Navya : నిలువెత్తు అమ్మతనం
ABN , Publish Date - Jul 13 , 2024 | 01:06 AM
కంటేనే అమ్మ కాదని... అమ్మతనం అనేది గుండెల్లో నుంచి రావాలని అంటారు రక్షా జైన్. అందుకే ఏ తల్లి బిడ్డయినా తన బిడ్డగానే భావిస్తారు ఆమె.
కంటేనే అమ్మ కాదని... అమ్మతనం అనేది గుండెల్లో నుంచి రావాలని అంటారు రక్షా జైన్. అందుకే ఏ తల్లి బిడ్డయినా తన బిడ్డగానే భావిస్తారు ఆమె. తల్లి పాలు దానం చేసి... వేలమంది పిల్లలకు అమ్మ అయ్యారు. పసిబిడ్డల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు కారణమై... ‘యశోదమ్మ’గా ఎందరో తల్లులకు స్ఫూర్తిమంత్రమై నిలిచారు. ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ స్థానం సంపాదించారు.
‘‘పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టకపోతే అది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. మార్కెట్‌లో ఎన్ని ఉత్పత్తులున్నా... అవేవీ తల్లి పాలకు సరితూగవు. అందుకే నా వంతు బాధ్యతగా తల్లి పాలు దానం చేస్తున్నాను. దీనివల్ల ఎంతోమంది పసిపిల్లల ఆరోగ్యవంతమైన బాల్యానికి నేను కూడా ఒక కారణం అవుతాను కదా.
ఒక తల్లిగా దీనికి మించిన సంతృప్తి ఏముంటుంది! ఈ ఆలోచనతోనే మరికొన్ని సంఘాలతో కలిసి ‘లైఫ్ వెల్ఫేర్ సొసైటీ పింక్ స్క్వాడ్’ నెలకొల్పాను. వివిధ కారణాలవల్ల మా సొసైటీలో సభ్యత్వం తీసుకోవడానికి ఆరంభంలో మహిళలు ఎవరూ ముందుకు రాలేదు. ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించడంవల్ల ప్రస్తుతం ఇరవైమంది సభ్యులు ఉన్నారు. రాజస్తాన్‌లోని బిల్వాడా నగరం మాది. వృత్తిరీత్యా నేను ఎలక్ర్టోథెరపిస్ట్‌ను. ఇద్దరు పిల్లల తల్లిని.
అప్పుడే అనుకున్నా...
ఆరేళ్ల కిందట మా అబ్బాయికి జన్మనిచ్చాను. అదే నా తొలి కాన్పు. మూడు రోజులపాటు వాడికి పాలు ఇవ్వలేకపోయాను. ఆ సమయంలో ఎంతో వేదనకు లోనయ్యాను. మా కుటుంబం కూడా తీవ్ర ఆందోళన చెందింది.
దాంతో మహాత్మాగాంధీ ఆసుపత్రిలోని ‘ఆంచల్ మదర్ మిల్క్ బ్యాంక్’ను సంప్రతించాను. అక్కడి నుంచి తెచ్చిన వేరొక తల్లి పాలు నా బిడ్డను కాపాడాయి. ఆ క్షణమే భగవంతుడిని వేడుకున్నా... ‘తల్లి పాలు దానం చేసే అదృష్టం నాకు కూడా కల్పించ’మని. నా ప్రార్థనలు ఫలించాయి. కొన్నాళ్లకే నా బిడ్డకు నేను పాలు ఇవ్వగలిగాను. అంతేకాదు... మిగిలిన పాలు వ్యర్థం కాకుండా ‘ఆంచల్ మదర్ మిల్క్ బ్యాంక్’కు ఇస్తూ వచ్చాను.
వద్దని వారించినా...
అయితే ఆరంభంలో అందరూ నన్ను వద్దని వారించారు. అలా ఇస్తూపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. నేను వినలేదు. తల్లిపాల దానం వినడానికి చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ దానివల్ల ఎంతో నొప్పిని భరించాల్సి వస్తుంది. అలాగని వెనకగుడు వేయలేదు.
వేరొక తల్లి పాలు నా బిడ్డను కాపాడినప్పుడు... నేనెందుకు ఆ పని చేయకూడదని అనుకున్నాను. అవసరంలో ఉన్న పసి పిల్లల ఆకలి తీర్చడంలో ఎనలేని ఆనందం ఉంటుంది. అది వెల కట్టలేనిది. అందుకే మా అబ్బాయి పుట్టిన మూడో రోజు నుంచీ మిగిలిన పాలను మిల్క్ బ్యాంక్‌కు డొనేట్ చేస్తున్నాను.
