Share News

Tennis Iga Swiatek : మట్టి కోట మహారాణి

ABN , Publish Date - Jun 12 , 2024 | 04:03 AM

రికార్డులు బద్దలు కొట్టడం ఆమెకు కొత్త కాదు. పంథొమ్మిదేళ్ల వయసులోనే ‘రొలాండ్‌ గారోస్‌’ను ముద్దాడింది. దిగ్గజాలు తలపడే గ్రాండ్‌స్లామ్‌ల్లో విజయాలూ తక్కువేం లేవు. నాలుగేళ్లలో ఐదు టైటిళ్లు సాధించింది.

Tennis Iga Swiatek : మట్టి కోట మహారాణి

రికార్డులు బద్దలు కొట్టడం ఆమెకు కొత్త కాదు.

పంథొమ్మిదేళ్ల వయసులోనే ‘రొలాండ్‌ గారోస్‌’ను ముద్దాడింది.

దిగ్గజాలు తలపడే గ్రాండ్‌స్లామ్‌ల్లో విజయాలూ తక్కువేం లేవు.

నాలుగేళ్లలో ఐదు టైటిళ్లు సాధించింది.

ఇప్పుడు... వరుసగా మూడోసారి ‘ఫ్రెంచ్‌ ఓపెన్‌’ నెగ్గి...

మట్టి కోట మహారాణిగా పూలాభిషేకం అందుకొంటోంది.

పోలెండ్‌ టెన్నిస్‌ సంచలనం... ప్రపంచ నెంబర్‌ వన్‌...

23 ఏళ్ల ఇగా స్వియాటెక్‌ జైత్రయాత్ర ఇది...

రాకెట్‌ పట్టి... టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టే ఎవరైనా కనే ఒకే ఒక్క కల... గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. మహామహులు తలపడే ఈ మహాసంగ్రామంలో ప్రతి గెలుపు వెనుకా స్ఫూర్తి నింపే జీవిత కథలు ఎన్నో ఉంటాయి. అలుపెరుగని కృషి, పట్టుదల ఉంటాయి. అలాంటి ఒక కథే ఇగా స్వియాటెక్‌ది. పోలెండ్‌ దేశం వార్సాలో పుట్టింది. ఆమె తండ్రి టోమజ్‌ కూడా క్రీడాకారుడే. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో జాతీయ రోయింగ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. తల్లి డొరోటా వైద్యురాలు. అక్క అగట డెంటిస్ట్‌. తన ఇద్దరు కూతుళ్లను క్రీడాకారులుగా చూడాలనేది టోమజ్‌ ఆకాంక్ష. దానికి తగినట్టుగానే అగట స్విమ్మింగ్‌ మొదలుపెట్టింది. కొన్ని కారణాలవల్ల కొన్నాళ్లకు టెన్నిస్‌ను ఎంచుకుంది. అక్కను చూసి స్వియాటెక్‌ టెన్నిస్‌ రాకెట్‌ పట్టుకుంది. ఎందుకంటే అక్కను ఓడించాలని. అయితే ఐటీఎఫ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ వరకు పోటీపడిన అగట... గాయాల కారణంగా పదిహేనేళ్ల వయసులో ఆట నుంచి తప్పుకుంది. కానీ స్వియాటెక్‌ మాత్రం ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టిన రాకెట్‌ వదల్లేదు. దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. పదమూడేళ్లకే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ అకాడమీకి వెళ్లి... కఠోర సాధన ప్రారంభించింది.

గెలుపు బాట...

2015 నుంచి ఐటీఎఫ్‌ జూనియర్‌ స్థాయిలో పోటీపడిన స్వియాటెక్‌... ఆ ఏడాది నాలుగు టైటిళ్లు గెలుచుకుంది. ఆ మరుసటి సంవత్సరం జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌లోకి అడుగుపెట్టి... ‘ఫ్రెంచ్‌ ఓపెన్‌’ డబుల్స్‌, సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌ వరకు వెళ్లింది. 2018లో కాటీ మెక్‌నలీతో కలిసి ‘ఫ్రెంచ్‌ ఓపెన్‌’ బాలికల డబుల్స్‌ టైటిల్‌ సాధించిన స్వియాటెక్‌... అదే ఏడాది ‘వింబుల్డన్‌’ గర్ల్స్‌ సింగిల్స్‌ విజేతగా నిలిచింది. అప్పటికి ఆమె కెరీర్‌లో అతిపెద్ద విజయం అది. ఇక నాటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ‘డబ్ల్యూటీఏ’ (ఉమెన్స్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌) టూర్‌లో పాల్గొంది. పద్ధెనిమిదేళ్ల వయసులో... గ్రాండ్‌స్లామ్స్‌లోకి ప్రవేశించింది. ‘ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌’, ‘ఫ్రెంచ్‌ ఓపెన్‌’లలో పోటీపడింది.'

