Share News

Navya : ఓ అమ్మ నవ్వుల విందు

ABN , Publish Date - May 22 , 2024 | 01:51 AM

అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో... ఈ అమ్మ నోటి నుంచి వచ్చే పంచ్‌లు అంతలా నవ్వుల విందు చేస్తాయి. భారత్‌లోనే కాదు... దేశవిదేశాల్లోని ఆహుతులనూ తన హాస్యంతో అలరిస్తున్న స్టాండప్‌ కమెడియన్‌..

Navya : ఓ అమ్మ  నవ్వుల విందు

విభిన్నం

అమ్మ చేతి ముద్ద ఎంత కమ్మగా ఉంటుందో... ఈ అమ్మ నోటి నుంచి వచ్చే పంచ్‌లు అంతలా నవ్వుల విందు చేస్తాయి. భారత్‌లోనే కాదు... దేశవిదేశాల్లోని ఆహుతులనూ తన హాస్యంతో అలరిస్తున్న స్టాండప్‌ కమెడియన్‌... జర్నా గార్గ్‌. అమెరికాలో స్థిరపడిన ముగ్గురు పిల్లల తల్లి జర్నా... మొన్నామధ్య ఒక షో కోసం భారత్‌కు వచ్చారు. ఓ సాధారణ ఇల్లాలి నుంచి లక్షల మంది అభిమానించే స్టాండప్‌ కమెడియన్‌గా ఎదిగిన తన ప్రస్థానాన్ని ఈ సందర్భంగా ఆహూతులతో పంచుకున్నారు.

‘‘నా కామెడీ కెరీర్‌ గురించి మావారి అభిప్రాయం ఏంటని చాలామంది అడుగుతుంటారు. ‘నా హాస్య చతురతను ఆయన ఎంతో ఇష్టపడతారు. నా పేరు మరింతగా ప్రాచుర్యం పొంది, నా షో ఎప్పుడు టీవీలో వస్తుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే... చివరకు నా మీద ‘మ్యూట్‌’ బటన్‌ నొక్కచ్చు’ అని వారికి చెబుతుంటాను’’ అంటారు జర్నా గార్గ్‌. ఈ జోక్‌ పేల్చకుండా ఆమె షో ముగియదు. ‘కానీ ఎన్నిసార్లు చెప్పినా ప్రేక్షకులు హాయిగా నవ్వేస్తారు. భార్యాభర్తలైతే... సరదాగా ఒకరికొకరు హైఫైవ్‌ ఇచ్చుకొంటారు’.

అమెరికాలో స్థిరపడిన జర్నా గార్గ్‌ ఆ మధ్య భారత్‌కు వచ్చారు. పలు నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ‘ప్రాక్టికల్‌ పీపుల్‌ విన్‌’ పేరిట ‘ఫక్రా ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ ఈ షోలు ఏర్పాటు చేసింది.


  • పిల్లల సలహా...

జర్నా గార్గ్‌ తన ఈ ‘నవ్వుల’ ప్రయాణాన్ని ఎన్నడూ ఊహించలేదు. భారత్‌లో పుట్టిన ఆమె తరువాత అమెరికాలోని న్యూయార్క్‌ మహానగరంలో స్థిరపడ్డారు. మూడు దశాబ్దాలుగా అక్కడి నుంచే పర్యటనలు చేస్తున్నారు. ఇన్నేళ్లుగా తన విజయ యాత్ర కొనసాగడాన్ని అదృష్టంగా ఆమె భావిస్తారు. అసలు తాను స్టాండప్‌ కమెడియన్‌గా మారడమే ఇప్పటికీ తనకు నమ్మలేని నిజమంటారు. ‘ఇది నా గొప్ప కాదు. నాకు దేవుడు ఇచ్చిన వరం. కలలో కూడా స్టాండప్‌ కమెడియన్‌గా నా కెరీర్‌ ఊహించుకోలేదు’ అని చెబుతున్న జర్నాకు ఈ సలహా ఇచ్చింది ఎవరో తెలుసా..? ఆమె పిల్లలు!

‘నేను మాట్లాడేది సరదాగా ఉంటుంది. దాన్ని వీడియో తీయమని మా పిల్లలు సూచించారు. పిల్లలు చెబితే మనం పెద్దగా పట్టించుకోం కదా. పైగా అది చాలా చెత్త ఆలోచన అని మనసులో అనుకున్నా. వారు చెప్పింది విని వదిలేశా. కానీ వాళ్లు వదల్లేదు. పట్టుబట్టారు. దాంతో కాదనలేకపోయాను’ అని ఒక్కసారి రీలు వెనక్కి తిప్పారు జర్నా గార్గ్‌.

  • ఎప్పటికీ అమ్మనే...

పిల్లల సలహా కాదనలేక... జర్నా గార్గ్‌ 2019లో తన మొబైల్‌తోనే వీడియోలు షూట్‌ చేసి ‘టిక్‌టాక్‌’లో వదిలారు. వాటికి మంచి ఆదరణ లభించింది. అది చూసి ఆమెకే ఆశ్చర్యం వేసింది. ఇక అప్పటి నుంచి వరుసగా హాస్య గుళికలు అప్‌లోడ్‌ చేస్తూ వచ్చారు. క్రమంగా వ్యూస్‌ వేలు, లక్షలు దాటాయి. హాస్యం పండించే కంటెంట్‌ క్రియేటర్‌గా జర్నా గార్గ్‌ పేరు నెట్టింట బాగా పరిచయం అయింది. ఆమె వీడియోలు లెక్కకు మించి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అయ్యాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ఆమె... సెలబ్రిటీగా మారిపోయారు. ఇంట్లో కూర్చొనే చేతి నిండా సంపాదిస్తున్నారు. డిజిటల్‌ తెర మీదనే కాకుండా... క్రమంగా బయట వేదికలపై కూడా ప్రత్యక్షమవుతూ వచ్చారు. ఇప్పుడు... క్షణం తీరిక లేని స్టాండప్‌ కమెడియన్‌గా దేశవిదేశాల్లో పర్యటిస్తూ... హాస్య ప్రియులను విశేషంగా అలరిస్తున్నారు. కెరీర్‌ పరంగా ఎంత ఎదిగినా... ఎంత బిజీగా ఉన్నా... తల్లిగా తన పాత్ర ఎప్పటికీ మారదంటారు ఆమె. ‘ఏ స్థాయికి వెళ్లినా నేను నేనే. అప్పటికీ ఇప్పటికీ బాధ్యతగల అమ్మను’ అంటారు జర్నా. ‘భారతీయ వలస తల్లి’గా విదేశాల్లో జర్నా పేరు బాగా పాపులర్‌.