కన్న కూతురులా...
తొలి కాన్పు సమయంలో మండల్‌లోని మా అత్తవారింట్లో ఉండేదాన్ని. అక్కడి నుంచి రోజూ బిల్వాడాలోని మిల్క్ బ్యాంక్‌కు ట్యాక్సీలో వెళ్లేదాన్ని. రానూ పోనూ రూ.700 ఖర్చయ్యేది. అలా నెల రోజులు తిరిగాను. ఖర్చు మరీ ఎక్కువైపోవడంతో మా అబ్బాయిని నడుముకు కట్టుకుని, స్కూటీ మీద తిరిగాను.
జోరు వానల్లో సైతం వెళ్లి వచ్చిన సందర్భాలు అనేకం. నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఘటన ఒకటి ఐదేళ్ల కిందట జరిగింది. మహాత్మాగాంధీ ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడి సిబ్బంది అప్పుడే పుట్టిన పాపను నా దగ్గరికి తెచ్చారు. పాపకు జన్మనిచ్చి తల్లి పురుట్లోనే చనిపోయిందని, నా పాలు ఆ చిన్నారికి పట్టామని చెప్పారు. నా కళ్లు చమర్చాయి. పసిపాపను నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు తెలియని ఉద్వేగం. తను నా కూతురేనన్న అనుభూతి కలిగింది. రక్తదానం జీవితంలో ఎప్పుడైనా చేయవచ్చు. కానీ తల్లి పాలు దానం చేసే అవకాశం అరుదుగా లభిస్తుంది.
మరింతమందిని ప్రోత్సహిస్తూ...
నన్ను చూసి మా బిల్వాడాలో అనేకమంది తల్లులు స్ఫూర్తి పొందుతున్నారు. వివిధ ప్రాంతాలకు వెళుతూ ఈ దిశగా మహిళలనే కాదు మగవారిని కూడా ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే దీనికి కుటుంబ మద్దతు చాలా అవసరం. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. మావారు సునీల్, అమ్మ శారదాదేవి, సోదరుడు రాహుల్ సోనీ నా ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు.
మిల్క్ బ్యాంక్‌లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు రాహుల్ నన్ను తీసుకువెళతాడు. నేను బయటకు వెళితే అమ్మ ఇల్లు, పిల్లల్ని చూసుకొంటుంది. తల్లి పాలు దానం చేయడానికి ఎవరూ సంకోచించక్కర్లేదు. ఆరోగ్య సమస్యలు వస్తాయని భయం అక్కర్లేదు. ఇన్నిసార్లు డొనేట్ చేసినా నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.
నా పేరు ‘ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లోకి ఎక్కింది. స్థానికులు నన్ను ఆప్యాయంగా ‘యశోదమ్మ’ అంటుంటారు. ఏదిఏమైనా... ఇప్పటివరకు నావల్ల ఐదు వేలమంది పసిబిడ్డలకు లబ్ధి చేకూరింది. వారి మోముపై మెరిసే చిరునవ్వుకు నేను కూడా ఒక కారణమని తెలిసినప్పుడు... నా మనసు ఉప్పొంగుతుంది.’’
ఒక సంకల్పంతో...
గత ఏడాది నాకు రెండో సంతానం కలిగింది. కాన్పు తరువాత ఆసుపత్రి నుంచి బయటకు రాగానే పాలు దానం ఇవ్వడం ప్రారంభించాను. అలా దాదాపు పది నెలలు ఇచ్చాను. శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ నా సంకల్పానికి అవేవీ అవరోధం కాలేదు. అవసరంలో అండగా నిలవడమే కదా మానవత్వం. కన్న బిడ్డకు పాలు ఇవ్వలేక ఎంతోమంది తల్లులు వేదన అనుభవిస్తున్నారు. అలాంటివారికి నేను మనోధైర్యం కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటికి 160 లీటర్ల పాలు దానం చేశాను. రాజస్తాన్‌లోనే కాదు... బహుశా దేశంలోనే ఇంత మొత్తంలో తల్లి పాలు డొనేట్ చేసింది నేనే కావచ్చు. మా ప్రాంతానికే పరిమితం కాకుండా పక్క జిల్లాలకు కూడా వెళ్లి వచ్చాను.