Share News

ఫిర్‌ భీ దిల్‌ హై హిందుస్థానీ

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:48 PM

పుట్టింది ఇంగ్లిస్తానీ(బ్రిటన్‌)లో... ఉద్యోగం చేసింది జపాన్‌లో... కానీ సంధ్యాసూరి మనసంతా భారతీయం. ఎందుకంటే... ఆమె తీసిన రెండు డాక్యుమెంటరీలు, ఒక షార్ట్‌ ఫిల్మ్‌, తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ‘సంతోష్‌’... అన్నిటికీ ఇండియానే నేపథ్యం. ‘సంతోష్‌’ ఈ ఏడాది ‘కేన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో

ఫిర్‌ భీ దిల్‌ హై హిందుస్థానీ

పుట్టింది ఇంగ్లిస్తానీ(బ్రిటన్‌)లో... ఉద్యోగం చేసింది జపాన్‌లో... కానీ సంధ్యాసూరి మనసంతా భారతీయం. ఎందుకంటే... ఆమె తీసిన రెండు డాక్యుమెంటరీలు, ఒక షార్ట్‌ ఫిల్మ్‌, తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ‘సంతోష్‌’... అన్నిటికీ ఇండియానే నేపథ్యం. ‘సంతోష్‌’ ఈ ఏడాది ‘కేన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శితమయింది. దాన్ని యూకె ప్రభుత్వం ‘ఆస్కార్‌’కు తమ అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసింది.‘జీవితానుభవాలు, సమాజంలోని సంఘటనలే గొప్ప కథలవుతాయి’ అంటున్న సంధ్య తన సినీ ప్రయాణం గురించి ఏం చెబుతున్నారంటే...

జపాన్‌ నాలో సృజనాత్మకతకు రెక్కలు తొడిగింది. ఖాళీ దొరికినప్పుడల్లా కెమేరాతో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం, ఫొటోలు, వీడియోలు తియ్యడం.... ఇదే పని. అప్పుడే ఫిల్మ్‌ మేకర్‌ కావాలనే కోరిక కలిగింది.

‘‘నా చిన్నప్పుడు... రోజూ రాత్రి నాన్న ఇంటికి వచ్చేవరకూ మేలుకొని ఉండేదాన్ని. నిద్రపోయేముందు ఆయన ఎన్నో కథలు చెప్పేవారు. అవన్నీ దాదాపు ఇండియాకు సంబంధించినవే. నాలో భారతీయ మూలాలు, భావోద్వేగాలు బలపడడానికి అవే కారణం. నాన్న యశ్‌పాల్‌ సూరి డాక్టర్‌. బ్రిటన్‌లోని టీసైడ్‌లో ఉన్న ఒక ఆసుపత్రిలో ఉద్యోగం.. నేను పుట్టింది, పెరిగింది టీసైడ్‌కి దగ్గర్లో ఉన్న డార్లింగ్టన్‌లో. అందరూ నేను నాన్నలా డాక్టర్‌ అవుతాననుకున్నారు. కానీ నాకు లెక్కలంటే ఆసక్తి. అందులోనే గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఉద్యోగం మాత్రం బ్రిటన్‌లో చెయ్యకూడదనుకున్నాను. జపాన్‌లో టీచర్‌ ఉద్యోగానికి అప్లై చేస్తే... నన్ను ఎంపిక చేశారు. ఈ సంగతి చెప్పినప్పుడు నా కుటుంబం కానీ, స్నేహితులు కానీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే... ‘‘అందరి విషయాలూ సంధ్యకే కావాలి. ప్రతిదానిలో దూరిపోతుంది’ అనే గొప్ప పేరుంది నాకు. అది నిజమే... అన్నీ తెలుసుకోవాలనే కుతూహలం నాకు బాగా ఎక్కువ. అలాగే అపరిచితమైన ప్రదేశాల్లో పర్యటించడం కూడా. జపాన్‌ నాలో సృజనాత్మకతకు రెక్కలు తొడిగింది. ఖాళీ దొరికినప్పుడల్లా కెమేరాతో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం, ఫొటోలు, వీడియోలు తియ్యడం.... ఇదే పని. అప్పుడే ఫిలిమ్‌ మేకర్‌ కావాలనే కోరిక కలిగింది. అది నానాటికీ బలపడింది. జపాన్‌ నుంచి వెనక్కు వచ్చాను. బ్రిటన్‌లోని బకింగ్‌హామ్‌షైర్‌లో ఉన్న ‘నేషనల్‌ ఫిలిమ్‌ అండ్‌ టెలివిజన్‌ స్కూల్‌’ (ఎన్‌ఎ్‌ఫటిఎ్‌స)లో ‘డాక్యుమెంటరీ ఫిలిమ్‌మేకింగ్‌ కోర్సు’లో చేరాను. స్కాలర్‌షిప్‌ కూడా సాధించాను. దాంతో నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది.