  • అనుభవాల నుంచి...

ఒక తల్లిగా, ఇల్లాలిగా జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లకు హాస్యాన్ని జోడించి సున్నితంగా చెప్పడంలో జర్నా దిట్ట. మన ఇంట్లో జరిగే ఘటనలు, మన చుట్టూ ఉండే మనుషులు, వారి జీవన శైలి, ఎదురయ్యే అనుభవాలు... ఇవే ఆమెకు కంటెంట్‌. ఎవరినీ నొప్పించకుండా, సరదాగా కాసేపు నవ్వించడానికి ఆమె చేసే ప్రయత్నం లక్షల మంది మనసు దోచుకుంది. ‘నేను భారత్‌ నుంచి వలస వచ్చిన ఒక తల్లిని. ఒక అమ్మగా ప్రపంచంలో ఒక తల్లికి, పిల్లలకు సంబంధించిన కథలు నేను వినిపిస్తాను. అవి అందరికీ నచ్చుతాయి. అలా ఇతర దేశాలవారిని కూడా మెప్పించగలుగుతు న్నందుకు సంతోషంగానే కాదు... గర్వంగానూ అనిపిస్తుంది’ అంటున్న జర్నా జోక్‌ల్లో అధిక శాతం కుటుంబంలో జరిగే నిత్య ఘట్టాలే ఉంటాయి.

  • అంతా సరదాగా..

‘మా ఇంట్లో అందరం చాలా సరదాగా ఉంటాం. అనవసర విషయాల గురించి ఆలోచించి బాధపడుతూ కూర్చోవడం అలవాటు లేదు. నా మాటలైతే ఎప్పుడూ హాస్యం జోడించే సాగుతుంటాయి. ఇప్పుడే కాదు... స్టాండప్‌ కమెడియన్‌గా మారక ముందు కూడా నేను ఇంతే. అందుకే నా కెరీర్‌, బయట నా షోస్‌ మా పిల్లలకు, మావారికి కొత్తగా అనిపించవు. మా అమ్మాయి స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతోంది. మా అబ్బాయిలు వారికి నచ్చింది చేసుకుపోతున్నారు. మా నిజజీవిత క్షణాలను లెన్స్‌లో బంధిస్తుంటాం. అలాగే సామాజిక మాధ్యమాల్లో నేను పోస్టు చేసే వీడియోలన్నీ రెండే నిమిషాల్లో షూట్‌ చేసినవి. అదీ నా సెల్‌ఫోన్‌లో. కొన్ని వీడియోల్లో అయితే సరైన లైటింగ్‌ కూడా ఉండదు’ అంటారు జర్నా.

  • అరిచినా పట్టించుకోరు...

‘నేను ఇంట్లో సరదాగా ఉంటానని చెప్పాను కదా. కానీ అందులో కొంతే నిజం ఉంది. హోమ్‌వర్క్‌ చేయనప్పుడు, వండింది తిననప్పుడు... ఇలా తరచూ మా పిల్లలపై గట్టిగా కేకలు వేస్తూనే ఉంటాను. మా పిల్లల్ని డాక్టర్లను చేయాలనుకున్నా. ఆ విషయమే అరిచి చెప్పే ప్రయత్నం చేశా. వాళ్ల స్నేహితుల్ని కూడా కేకలు వేస్తుంటాను. కానీ వారెవరూ నన్ను సీరియస్‌గా తీసుకోరు. అదంతా సరదా అనుకొంటారు. ఇక నేను మాత్రం ఎంతని అరవగలను?’ అని తన కథ చెప్పే క్రమంలోనూ దానికి కాస్తంత హాస్యం జోడిస్తారు జర్నా. అలాగే అత్తా... కోడళ్ల కంటెంట్‌కు ఎప్పటికీ క్రేజ్‌ తగ్గదంటారు ఆమె. తన దగ్గర వారికి సంబంధించి పది పదిహేనేళ్లకు సరిపడా సరదా కథలు ఉన్నాయంటూ నవ్వేస్తారు జర్నా.

స్టాండప్‌ కమెడియన్‌గా జర్నా ప్రతిష్టాత్మక అవార్డులు కూడా గెలచుకున్నారు. ‘కెవిన్‌ హార్ట్స్‌ లిఫ్ట్‌ కామిక్స్‌’తో పాటు 2021లో ‘లేడీస్‌ ఆఫ్‌ లాఫ్టర్‌ అవార్డ్‌’ అందుకున్నారు. హిల్లరీ క్లింటన్‌ తదితర మహామ హులతో కలిసి వేదిక పంచుకున్నారు. గత ఏడాది వెరైటీ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘టాప్‌ 10 కామిక్స్‌’లో చోటు దక్కించుకున్నారు. జర్నా జర్నీలో ఇలాంటి మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి.

Updated Date - May 22 , 2024 | 01:51 AM