Share News

మనం ఎప్పుడూ ఉంటాం...

ABN , Publish Date - Nov 29 , 2024 | 12:05 AM

‘‘నేను ఇదివరకు ఎప్పుడూ లేని వాణ్ణి కాదు. నువ్వు కూడా ఇంతకుముందు లేనివాడివి కావు. నీవు కాని, నేను కాని, ఈ పాలకులు కాని ఉండని కాలమే లేదు. ఇక ముందు, అంటే భవిష్యత్తులో ‘మనం ఉండేది లేదు’ అని అనుకోవద్దు. మనం

మనం ఎప్పుడూ ఉంటాం...

న త్వేవాహం జాతు నాసం, నత్వం నేమే జనాధిపాః

న చైవ న భవిష్యామః సర్వే వయ మతఃపరమ్‌

‘‘నేను ఇదివరకు ఎప్పుడూ లేని వాణ్ణి కాదు. నువ్వు కూడా ఇంతకుముందు లేనివాడివి కావు. నీవు కాని, నేను కాని, ఈ పాలకులు కాని ఉండని కాలమే లేదు. ఇక ముందు, అంటే భవిష్యత్తులో ‘మనం ఉండేది లేదు’ అని అనుకోవద్దు. మనం ఎప్పుడూ ఉంటాం’’ అని భగవద్గీతలోని రెండో అధ్యాయమైన సాంఖ్యయోగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించాడు. నాశనంలేనిదీ, శాశ్వతమైనదీ అయిన జీవన అస్తిత్వానికి సంబంధించిన ప్రస్తుత ‘లౌకిక భాగం’ నశించడం ఖాయమనీ, కాబట్టి ముందున్న యుద్ధాన్ని కొనసాగించాలనీ సూచించాడు. శాశ్వతమైన జీవన అస్తిత్వాన్ని ‘ఆత్మ’, ‘చైతన్యం’, ‘అవగాహన’ అనే పేర్లతో పిలుస్తాం. దాన్నే శ్రీకృష్ణుడు ‘దేహి’ అన్నాడు. ఈ సృష్టి తాలూకు సారంతో మొదలుపెట్టి... శాశ్వతమైన, అపరిమితమైన జీవన అస్తిత్వం గురించి ఆయన వివరించాడు. శాశ్వతమైన ఆ అస్తిత్వానికి ఒక భౌతిక భాగం ఉందనీ, అది తప్పనిసరిగా నాశనం అవుతుందని చెప్పాడు. పాలకుల గురించి ఆయన ప్రస్తావిస్తూ... వారిలో ఉన్న శాశ్వతమైన, నాశనం లేని జీవన అస్తిత్వం గురించి చెప్పాడు. ఈ శ్లోకంలో గమనించవలసిన విషయం ఏమిటంటే... మన సృష్టి రెండు భాగాలుగా జరిగింది. మొదటి భాగం దేహం, మనస్సు. ఈ రెండూ తప్పనిసరిగా నాశనం అవుతాయి. ఇవి సుఖదుఃఖాల్లాంటి ద్వంద్వాలకు లోనవుతున్నాయి. కురుక్షేత్రంలో అర్జునుడు అటువంటి భావనకే లోనవుతున్నాడు. రెండవ భాగం శాశ్వతమైన ‘దేహి’. దీన్ని గ్రహించాలనీ, మనల్ని శరీరంతో, మనస్సుతో (అసత్‌)తో గుర్తించుకోవడం మానేసి... దేహి (సత్‌)తో గుర్తించుకోవడం ప్రారంభించాలనీ ఆయన స్పష్టం చేశాడు. బుద్ధత్వం (ఆత్మజ్ఞానం) అనేది ఈ గుర్తింపులను అధిగమించినప్పుడే కలుగుతుంది. దాన్ని అనుభూతి చెందాల్సిందే తప్ప మాటలలో వర్ణించలేం.

యుద్ధం చెయ్యాలని అర్జునుడికి చెప్పే భాగమే ‘భగవద్గీత’లో మన అవగాహనకు లొంగని అత్యంత క్లిష్టమైన భాగం. కొంతమంది అసలు కురుక్షేత్ర యుద్ధమే జరగలేదనీ, అది మన దైనందిన పోరాటాలను ప్రదర్శించే రూపకం మాత్రమేననీ అంటారు. అయితే అర్జునుడు విరమించినంత మాత్రాన... యుద్ధం ముగిసే అవకాశం లేదనేది కూడా నిజం. అవగాహన, బోధన అనే ఆయుధాలతో యుద్ధాలను ఎదుర్కోవాలని శ్రీకృష్ఠుడు బోధించాడు. ‘అహంకారం’ (నేను కర్తను అనే భావన)తో అర్జునుడు యుద్ధం నుంచి ఒకవేళ వైదొలగినా... విషాదానికి శాశ్వతంగా బానిస అవుతాడని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే ‘సత్‌’ను గ్రహించి యుద్ధం చేయాలని సలహా ఇచ్చాడు.

కె. శివప్రసాద్‌ ఐఎఎస్‌

Updated Date - Nov 29 , 2024 | 12:05 AM