Sandhya-Suri3.jpg


నాన్న టేపులతో...

ఒక చిత్ర నిర్మాణంతో ముడిపడి ఉండే ప్రతి దశ గురించి ‘ఎన్‌ఎ్‌ఫటిఎ్‌స’లో నేను తెలుసుకున్నాను. ‘ఎలాంటి కాన్సె్‌ప్టలు ఎంచుకోవాలి?, వాటిని ఆకట్టుకొనేలా ఎలా చెప్పాలి?’ అని ప్రణాళికలు వేసుకొనేదాన్ని. కానీ కోర్సు పూర్తయ్యాక, ఒక డాక్యుమెంటరీ తియ్యాలని అనుకున్నప్పుడు... భారతదేశ నేపథ్యంలోనే అది ఉండాలనుకున్నాను. కానీ నేను పెద్దగా కష్టపడలేదు. దానికి కారణం కూడా మా నాన్నే. ఆయన చాలా క్రియేటివ్‌ పర్సన్‌. భారతదేశం నుంచి బ్రిటన్‌కు వలస వచ్చిన తరువాత.. తన అనుభవాలను ఆయన టేప్‌లలో రికార్డ్‌ చేసి, ఇండియాలోని మా వాళ్ళకు పంపేవారు. అవి నాకు వినిపించేవారు. వాటిని ఆధారంగా తీసుకొని... 2005లో నా మొదటి డాక్యుమెంటరీని రూపొందించాను. దాని పేరు ‘ఐ ఫర్‌ ఇండియా’. 2006లో అది విడుదలై... ‘సన్‌డ్యాన్స్‌ ఫిలిమ్‌ ఫెస్టివల్‌’లో ‘గ్రాండ్‌ జ్యూరీ ప్రైజ్‌కు నామినేట్‌ అయింది. ఆ తరువాత వ్యక్తిగత కారణాల వల్ల పదేళ్ళకి పైగా సుదీర్ఘమైన విరామం వచ్చింది. ఆ సమయంలో ‘ఆక్స్‌ఫామ్‌’ అనే ఛారిటీ సంస్థకు అనుబంధంగా ఒక ఫిల్మ్‌ యూనిట్‌ నిర్వహించాను. డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, హయితి తదితర దేశాల్లో ప్రకృతి విపత్తులను, అభివృద్ధి కార్యక్రమాలను చిత్రీకరించాను. ఇండియాలో కూడా ఒక ఏడాది ఉన్నాను. ఎన్నో స్ర్కిప్ట్స్‌ తయారు చేసుకున్నాను. బ్రిటిష్‌ ఇండియాలో భారతీయులు, బ్రిటిష్‌ వారి జీవనం, వారి మధ్య సామాజిక సంబంధాలు ఎలా ఉండేవి? అనేది ప్రధానాంశంగా... ‘ఎరౌండ్‌ ఇండియా విత్‌ ఎ మూవీ కెమేరా’ అనే డాక్యుమెంటరీ తీశాను. దానికోసం బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆర్కైవ్స్‌లోని ఫుటేజిని ఉపయోగించాను. వాటికి ఇండియాలో నేను తీసిన దృశ్యాలను జోడించి... 2018లో విడుదల చేశాను. అదే ఏడాది రూపొందించిన నా మొదటి షార్ట్‌ ఫిల్మ్‌ ‘ది ఫీల్డ్‌’కూడా విడుదలయింది. టొరొంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిమ్‌’, ‘మెల్బోర్న్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ‘బెస్ట్‌ ఫిక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌’ అవార్డులను గెలుచుకోవడంతో పాటు పలు చలనచిత్రోత్సవాలకు నామినేట్‌ అయింది. హరియాణాలోని చిన్న వ్యవసాయ పట్టణమైన షెహ్‌జాదాపూర్‌లోని మొక్కజొన్న తోటల్లో పని చేసే లైలా అనే మహిళ చుట్టూ తిరిగే కథ అది. ఈ లఘు చిత్రం నాకు గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టింది. పూర్తి నిడివితో ఒక ఫీచర్‌ ఫిల్మ్‌ తియ్యడానికి కావలసిన ఉత్సాహాన్ని నాలో కలిగించింది. ఆ చిత్రమే ‘సంతోష్‌’. సంచలనం రేకెత్తించిన 2012 నాటి నిర్భయ సంఘటన దీనికి ప్రేరణ.


