Share News

Navya : మా నాన్న ‘శాంతమూర్తి’

ABN , Publish Date - Jul 22 , 2024 | 01:32 AM

మహాకవిగా జన నీరాజనాలు అందుకున్న దాశరథికృష్ణమాచార్య కూతురుగా పుట్టడం నా అదృష్టం. నేను ఇందిరాగాంధీ అంతటి గొప్పదాన్ని అవ్వాలనేమో, మా నాన్న నాకు ‘ఇందిర’ అని పేరు పెట్టారు. ఆయన నన్ను డాక్టరుగా, తమ్ముడు లక్ష్మణ్‌ను ఇంజినీరుగా చూడాలనుకొన్నారు.

Navya : మా నాన్న ‘శాంతమూర్తి’

‘‘రవి వలె కవి కూడా లోకబాంధవుడు’’ అని సాహిత్యలోకానికి చాటిన చైతన్యశీలి... నిరంకుశత్వ పాలనపై అక్షరాల ‘‘అగ్ని ధార’’ను కురిపించిన కవి... పీడిత ప్రజావాణికి బలాన్నిచ్చి ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ అని ఎలుగెత్తి చాటిన సాహిత్యకారుడు... తెలుగు సినీ సాహిత్యానికి సొబగులద్దిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య శతజయంతి సంవత్సరం ఇవాళ మొదలవుతుంది. ఈ సందర్భంగా దాశరథి జీవితానుభవాలను ఆయన కుమార్తె వంగిపురపు ఇందిర నవ్యతో చెబుతున్నారిలా.!

మహాకవిగా జన నీరాజనాలు అందుకున్న దాశరథికృష్ణమాచార్య కూతురుగా పుట్టడం నా అదృష్టం. నేను ఇందిరాగాంధీ అంతటి గొప్పదాన్ని అవ్వాలనేమో, మా నాన్న నాకు ‘ఇందిర’ అని పేరు పెట్టారు. ఆయన నన్ను డాక్టరుగా, తమ్ముడు లక్ష్మణ్‌ను ఇంజినీరుగా చూడాలనుకొన్నారు. అది కుదరలేదు. కనీసం వారి సాహిత్య వారసత్వం కూడా మాకు అబ్బలేదు. సరస్వతీదేవి మమ్మల్ని కటాక్షించలేదని మేమన్నా అప్పుడప్పుడు అనుకుంటాంగానీ, నాన్న మాత్రం ఆ మాట ఎన్నడూ అనలేదు. నన్ను ప్రేమగా ‘బుజ్జి’ అని పిలిచేవారు.

మమ్మల్ని అస్సలు కోప్పడేవారే కాదు. ముఖం మీద చెదరని చిరునవ్వుతో... తెల్లని ధోతీ, కాల రులేని పొడవు చేతుల చొక్కా ధరించిన నాన్న రూపం నా కళ్ళముందు ఈనాటికి మెదులుతుంటుంది. సాహిత్య పుస్తకాలు, కాగితాలతో నిండిన బ్రీఫ్‌కేసు ఒకటి ఎప్పుడూ ఆయన వెంట ఉండేది. సభలు, సమావేశాల్లో గంటలకొద్దీ అనర్గళంగా ఉపన్యసించే నాన్న ఇంట్లో మాత్రం మితభాషి. పరుషంగా మాట్లాడరు సరి కదా, కనీసం చిరాకు, అసహనం ప్రదర్శించిన సందర్భం ఒక్కటీ లేదు. తన కవిత్వంలో ఆవేశాన్ని, ఆగ్రహజ్వాలలను అంతగా పలికించిన మా నాన్న నిజ జీవితంలో మాత్రం ఓ శాంతమూర్తి.


అక్కినేనికి ‘గాలిబ్‌ గీతాలు’ అంకితం

సినీపరిశ్రమలో మా నాన్నకు అత్యంత ఆత్మీయులంటే అక్కినేని నాగేశ్వరరావు గారే.! అన్నపూర్ణ పిక్చర్స్‌ నిర్మించిన ప్రతి సినిమాలో నాన్న పాట తప్పనిసరిగా ఉండేది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలోని ‘మరో ప్రపంచం’ సినిమాకు నాన్న ఒక పాట రాసి పారితోషకం తీసుకోలేదు. మహాత్మాగాంధీ శతజయంత్యుత్సవాల సందర్భంగా ఒక గొప్ప ఆశయాన్ని ప్రతిఫలిస్తూ తీసిన సినిమా కనుక వద్దన్నారు.

పిల్లలంటే అంత ప్రేమ

నా భర్త పేరు వంగిపురపు గౌరీశంకర్‌. ఆయనది గుంటూరు జిల్లా. సినీ నేపథ్యగాయకుడు ఎమ్మెస్‌ రామారావు గారికి నా భర్త మేనల్లుడు (బామ్మర్ది కుమారుడు) అవుతారు. రామారావుగారితో నాన్నకు ఉన్న స్నేహం వల్ల మా పెళ్లి కుదిరింది. అలా ఆంధ్రా ఇంటి కోడలిని అయ్యాను. మాకు ఒక బాబు. వాడికి అరుణ్‌ కిరణ్‌ అని మా నాన్న పేరు పెట్టారు.

మా ఇంటికి మహాకవుల రాకపోకలు ...

