శ్రీవారితో చెలగాటం వద్దు..
ABN , Publish Date - Oct 04 , 2024 | 12:15 AM
ఇటీవల కాలంలో తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డు ప్రసాదం కల్తీ గురించి ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలవారు చర్చించుకుంటున్న విషయం విదితమే. శ్రీవారి సన్నిధిలో నాలుగేళ్ళపాటు ఉన్నతస్థాయి ఉద్యోగిగా...
ఇటీవల కాలంలో తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డు ప్రసాదం కల్తీ గురించి ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలవారు చర్చించుకుంటున్న విషయం విదితమే. శ్రీవారి సన్నిధిలో నాలుగేళ్ళపాటు ఉన్నతస్థాయి ఉద్యోగిగా... స్వామివారి సేవ చేసుకున్న అదృష్టం నాకు కలిగింది. స్వామివారి మహిమాది విషయాలను సంహితలను అనుసరించి నేను తెలుసుకున్నది చెప్పాలనుకుంటున్నాను. స్వామివారి తత్త్వాన్ని గురించి, మహిమను గురించి అనేక వైష్ణవ సంహితలు వివరించాయి. పరమపురుష, శాండిల్య, భరద్వాజ, వైహాయసీ సంహితలలో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవడం స్వామివారి భక్తుల కనీస బాధ్యత.
ఎంతో పుణ్యం చేసుకుంటే మానవజన్మ తప్ప లభించదు. మానవజన్మ లభించినప్పటికీ స్వామివారి సేవ, దర్శన భాగ్యాలు పొందగలగడం అందరికీ సాధ్యం కాదు. జన్మాంతర సహస్రకృత తపోధ్యాన, సమాధుల కారణంగా పాపవిముక్తులైనవారికి మాత్రమే స్వామివారి పట్ల భక్తిప్రపత్తులు ఉండే భాగ్యం లభిస్తుంది. సత్పురుష సాంగత్యం వల్ల కూడ భక్తితత్త్వం కల్గుతుంది. ఇవి రెండే కాకుండా తీసుకొనే ఆహారాన్ని బట్టి కూడా భక్తి ఏర్పడుతుందని, ‘ఆహారశుద్ధౌ సత్వశుద్ధిః సత్త్వశుద్ధౌ ధ్రువా స్మృతిః’ అని పెద్దలు చెప్పారు. ‘ఉర్వినాహార దోషంబు విజ్ఞాన నాశనంబునకు మూలకారణంబు’ అన్నారు కృష్ణదేవరాయలు.
భక్తి కలిగిన ప్రతి వ్యక్తి సత్య, ధర్మ మార్గాలను తప్పనంతకాలం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడౌతాడు. స్వామివారికి ఇష్టంకాని పని/ ఆలోచన అంటే సత్య ధర్మ విరుద్ధమైన తలంపు. అది చిన్నదైనా, పెద్దదైనా మానసికంగా కూడా ఎవరికీ రాకూడదు. అందుకు విరుద్ధంగా ప్రవర్తించినవారికి శిక్ష తప్పదు. దానికి మొదటి ఉదాహరణ నేనే. స్వామివారి కొలువులో ఉన్న కాలంలో నేను చేసిన చిన్న తప్పనకు స్వామి తగు రీతిలో నన్ను శిక్షించాడు. ఇలాంటి స్వామివారి మహిమలను ఆయన కొలువులో పనిచేసే ఏ ఉద్యోగిని