సంచలనాలకు చిరునామా...

సంచలనాలకు చిరునామా... స్వియాటెక్‌ కెరీర్‌. 2016 నుంచి 2018 వరకు రెండేళ్ల కాలంలో ఆడిన ఏడు ఐటీఎఫ్‌ సర్క్యూట్‌ ఫైనల్స్‌లో ఓటమి ఎరుగని క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఒక టోర్నీ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఆమె కొట్టిన క్రాస్‌ కోర్ట్‌ ఫోర్‌హ్యాండ్‌ డ్రాప్‌ షాట్‌... ‘డబ్ల్యూటీఏ షాట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ (2019)గా ఎంపికైంది. తొలిసారి ‘టాప్‌ 100’లో చోటు సంపాదించింది. అయితే ఆ తరువాత జరిగిన ‘వింబుల్డన్‌’, ‘యూఎస్‌ ఓపెన్‌’, ‘కెనడియన్‌ ఓపెన్‌’లలో వరుస ఓటములు ఎదురయ్యాయి. కానీ ఆమె నిరాశ చెందలేదు. రెట్టించిన ఉత్సాహంతో... మరింత కఠోర సాధనతో... తిరిగి పుంజుకుంది. తనకంటే మెరుగైన సీడ్స్‌ను మట్టి కరిపిస్తూ... ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో ‘టాప్‌ 50’లోకి దూసుకుపోయింది. అదే సమయంలో కాలి గాయం ఆమెను కొన్నాళ్లు ఆటకు దూరం చేసింది.

హ్యాట్రిక్‌ కొట్టి...

పాదానికి శస్త్రచికిత్స తరువాత స్వియాటెక్‌ మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టింది. 54వ ర్యాంకర్‌గా 2020 ‘ఫ్రెంచ్‌ ఓపెన్‌’ బరిలోకి దిగిన ఆమె... సంచలన విజయాలు నమోదు చేసింది. 2019 రన్నరప్‌, ప్రపంచ 19వ ర్యాంకర్‌ మార్కెటా వోండ్రౌసోవాను తొలి రౌండ్‌లో ఇంటికి పంపించిన స్వియాటెక్‌... నాలుగో రౌండ్‌లో టాప్‌సీడ్‌, టైటిల్‌ ఫేవరెట్‌ సిమోనా హలెప్‌కు షాకిచ్చింది. తద్వారా సిమోనా 17 వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. అంతిమ పోరులో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ సోఫియా కెనిన్‌ను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన పోలెండ్‌ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు... ‘ఫ్రెంచ్‌ ఓపెన్‌’ సింగిల్స్‌ టైటిల్‌ సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డును తిరిగరాసింది. 2022 ఆమె కెరీర్‌లోనే ప్రత్యేకం. ఆ ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు (ఫ్రెంచ్‌, యూఎస్‌ ఓపెన్‌) ఆమె ఖాతాలో చేరాయి. మరుసటి సంవత్సరం కూడా ‘ఫ్రెంచ్‌ ఓపెన్‌’ సొంతం చేసుకున్న స్వియాటెక్‌... ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకుంది. గతవారం ముగిసిన టోర్నీ ఫైనల్‌లో 6-2, 6-1తో పన్నెండో సీడ్‌ పౌలినీని చిత్తు చేసి, మట్టి కోటలో హ్యాట్రిక్‌ టైటిల్స్‌ సాధించింది. ‘రొలాండ్‌ గారోస్‌’లో హెనిన్‌, మోనికా సెలెస్‌ తరువాత వరుసగా మూడు టైటిల్స్‌ గెలిచిన మూడో క్రీడాకారిణి స్వియాటెక్‌.


అంచనాలు పెరుగుతున్నాయి...

