Share News

సముద్రంలో మన సాహసయాత్ర

ABN , Publish Date - Sep 29 , 2024 | 11:43 PM

దూరం 40 వేల కిలోమీటర్లు.. వ్యవధి 8 నెలలు. అది నేల మీద సాగే ప్రయాణం కాదు. ప్రమాదాలు పొంచి ఉండే, సముద్ర ప్రయాణం. ఎగసిపడే అలలు, విరుచుకుపడే తుఫాన్లు,

సముద్రంలో మన సాహసయాత్ర

దూరం 40 వేల కిలోమీటర్లు.. వ్యవధి 8 నెలలు. అది నేల మీద సాగే ప్రయాణం కాదు. ప్రమాదాలు పొంచి ఉండే, సముద్ర ప్రయాణం. ఎగసిపడే అలలు, విరుచుకుపడే తుఫాన్లు, పోటెత్తే సముద్ర జలాలు... ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే ప్రకృతి శక్తులతో పోరాడుతూ, పడవలో ప్రపంచాన్ని చుట్టబెట్టే సాహసయాత్రకు పూనుకోబోతున్నారు నౌకాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు. అక్టోబరు 2న ప్రారంభమయ్యే ఆ యాత్రా విశేషాల గురించిన ఆసక్తికరమైన కథనమిది.

మహిళల్లో ధైర్యసాహసాలకు కొదవ లేదని నిరూపించే బృహత్తర ప్రయత్నంలో భాగంగా భారత నావికా దళం, 2017లో నావికా సాగర్‌ పరిక్రమ ఎడిషన్‌ను ప్రారంభించింది. సముద్ర ప్రయాణాల పట్ల స్వతహాగా ఆసక్తిని కలిగి ఉన్న మహిళా నావికాదళ అధికారులను నావికాదళం, ఇలాంటి సాహసయాత్రల కోసం ఎంచుకుంటూ ఉంటుంది. అలా రెండవ నావికా సాగర్‌ పరిక్రమ యాత్రకు, పుదుచ్చేరికి చెందిన ల్యూటినెంట్‌, క్యాడర్‌ రూప, కాలికట్‌కు చెందిన ల్యూటినెండ్‌ క్యాడర్‌ డిల్నాలు ఈ యాత్రకు ఎంపికయ్యారు. నౌకాదళ కుటుంబాలకు చెందిన 30 ఏళ్ల ఈ ఇద్దరు నౌకాదళ అధికారులు గత మూడేళ్లుగా ఈ సాహసయాత్ర కోసం శిక్షణ పొందుతూ ఉన్నారు. అక్టోబరు 2న, గోవాలోని నేవల్‌ ఓషన్‌ సెయిలింగ్‌ నోడ్‌, ఐఎన్‌ఎ్‌స మండోవి నుంచి వీళ్ల సాహసయాత్ర మొదలు కాబోతోంది.


సమర్థమైన శిక్షణ తీసుకుని...

ఎలాంటి బాహ్య సహాయసహకారాలు లేకుండా, కేవలం పవన శక్తి ఆధారంగా, 21,600 నాటికల్‌ మైళ్లు (40 వేల కిలోమీటర్లు) దూరం ఈ సముద్రయానం సాగబోతోందని డిల్నా ఈ సాహసయాత్ర గురించి వివరిస్తోంది. ఈ సముద్రాంతర సాహసయాత్రకు సంబంధించిన సన్నాహాల్లో భాగంగా, ఈ ఇద్దరు మహిళా అధికారులు, గత ఏడాది ఆరుగురు సిబ్బందితో కలిసి, గోవా నుంచి కేప్‌ టౌన్‌ మీదుగా రియొ డి జనీరోకు సముద్రయానం చేశారు. అలాగే గోవా నుంచి శ్రీ విజయపురం (పోర్ట్‌ బ్లెయిర్‌)కు కూడా సముద్రంలో ప్రయాణించారు. ఈ ఏడాది ప్రారంభంలో గోవా నుంచి మారిష్‌సలోని పోర్ట్‌ లూయి్‌సకు కూడా ప్రయాణించి వచ్చారు. ఈ ప్రపంచ సాహసయాత్రను, నావికా ప్రధాన కార్యాలయంలోని, ఇండియన్‌ నేవల్‌ సెయిలింగ్‌ అసోసియేషన్‌తో పాటు, గోవాలోని ఓషన్‌ సెయిలింగ్‌ నోడ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ప్రమాదరకమైన ప్యాసేజీ గుండా...