అడిగినా అనుభవంతో చెబుతాడు. స్వామివారి మహిమ కారణంగా కొద్దో గొప్పో సంభవించిన మంచి లేక చెడు అనేవి ఉద్యోగులలో ప్రతి ఒక్కరికీ అనుభవసత్యం. అందుకే స్వామితో వ్యవహారం చాలా కఠినంగా ఉంటుంది. ఆయన అనుగ్రహం ఏస్థాయిలో ఉంటుందో ఆగ్రహం కూడా అదే మోతాదులో ఉంటుంది. స్వామివారి విషయంలో తప్పు చేసినవారెవ్వరూ... ఎప్పటికీ తప్పించుకోలేరు. ఫలితం కాస్త వెనకా ముందు అంతే! అందుకే ఆయన భక్తులు, సేవకులు, ఆలయ కార్యనిర్వాహక ధర్మకర్తలు, అర్చ స్వాములు, స్వామివారి ఆలయాలు ఉన్న రాష్ట్ర, దేశ పాలకులు... కళ్ళు, మనసు స్వామివారిమీదే లగ్నం చెయ్యాలి. చిత్తశుద్ధితో, భయభక్తులతో... విత్త బుద్ధిని విడిచి వ్యవహరించాలి. బాధ్యతలో ఏమాత్రం తేడా వచ్చినా... గోవిందా, గోవిందా... అంతే సంగతులు. తమ బాధ్యతలను విస్మరించిన ఉన్నతాధికారులు, రాష్ట్ర, దేశాధినేతలు తమతమ విధి, ధర్మ నిర్వహణ లోపం కారణంగా ఇటీవల మూల్యం చెల్లించుకున్న విషయం అందరికీ తెలుసు.
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం... ‘‘ఎవరు ఏవిధంగా నన్ను చూసుకుంటారో నేను కూడా వారిని అదేరీతిగా చూసుకుంటాను’’ అన్నాడు గీతాచార్యుడు. ఈ ఊరుకు ఆ ఊరెంతో, ఆ ఊరుకు ఈ ఊరూ అంతే దూరం. భగవంతుడికి, భక్తుడికి మధ్య ఉన్న సంబంధం కూడా అంతే. దేశసౌభాగ్యం కోసం, ప్రజాసంక్షేమం కోసం, పాలక యోగ క్షేమాలకోసం మన ప్రాచీన మహర్షులు సంహితల ద్వారా ఆలయార్చన వ్యవస్థను నిర్దేశించారు. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం సాధించడంలో అర్చనను మించిన శ్రేష్ఠమైన మరో మార్గం లేదని, యజ్ఞ యాగాదులు అర్చనతో సమానం కావని సంహితలు చెబుతున్నాయి. దీనికి అనుగుణంగానే రాజ్యపాలకులు దేశంలో ఆలయ నిర్మాణాలు చేశారు. నిర్విఘ్నంగా అర్చనా కార్యక్రమం కొనసాగేలా పాలకులకు, ధర్మాధికారులకు (ఈ.ఓ.), ప్రధాన అర్చక స్వాములకు వివిధ కార్య నిర్దేశాన్ని, నిబంధనావళిని ఆయా సంహితలలో పేర్కొనడం జరిగింది. ఆలయ సేవకులతో సహా అర్చకస్వాముల వరకూ తమతమ విహిత కర్మల్లో లోపం చేసి, స్వామివారికి అపచారం చేసినప్పుడు... ఎవరికి శిక్ష విధించే స్థానంలో ఎవరు ఉంటారో కూడా అందులో స్పష్టంగా ఉంది. నిత్యార్చన విధానంలోని నైవేద్య సమర్పణలాంటి ప్రధాన విధుల్లో ఉన్నవారు లేదా బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు తప్పు చేసినప్పుడు దండనకు గురికాక తప్పదు.
