీడియో వైరల్ అయింది. సెక్యూరిటీ సిబ్బంది ఆమె బ్యాగ్‌ను చెక్ చేసేందుకు ప్రయత్నించగా అసహనం వ్యక్తం చేసింది.
వాళ్ల మీద అరుస్తూ వాదన పెట్టుకుంది. అయితే చేతిలో ఒక్క సినిమా కూడా షనయాకు ఇంత టెక్కెందుకో అని నెటిజన్లు అంటున్నారు.
నిక్‌ను తోసిరాజని
- ఈ పెళ్లికి కథానాయిక ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనా్‌సతో కలసి హాజరయ్యారు. సంగీత్ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా డాన్స్ చేస్తుండగా నిక్ పక్కన ఉండి ఆమెను ఉత్సాహపరుస్తున్నాడు. అయితే బాలీవుడ్ కథానాయిక అనన్యాపాండే ప్రియాంకతో కలసి స్టెప్పులు వేసేందుకు ముందుకు వచ్చే క్రమంలో నిక్‌ను వెనక్కు నెట్టడంతో అతను అవాక్కయ్యాడు. అయితే ఇదంతా గమనించిన రణ్ వీర్‌సింగ్ నిక్ చేతిని పట్టుకొని మధ్యలోకి లాగి కూల్ చేశారు.
పాకిస్థాన్ నటులకు అంబానీ పెళ్లికి ఆహ్వానం అందినట్టు లేదు. శుభాకాంక్షలు చెప్పాల్సింది పోయి ఈ పెళ్లి వేడుకలపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు పాకిస్థాన్ నటుడు అర్సలన్ నజీర్. ‘ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు జరిగినంత కాలం కూడా బందాలు నిలవడం లేదం’టూ వేదాంత ధోరణిలో మాట్లాడాడు. ‘శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీ సన్నాయి నొక్కులేమిటి’ అంటూ నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త దంపతులు ఇద్దరూ సంతోషంగా ఉంటే మధ్యలో నీకొచ్చిన ఇబ్బంది ఏమిటని తిట్టి పోస్తున్నారు.
పెళ్లికి హాజరవని తారలు
అంబానీ పెళ్లికి వచ్చిన తారలే కాదు రానివాళ్లుకూడా వార్తల్లో వ్యక్తులు అయ్యారు. ఈ పెళ్లకి రాని నటీనటులు, వారెందుకు రాలేదో అనే చర్చ కూడా డిజిటల్ మీడియాలో జోరుగా జరిగింది.
కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ దంపతులు తమ ఫ్యామిలీ ట్రిప్‌ను వాయిదా వేసుకోలేకపోయారని ఓ సమాచారం. ఆమిర్‌ఖాన్ రాకపోయినా తన కుటుంబం మొత్తాన్ని పెళ్లికి తోలాడట. అంబానీ ఐనా ఐ డేంట్ కేర్ అనే టైపు కంగనా రనౌత్. అయితే తన తమ్ముడు వరుణ్ రనౌత్ పెళ్లి పనుల్లో కంగనా రనౌత్ బిజీగా ఉండి హాజరవలేకపోయారట. పెళ్లి వేడుకలు మొదలయ్యే ముందే అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ, పిల్లలతో కలసి లండన్ చెక్కేశారు. కార్తీక్ ఆర్యన్ కూడా ఈ పెళ్లిలో కనిపించలేదు. కారణాలేవైనా పాన్ ఇండియా స్టార్స్ అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ సైతం ఈ పెళ్లిలో కనిపించలేదు. ఫ
మహేశ్‌బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. దానికోసం కొన్నాళ్లుగా ఆయన సరికొత్త హెయిర్‌స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. మహేశ్ లుక్ ఇప్పుడప్పుడే బయటకు కనిపించకుండా ఉండాలనే రూల్ పెట్టారట రాజమౌళి. కానీ అంబానీ పెళ్లికి మహేశ్‌బాబు కుటుంబంతో కలసి హాజరయ్యారు. మహేశ్ లుక్‌ను రహస్యంగా ఉంచాలన్న జక్కన్న ప్లాన్ దీంతో ఫెయిల్ అయిందనేది టాలీవుడ్ టాక్.
రజనీ సార్ కూడా ఇంతేనా!
సింప్లిసిటీగా మారుపేరుగా మసలే రజనీకాంత్ అంబానీ పెళ్లిలో మాత్రం దాన్ని పక్కనపెట్టారు. బరాత్‌లో తనదైన శైలిలో స్టెప్పులతో దుమ్మురేపారు. సూపర్‌స్టార్‌ను అలా చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా. ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. రజనీ ఓ వివాదంలో చిక్కుకున్నారు.
పెళ్లికి వచ్చేముందు ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చే క్రమంలో తన బ్యాగ్ మోస్తున్న పనిమనిషిని పక్కకు వెళ్లాలని రజనీకాంత్ చేయు చూపించారు. ఆమె అది గమనించకపోవడంతో పక్కకు వెళ్లమని పదే పదే చేయి ఊపుతూ సంజ్ఞలు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో కాస్తా వైరల్ అయి రజనీని కొందరు తప్పుపడుతున్నారు. పనిమనిషి అయినంత మాత్రాన జనంలో ఉన్నప్పుడు గౌరవం లేకుండా ప్రవర్తిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే ‘వీళ్లింతే పైకి ఒకలా నటిస్తారు... లోపల మరోలా జీవిస్తారు’ అని నిర్వేదం వ్యక్తం చేశారు.
విడివిడిగా... విడాకులు నిజమేనా?
శుభకార్యంలోనూ ఈ విడాకుల గొడవలేమిటో అని అమితాబ్ ఫ్యామిలీ నిట్టూర్చేలా చేసింది డిజిటల్ మీడియా. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్... ఐశ్వర్యారాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య విడివిడిగా పెళ్లికి వచ్చారు. నూతన దంపతులతో అమితాబ్‌బచ్చన్, జయాబచ్చన్, అభిషేక్ బచ్చన్‌లు కలసి ఫొటోలు దిగారు. ఐశ్వర్యారాయ్ మాత్రం తన కూతురు ఆరాధ్యతో కలసి విడిగా ఫొటోలు దిగారు.
అభిషేక్, ఐశ్వర్య గ్రూప్ ఫొటోలో కలసి లేకపోవడంతో వారిద్దరూ విడిపోతున్నారంటూ కొన్నాళ్లుగా వస్తున్న వార్తలకు మరోసారి రెక్కలొచ్చాయి. సందట్లో సడేమియాలా ఈ పెళ్లిలో మాజీ ప్రియుడు సల్మాన్‌తో కలసి ఐశ్వర్యారాయ్ ఫొటోలు దిగిందంటూ కొన్ని ఫేక్ ఫొటోలు నెట్‌లో వైరల్ కావడం వారికి మరో తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా కోలీవుడ్ కపుల్ సూర్య, జ్యోతిక విడిపోతున్నారంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వారిద్దరూ కలసి అనంత్ పెళ్లికి హాజరయ్యారు. చిలుకా గోరింకల్లా పెళ్లి వేడుకల్లో ప్రత్యేకాకర్షణగా నిలిచారు.
‘దిక్సూచి’ వెబ్ పేజీలో...
సమాచారం కోసం ఈ కింది యూఆర్‌ఎల్
Https://ejyothy.com/s1W4WFAలో చదవండి.