ఈ సముద్రయానంలో భాగంగా డిల్నా, రూప, అత్యంత ప్రమాదకరమైన మార్గాల గుండా ప్రయాణించబోతున్నారు. అత్యంత అల్లకల్లోలమైన జలాలు ఆవరించి ఉండే కేప్‌ లూవిన్‌, కేప్‌ హార్న్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ల గుండా వీళ్ల ప్రయాణం సాగబోతోంది. ఈ ప్రయాణంలో భాగంగా అత్యంత భయంకరమైన డ్రేక్‌ ప్యాసేజ్‌ గుండా ప్రయాణించవలసి ఉంటుందని కూడా డిల్నా అంటోంది. 16వ శతాబ్దపు బ్రిటిష్‌ అన్వేషకుడు సర్‌ ఫ్రాన్సిస్‌ డ్రేక్‌ పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ ప్యాసేజ్‌, కేప్‌ హార్న్‌, చిలి, అర్జెంటీనా, అంటార్కికాల మధ్య నెలకొని ఉన్న సముద్ర ప్రాంతం. రెండు మహాసముద్రాలను విడగొట్టే ఈ మార్గంలో అలలు 40 అడుగుల మేరకు ఎగసి పడుతూ ఉంటాయి. ఈ ఇద్దరు మహిళలూ, మొదటి విడతలో భాగంగా 45 నుంచి 50 రోజుల పాటు ప్రయాణించి, ఆస్ట్రేలియాలోని ఫ్రెమాంటిల్‌లో మొదటి మజిలీ చేస్తారు. తర్వాత న్యూజిలాండ్‌లోని లిటిల్‌టన్‌, ఫాక్‌ల్యాండ్‌లోని పోర్ట్‌ స్టాన్లీ, దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌కు చేరుకుని, అంతిమంగా గోవాకు తిరుగు ప్రయాణమవుతారు. ఈ ప్రయాణం గురించి వివరిస్తూ... ‘‘మేం 40 డిగ్రీల దక్షిణ అక్ష్యాంశానికి దిగువ నుంచి, 56 డిగ్రీల మేర దక్షిణం వరకూ ప్రయాణిస్తాం. అంటార్కిటికా మాకు కేవలం 800 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ప్రయాణం అసాంతం పడవ ఎన్నో ఒడిదొడుకులకు లోనవుతూ ఉంటుంది కాబట్టి మేం తరచూ ఓడరేవుల్లో ఆగుతూ, పడవ పరిస్థితిని గమనించుకుంటూ ఉండడం అవసరం. 2017లో ఆరుగురు సభ్యులు పాల్గొన్న మొట్టమొదటి సముద్రాంతర ఐఎన్‌ఎ్‌సవి తరుణి పడవనే ఈ యాత్ర కోసం ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఆగిన ప్రతి చోటా రెండు వారాల పాటు విరామం తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాం’ అంటోంది డిల్నా.


మొదటి యాత్రలో మన తెలుగుమ్మాయిలు

2017లో నావికాదళం చేపట్టిన నావికా సాగర్‌ పరిక్రమ మొదటి ఎడిషన్‌లో పాల్గొన్న ఆరుగురు సిబ్బందిలో, మన తెలుగమ్మాయిలు, నేవీ లెఫ్టినెంట్‌ కమాండర్‌ ‘ఐశ్వర్య బొడ్డపాటి’, పి. స్వాతి కూడా ఉన్నారు. 2007, జులైలో నేవీలో చేరిన ఐశ్వర్య, 2014లో ఈ సాహసయాత్రకు దరఖాస్తు చేసుకుంది. 500 మంది మహిళా నౌకాదళ అధికారుల్లో అంతిమంగా 40 మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీరిలో 38 మంది వేర్వేరు కారణాల వల్ల శిక్షణ మధ్యలోనే వెనుదిరగడంతో అంతిమంగా ఆరుగురు మహిళా నావికా అధికారులే మిగిలారు. వారిలో ఐశ్వర్య, స్వాతి ఉన్నారు. ఒంటరిగా సముద్రంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన కెప్టెన్‌ దిలీప్‌ దొండే నేతృత్వంలో శిక్షణ పూర్తి చేసుకున్న వీళ్లు, 254 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించి, సముద్ర యానంతో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి తెలుగమ్మాయిలుగా గుర్తింపు పొందారు. ఈ ప్రయాణంలో భాగంగా, గోవా నుంచి కేప్‌ టౌన్‌ వరకూ, 21,600 నాటికల్‌ మైళ్లు ప్రయాణించి, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌, ఫాక్‌ల్యాండ్‌ (యుకె), దక్షిణాఫ్రికా, మారిషస్‌ దేశాలను చుట్టబెట్టారు. మహిళా సాధికారతతో పాటు, ప్రపంచ వేదిక మీద భారతీయ మహిళా శక్తిని ప్రదర్శించడమే ప్రధానంగా నావికాదళం ఈ సాహసయాత్రలకు రూపకల్పన చేయడం విశేషం.

Updated Date - Sep 29 , 2024 | 11:44 PM