వారి వేదన నన్ను కదిలించింది...

నా దృష్టిలో సినిమా అనేది భావోద్వేగపరమైన మాధ్యమం. మన జీవితాలను, సమాజాలను పరిశీలిస్తే... తెరకెక్కించదగిన కథలు ఎన్నో తయారవుతాయి. నిర్భయ సంఘటన తరువాత భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఆందోళనలను నేను చాలా దగ్గరగా పరిశీలించాను. ఆందోళన చేస్తున్న మహిళలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న మహిళా పోలీసుల్లో కనిపించిన వేదన నన్ను కదిలించింది. వాళ్ళు కూడా ఆ మహిళల్లాంటివారే. వారిలోనూ ఆ సంఘటన పట్ల ఆగ్రహం ఉంటుంది. కానీ దాన్ని ప్రదర్శించడానికి బదులు... ప్రదర్శకులను నియంత్రించే బాధ్యత వారిది. కొన్నాళ్ళపాటు ఆ దృశ్యాలు నాకు పదే పదే గుర్తొస్తూ ఉండేవి. వాటి ఆధారంగా 2016లో ఒక కథ తయారు చేసుకున్నాను. కానీ నిర్మాతలను వెతకడం కష్టమయింది. చివరకు ఇంగ్లండ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇండియాలకు చెందిన ఫిల్మ్‌ ఫండింగ్‌ సంస్థల భాగస్వామ్యంతో... ఆ చిత్రం పట్టాలెక్కింది. ఇది సంతోష్‌ సైనీ అనే మహిళా కానిస్టేబుల్‌ కథ. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌ లాంటి ఒక రాష్ట్రంలో జరుగుతుంది. సంతోష్‌ భర్త విధి నిర్వహణలో మరణిస్తాడు. కారుణ్య నియామకం కింద ఆమెకు కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అయితే... ఒక బాలిక హత్య కేసు పరిశోధన ఆమె జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. వర్గం, కులం, ధనం, అసహనం లాంటి వాటి ప్రభావం సమాజంలోని మనుషుల జీవితాల మీద త్రీవంగా ఉంటుంది. వాటిని ఈ చిత్రంద్వారా చూపింపడానికి ప్రయత్నించాను. లఖనవూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 44 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. యూపీని ఎంచుకోవడానికి కారణం... మాది ఆ ప్రాంతం కావడమే. స్థానికులు చాలామందిని వివిధ ప్రాత్రలకు తీసుకున్నాం. ‘సంతోష్‌’ పాత్రలో ప్రముఖ నటి షహనా గోస్వామి అద్భుతంగా నటించింది. ఈ చిత్రం నా అత్యుత్తమ జీవితానుభవాల్లో ఒకటి. ఈ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఈ చిత్రం నామినేట్‌ అయింది. తొలి ప్రదర్శన కూడా అక్కడే జరిగింది. బ్రిటన్‌లో, ఇండియాలో ఈ సినిమాను స్ర్కీనింగ్‌ చేసినప్పుడు, మరికొన్ని చిత్రోత్సవాల్లో ప్రదర్శించినప్పుడు మంచి స్పంందన వచ్చింది. ఇప్పుడు ‘బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్ట్స్‌’ (బిఎఎ్‌ఫటిఎ) వచ్చే ‘ఆస్కార్‌’లో ‘ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ కోసం బ్రిటన్‌ తరఫు ఎంట్రీగా నా చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈ సంగతి తెలియగానే నాలో కలిగిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. నేను భారతీయ సంతతికి చెందినదాన్ని. భారతదేశంలోనే నా చిత్రాలన్నీ తీశాను. అది గర్వంగా భావిస్తున్నాను. నా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌కే ఇలాంటి గుర్తింపు పొందడాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాను. నా రాబోయే ప్రాజెక్టులకు ఇది కచ్చితంగా గొప్ప పునాదిగా నిలుస్తుంది.’’?

Updated Date - Sep 29 , 2024 | 11:48 PM