ఇప్పటి వరకు మొత్తం 22 సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించిన స్వియాటెక్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ‘గత ఏడాది దాదాపు ఆడిన అన్ని టోర్నీలు గెలవడంతో... ప్రతిసారీ అదే స్థాయిలో ఆడగలనని ప్రతిఒక్కరూ ఊహిస్తున్నారు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రొఫెషనల్‌ క్రీడాకారులు అందరూ అద్భుతమైన ప్రతిభ గలవారే. అయితే ఎవరైతే ఒత్తిడి పరిస్థితులను తట్టుకొని మానసికంగా దృఢంగా ఉండగలరో వారే చాంపియన్లు అవుతారు’ అంటున్న స్వియాటెక్‌ ఎక్కడికి వెళ్లినా ఒక స్పోర్ట్స్‌ సైకాలజిస్ట్‌ను వెంట తీసుకువెళుతుంది. మానసిక ఆరోగ్యానికి ఆమె అంతగా ప్రాధాన్యతనిస్తుంది. ‘కెరీర్‌ ఆరంభం రోజులతో పోలిస్తే నా జీవితం సమూలంగా మారిపోయింది. అయినా ఇవాల్టికీ నేను అదే మనిషిని. నాలో ఎలాంటి మార్పూ రాలేదు. కారణం... మానసిక పరివర్తన. చిన్నప్పటి నుంచి నాతో సైకాలజిస్ట్‌ ఉంటున్నారు. తను నా క్లిష్ట పరిస్థితులు, అలాగే గెలుపు క్షణాలు దగ్గర నుంచి గమనిస్తుంటుంది. నాకేంకావాలో చెబుతుంది’ అంటున్న ఈ పోలెండ్‌ స్టార్‌... అపజయాన్నే కాదు, విజయాన్ని ఎదుర్కోవడం కూడా అంత సులువు కాదని చెబుతోంది. ఎంత ఎదిగినా... ఇంటికి ఎన్ని గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీలు తీసుకెళ్లినా... స్వియాటెక్‌లో ఇసుమంతైనా గర్వం కనిపించదు. అదే ఆమె ప్రత్యేకత.

పుస్తకాలు అద్భుత నేస్తాలు...

నేను టెన్నిస్‌ కోర్టులో హోరాహోరీగా పోరాడతాను. దూకుడుగా ఆడతాను. ప్రతి పాయింట్‌నూ, దానికి ప్రేక్షకులు కొట్టే చప్పట్లను ఆస్వాదిస్తాను. కానీ కోర్టు బయటకు వెళితే నేను పూర్తి భిన్నమైన వ్యక్తిని. ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతాను. రణగొణ ధ్వనులు, జనసమర్థమైన ప్రదేశాలు నచ్చవు. ఒంటరిగా కూర్చొని ‘నేషనల్‌ జియోగ్రఫిక్‌’ చానల్‌ చూస్తుంటాను. పుస్తకాలు బాగా చదువుతాను. ఇవాళ ప్రతిఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడిపి, విలువైన సమయం వృథా చేస్తున్నారు. పుస్తక పఠనం మరిచిపోయారు. సామాజిక మాధ్యమాలే కాదు... ఖాళీ సమయంలో పుస్తకాలు కూడా అద్భుత నేస్తాలు.

ఆటకు ముందు సంగీతం...

మ్యాచ్‌కు ముందు ఇంపైన సంగీతం ఆస్వాదించడం స్వియాటెక్‌కు అలవాటు మాత్రమే కాదు... సెంటిమెంట్‌ కూడా. ‘‘గన్స్‌ ఎన్‌ రోజెస్‌, లెడ్‌ జెప్పెలిన్‌, జానిస్‌ జోప్లిన్‌, లెన్నీ క్రావిట్జ్‌ సంగీతం తరచూ వింటుంటాను. మొదట్లో మ్యాచ్‌లకు ముందు ‘వెల్కమ్‌ టూ జంగిల్‌’ పాప్‌ సాంగ్స్‌ వినేదాన్ని. ఎప్పుడూ ఒకే సంగీతం కాకుండా... ఎప్పటికప్పుడు మారుస్తుంటాను. లేకపోతే అది ఒక మూఢనమ్మకంలా మారిపోతుంది’’ అంటుంది స్వియాటెక్‌.

Updated Date - Jun 13 , 2024 | 04:23 AM