‘ధర్మహానిర్న కర్తవ్యా కర్తవ్యో ధర్మసంగ్రహః
ధర్మాధర్మౌ హి సర్వేషాం సుఖదుఃఖోపపాదక’ (శాండిల్య) అని చెప్పినట్టు ధర్మ, అధర్మ ఆచరణలే అందరి సుఖదుఃఖాలకు మూలకారణం. దేశ సౌభాగ్యం కోసం, ప్రజాశ్రేయస్సు కోసం, ధర్మ సంరక్షణ కోసం మహర్షులు నిర్దేశించిన సంహితలలో పేర్కొన్న శాస్త్రోక్త పద్ధతిలో దేశపాలకులు ఆలయ వ్యవస్థలో ఏర్పాటు చేశారు. ఇది ఎటువంటి లోపాలు జరగని రీతిలో సక్రమంగా కొనసాగేలా ప్రజలు, ఆలయ సేవకులు, ప్రధానార్చక స్వాములు, కార్యనిర్వాహక, ధర్మాధికారులు, రాష్ట్ర, దేశ పాలకులు అందరూ సమష్టి బాధ్యత వహించాలి. ఎవరి కర్తవ్యాన్ని వారు సక్రమంగా నిర్వర్తించాలి. అందుకు విరుద్ధంగా వీరిలో ఏ ఒక్కరైనా ఎటువంటి దుర్మార్గపు ఆలోచననైనా చేసి... స్వామివారి నిత్యార్చనకు, నైవేద్య సమర్పణకు, భక్తుల మనోభావాలకు అపచారం చేసినట్టయితే అందుకు బాధ్యులైనవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే స్వామికి సమర్పించే నైవేద్యంలో ఒక పరమార్థం ఉంది. స్వామివారి ఉదరంలో సమస్త లోకాలు ఉంటాయి. ఆ లోకాల్లో జీవులుంటారు. స్వామివారికి సమర్పించిన పవిత్ర నైవేద్యం సమస్త జీవాత్మల్లో ఉన్న పరమాత్మకు చేరడంవల్ల.... ఆ పవిత్రతతో పరమాత్మతో పాటు సమస్త లోకాల్లోని జీవాత్మలు కూడా తృప్తి చెందుతాయి. ఆ నైవేద్యం కలుషితమైనప్పుడు సమస్త జీవులు వ్యధకు లోనై, అందుకు కారకులైనవారిని శిక్షిస్తాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారికి సమర్పించే నైవేద్యం కలుషితం కాకుండా... బాధ్యులైనవారు జాగ్రత్తగా ఉండాలి.
‘సర్వే లోకాః ప్రవర్తంతే యస్య కుక్షౌ తు సర్వదా
తస్య సంతృప్తయే విష్ణోః నైవేద్యస్య ప్రకల్పనమ్’ అంటోంది ‘పరమ పురుష సంహిత’. కనుక ఆలయ వ్యవస్థ పవిత్ర పరిరక్షణ అందరి బాధ్యత. అహంకార పరిత్యాగంతో స్వామివారికి చేసే పవిత్ర సేవ... పాలకులు సంకల్పించిన ప్రజా సంక్షేమానికి బాట వేస్తుంది. సంకుచితమైన స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు లేదా ప్రజాప్రతినిధులు సృష్టించే బీభత్స వాతావరణం ఆత్మవినాశనాన్ని ఆహ్వానిస్తుంది. అందువల్ల అత్యంత మహిమోపేతుడైన తెలుగువారి ఇలువేలుపు తిరుమల శ్రీవేంకటేశ్వరునితో ఎవరూ చెలగాటానికి కాలు దువ్వి, కాలపురుషుడు విధించే కఠినశిక్షకు గురికాకూడదు.
స్వామితో వ్యవహారం చాలా కఠినంగా ఉంటుంది. ఆయన అనుగ్రహం ఏస్థాయిలో ఉంటుందో ఆగ్రహం కూడా అదే మోతాదులో ఉంటుంది. స్వామివారి విషయంలో తప్పు చేసినవారెవ్వరూ... ఎప్పటికీ తప్పించుకోలేరు. ఫలితం కాస్త వెనకా ముందు అంతే!
డాక్టర్ తాళ్ళూరి ఆంజనేయులు
పూర్వ సంచాలకుడు,
‘శ్వేత’ మరియు ప్రచురణల ప్రత్యేకాధికారి, టిటిడి, తిరుపతి