నాన్న సినిమాలకు పాటలు రాస్తున్న సమయంలో... 1963 నుంచి 1979 వరకు చెన్నైలో ఉన్నాం. నా చదువు కూడా అక్కడే సాగింది. మొదట నన్ను జర్మన్‌ స్కూల్లో చేర్పించారు. నాకు తెలుగు రావడంలేదని తర్వాత కేసరి హైస్కూలుకు మార్చారు. మాతృభాషంటే నాన్నకు అంత ఇష్టం. మేము వీఎం స్ట్రీట్‌లోని ఒక అపార్టుమెంటులో ఉండేవాళ్లం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది మాది ఎదురెదురు ఫ్లాట్లు కావడంతో, రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. శ్రీశ్రీ, ఆరుద్ర లాంటి మహాకవుల రాకపోకలతో మా ఇల్లు కళకళలాడుతుండేది.

వచ్చిన వారికి మంచినీళ్ళతో పాటు టీ, కాఫీలు అందించడమే కానీ నేనెప్పుడూ వారితో సంభాషించింది లేదు. నాన్న అప్పుడప్పుడు నన్ను మెరీనా బీచ్‌కు, సినిమాలకు తీసుకెళుతుండేవారు. ఒకవైపు సినిమా పాటలు, సాహిత్య కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా మా కోసం తప్పకుండా కొంత సమయం కేటాయించేవారు.

చిన్నాపెద్ద భేదాల్లేకుండా తనకు వచ్చిన ప్రతి ఉత్తరానికి తిరిగి జాబు రాయడం నాన్నకు అలవాటు. అలా కొన్ని వందల ఉత్తరాలు, నాన్న చెబుతుంటే నేను రాశాను. చాలా సాహిత్య సభలకు వెంట నేనూ వెళ్లాను. కానీ సినిమా షుటింగులకు తీసుకెళ్ళడం లాంటివి మాత్రం ఎప్పుడూ చేయలేదు.


అప్పుడు చాలా బాధపడ్డారు

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ ఆస్థానకవిగా నాన్న బాధ్యతలు స్వీకరించాక, చెన్నైలో ఉంటూ తాను ఆ హోదాకు పూర్తి న్యాయం చేయలేననుకున్నారు. దాంతో 1979లో కుటుంబమంతా తిరిగి హైదరాబాద్‌కు వచ్చాం. ఆ సమయంలో చేతినిండా సినిమా అవకాశాలు ఉన్నా, స్వరాష్ట్రంలో సాహిత్య రంగానికి తనవంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో వాటిని కాదనుకున్నారు. తాను ఒకటి తలిస్తే, విధి మరొకటి తలచిందన్నట్టు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ పదవులను రద్దు చేయడంతో నాన్న చాలా బాధపడ్డారు.

ఆస్థాన కవిగా అప్పటి వరకున్న కారు, హోదా లాంటివి పోయినందుకు కాదు, తెలుగు సమాజానికి తనవంతు సేవచేసే అవకాశం కోల్పోయినందుకు కొంత ఆవేదనకు లోనయ్యారు. కానీ అదెన్నడూ ఇంటిలో ప్రదర్శించలేదు. నాన్నకు కష్టాలు కొత్తకాదు కదా.! అదివరకే ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా చేయడంతో కుటుంబ పోషణ కాస్త కష్టమైంది. అయినా, వెనక్కితగ్గలేదు.

ఒకరి దగ్గర చేయి చాచకుండా, మాకు ఏ లోటు రాకుండా కుటుంబాన్ని చూసుకున్నారు. జనం గోడును వినిపించడమేకానీ తన వ్యక్తిగత బాధలకు మా నాన్న ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. ప్రముఖ రచయితగా గుర్తింపు వచ్చిన తర్వాత కూడా చాలా సాహిత్య సమావేశాలకు కాలినడకన, మరీ దూరమైతే రిక్షాలో వెళ్లేవారు. నిర్వాహకులు కారు పంపుతామంటే కూడా వద్దు అనేవారు. నాన్న స్థితప్రజ్ఞత, సింప్లిసిటీ చూసి ఒక్కోసారి నాకే ఆశ్చర్యమేసేది.


జైలు జీవితంతో జీవితకాల బాధ

నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న కారణంగా నాన్న 16నెలలకుపైగా ఖైదు అనుభవించారు. కానీ అది ఆయన ఆరోగ్యం మీద జీవితకాలం ప్రభావం చూపింది. జైల్లో రాజకీయ ఖైదీలకు సిమెంటు, సున్నం కలిపి చేసిన రొట్టెలు పెట్టేవారట. అవి తినడం వల్ల నాన్న జీర్ణవ్యవస్థ దెబ్బతింది. తర్వాత కొంతకాలానికి బీపీ, షుగర్‌ వచ్చాయి. మితాహారం తీసుకుంటూ చాలా క్రమశిక్షణగా ఉండేవారు.

అయినా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. నా ఒడిలోనే చివరి శ్వాస విడిచారు. నాన్న మాకు దూరమై 36ఏళ్లు దాటినా, తనను తలచుకోని రోజు లేదు. మా అమ్మ 2012లో కన్నుమూశారు. అమ్మానాన్నకు చివరి రోజుల్లో సేవ చేసే భాగ్యం నాకు దక్కింది. రాజకీయాలతో సంబంధంలేకుండా దాశరథి జయంత్యుత్సవాలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇది దాశరథిగారి శత జయంతి సంవత్సరం. ఆ మహాకవి స్ఫూర్తిని ఈతరానికి తెలిపే ప్రయత్నాలు కొనసాగాలి. అదే ఆయనకు అసలైన నివాళులు.

-సాంత్వన్‌, ఫొటో: జ్వాలా కోటేశ్‌

Updated Date - Jul 22 , 2024 | 01:32 AM