Share News

Navya : అలలపై ఆమె సంతకం

ABN , Publish Date - Jul 13 , 2024 | 01:16 AM

పురుషుల ఆధిపత్యం కొనసాగే వాణిజ్య నౌకాయాన రంగంలో... తొలి భారతీయ మహిళా ఇటీఓ రొమీతా బుందేలా. ఈ ఘనత సాధించినా... ఆమె ప్రయాణం అంత సజావుగా సాగలేదు.

Navya : అలలపై ఆమె సంతకం

పురుషుల ఆధిపత్యం కొనసాగే వాణిజ్య నౌకాయాన రంగంలో... తొలి భారతీయ మహిళా ఇటీఓ రొమీతా బుందేలా. ఈ ఘనత సాధించినా... ఆమె ప్రయాణం అంత సజావుగా సాగలేదు. అడుగడుగునా ఒడుదుడుకులనూ ఎదుర్కొన్నారు. అంకితభావంతో, నైపుణ్యంతో... విమర్శించిన వారితోనే ‘భేష్‌’ అనిపించుకొని... కెరీర్‌లో దూసుకెళ్తున్నారు.

‘‘అది 2017 డిసెంబర్‌. ఒక మెర్క్స్‌ వాణిజ్య నౌకలో ఉద్యోగిగా నాకు మొదటి రోజు. నౌక మేనేజర్‌కు రిపోర్ట్‌ చెయ్యడానికి వెళ్ళాను. అతను నావైపు చిరాగ్గా చూశారు. ‘‘ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్‌? ఇది నీకు ఉద్దేశించిన ఉద్యోగం కాదు. మనం ఇంకా పోర్టునుంచి బయల్దేరలేదు. నువ్వు ఓడ దిగిపో. ఇంటికి వెళ్ళు. వేరే ఉద్యోగం ఏదైనా చూసుకో’’ అన్నారు’’అంటూ తనకు ఎదురైన అవహేళనను గుర్తు చేసుకున్నారు రొమీతా బుందేలా. మహారాష్ట్రలోని భుసావల్‌లో జన్మించిన ఆమెకు నౌకారంగంలో పని చెయ్యాలనేది చిన్ననాటి కోరిక.

‘‘9-5 ఉద్యోగం నా స్వభావానికి సరిపడదు. ప్రపంచమంతా తిరగడానికి వీలు కలిగించే ఉద్యోగాన్ని నేను కోరుకున్నాను. ఓడల్లో పని చెయ్యాలనుకున్నాను. దానికోసం ఎంత శ్రమించడానికైనా సిద్ధమయ్యాను’’ అంటున్న రోమితా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ తరువాత... షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సిఐ)లో ఉద్యోగానికి అప్లై చేశారు. కానీ ఎంపిక కాలేదు.

దాంతో వేరే మార్గాలు కోసం వెతికారు. పుణేలోని తొలానీ మెరిటైమ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఎలకో్ట్ర టెక్నికల్‌ ఆఫీసర్‌ (ఇటీఓ) కోర్సు ఉందనీ, వాణిజ్య నౌకల్లో పని చేసేందుకు ఆ అర్హత ఉపకరిస్తుందనీ తెలుసుకున్నారు. ఆ కోర్సులో చేరారు. ఆ బ్యాచ్‌లో ఆమె ఏకైక మహిళ, అంతేకాదు, ఆ సంస్థలో ఆ కోర్సు చేసిన మొదటి మహిళ కూడా. కాలేజీలో నాలుగు నెలల శిక్షణ తీసుకున్న తరువాత.. ఎనిమిది నెలలపాటు ఓడలో శిక్షణ ఉంటుంది. దాన్ని కూడా పూర్తి చేశారు.


అది గొప్ప కాంప్లిమెంట్‌..

‘‘ఇటీవో హోదాతో ఉద్యోగంలో చేరిన ఒక వాణిజ్య నౌకలో మొదటి భారతీయ మహిళను నేనే. అయితే తొలిరోజే నాకు ఎగతాళి, అవమానాలు ఎదురయ్యాయి. నియామకం జరిగింది కాబట్టి... నన్ను తిరస్కరించడానికి కుదరలేదు. ఇరవై మంది పురుషుల మధ్య... సముద్రం మధ్యలో ఒకే ఒక మహిళగా నేను పని చెయ్యడానికి రకరకాల ఇబ్బందులు పడ్డాను.

దానికి తోడు నా నైపుణ్యాన్నీ, నిబద్ధతను క్షణక్షణం అనుమానించారు. నా నైతిక స్థైర్యాన్ని దెబ్బతియ్యాలని చూశారు. నాలుగు నెలల ప్రయాణం ఎన్నో ఒడుదొడుకులతో సాగినా... చివరికొచ్చేసరికి నా పనితీరు చూసి అందరూ గౌరవించడం మొదలుపెట్టారు. ఆ ఓడలో మొదట నాకు నాలుగు నెలలు కాంట్రాక్ట్‌ ఇచ్చారు. ఏ మేనేజరైతే మహిళ ఈ పనికి పనికిరాదన్నారో...

అతనే నన్ను మళ్ళీ రికమండ్‌ చేశారు. ‘‘నీ పనితీరును చూడకుండానే... నిన్ను తప్పుగా అంచనా వేశాను’’ అన్నారు. అది నాకు గొప్ప కాంప్లిమెంట్‌’’ అంటారు రొమీతా. ‘‘ఇటీవో లేదా ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌కు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. షిప్‌లోని ఎలక్ట్రిక్‌, ఎలకా్ట్రనిక్‌, ఆటోమేషన్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌... అన్నిటికీ మాదే బాధ్యత. సరుకులు లోపలికీ, బయటకు క్షేమంగా రాకపోకలు సాగించడానికి అవసరమైన వ్యవస్థలన్నిటినీ పర్యవేక్షిస్తూ ఉండాలి. ప్రతి ఎలక్ట్రిక్‌ వైరు లేదా కేబుల్‌ సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. వాటితో పాటు డెక్‌ సేఫ్టీ పరికరాలు, లైటింగ్‌ సిస్టమ్‌, రిఫ్రిజిరేషన్‌, వెంటిలేషన్‌, పవర్‌... వీటన్నిటి మేనేజిమెంట్‌... ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రమాదం తప్పదు’’ అని చెప్పారామె.


నరకం అనుభవించాం...

ఆ తరువాత ఆమె అనేక మర్చంట్‌ వెసెల్స్‌లో పని చేశాను. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. చైనాలో తొమ్మిది నెలలకు పైగా సముద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఓడను వదిలి వెనక్కు రావాలనుకున్నా విమానాలు తిరగలేదు. ఎప్పుడూ మాస్కులు, పిపిఇ కిట్స్‌ ధరించి ఉండాల్సి వచ్చేది. ‘‘మేము మానసికంగా నరకం అనుభవించాం ఓడలో జీవితం కష్టంగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కనీసం మూడు నాలుగు నెలలు కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండాలి.

మన కదలికలు ఒక ఓడ పరిధికే పరిమితం చేసుకోవడం అంత సులువేం కాదు’’ అని అన్నారు. రొమీతా. ఆమె తన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ... కేవలం నాలుగేళ్ళలోనే... ఇటీఓ నుంచి సీనియర్‌ ఇటీఓగా, ఆ తరువాత ఎలక్ట్రిక్‌ సూపరింటెండెంట్‌గా... అంచెలంచెలుగా ఎదిగారు. ‘‘మెర్క్స్‌లో తొలి లేడీ సూపరింటెండెంట్‌ను నేనే.

అలాగే తక్కువ వయసున్న వ్యక్తిని కూడా. అప్పుడు నాకు ఇరవయ్యారేళ్ళు. అప్పటికే నేను 64 ఓడల్ని హ్యాండిల్‌ చేశాను అని చెబుతున్న ఆమె కిందటి ఏడాది... ‘కార్నివాల్‌ యూకే’ సంస్థలో చేరారు. ‘‘మా ఊర్లో నేనెప్పుడూ సౌకర్యవంతమైన జీవితాన్ని దాటి బయటకు రాలేదు. ఇప్పుడు విభిన్నమైన, ప్రమాదకరమైన వాతావరణాల్లో... ప్రపంచాన్ని చుట్టేస్తున్నాను.

ఎక్కడికక్కడ పురుషాధిక్యత ఎదురవుతూనే ఉంటుంది. కానీ నా సామర్థ్యంతోనే దాన్ని ఎదుర్కొంటున్నాను. నా అనుభవంతో... తోటి మహిళలకు, బాలికలకు చెప్పేది ఒక్కటే. ‘‘నువ్వు ఆడపిల్లవు, నువ్వేం చెయ్యగలవు?’’ అనే మాటలు మీకు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. వాటిని పట్టించుకోకండి. మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. కృషి చేసి దాన్ని సాధించండి. మీ కెరీర్‌ మీద దృష్టి పెట్టండి. పురుషులు చేసే వృత్తులన్నీ మనం చెయ్యగలం’’ అంటున్న రొమీలా... మరింతమంది మహిళలు ఈ కెరీర్‌ ఎంచుకోవడానికి తన కథ స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 01:16 AM