Share News

మధుమేహం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ABN , Publish Date - Nov 14 , 2024 | 05:20 AM

డాక్టర్‌! నాకు 40 ఏళ్లు. మధుమేహం ముప్పు పొంచి ఉందని వైద్యులు చెప్పారు. ప్రిడయాబెటిక్‌ పరిస్థితి మధుమేహానికి దారి తీయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

మధుమేహం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

డాక్టర్‌! నాకు 40 ఏళ్లు. మధుమేహం ముప్పు పొంచి ఉందని వైద్యులు చెప్పారు. ప్రిడయాబెటిక్‌ పరిస్థితి మధుమేహానికి దారి తీయకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

- ఓ సోదరి, హైదరాబాద్‌

మధుమేహం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే జీవనశైలిలో మార్పులతో వీటిని సులువుగానే అదుపులో పెట్టుకోవచ్చు. ప్రిడయాబెటిక్‌లో చక్కెర స్థాయిలు సహజం కంటే కాస్త ఎక్కువగా, టైప్‌2 మధుమేహం మోతాదు కంటే కాస్త తక్కువగా ఉంటాయి. ఈ ఆరోగ్య పరిస్థితిలో ఆరోగ్యం తీవ్రంగా కుదేలయ్యే పరిస్థితి తలెత్తే వరకూ మధుమేహ లక్షణాలేవీ బయల్పడవు. కాబట్టి మధుమేహం ముప్పు పొంచి ఉన్న వాళ్లు ముందస్తు రక్తపరీక్షలు చేయించుకుంటూ చక్కెర స్థాయిల మీద ఓ కన్నేసి ఉంచాలి. మరీ ముఖ్యంగా...

  • స్థూలకాయులు

  • 45 ఏళ్లు దాటినవాళ్లు

  • టైప్‌2 డయాబెటిస్‌ కుటుంబ చరిత్ర ఉన్నవాళ్లు

  • వారంలో కనీసం మూడు సార్లు కూడా వ్యాయామం చేయనివాళ్లు

  • గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం బారిన పడినవాళ్లు

  • పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ ఉన్నవాళ్లు

  • ఈ కోవకు చెందినవాళ్లు రెట్టింపు అప్రమత్తంగా నడుచుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ప్రిడయాబెటిక్‌ అని నిర్థారణ అయినప్పుడు ఆ పరిస్థితిని అంగీకరించి, అందుకు తగ్గట్టు జీవనశైలి మార్పులు చేసుకోవాలి. మందులు వాడుతూ దాన్ని అదుపులో ఉంచుకుంటే సరిపోతుందిలే! అనుకోకుండా దాంతో ముడిపడి ఉండే ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ, వాటిని తిప్పి కొడుతూ ఉండాలి. అందుకోసం...

బరువు తగ్గాలి: అధిక బరువును వ్యాయామంతో ఏ కొంత తగ్గించుకోగలిగినా టెప్‌2 మధుమేహం ముప్పు తగ్గుతుంది. మొత్తం శరీర బరువులో 7ు తగ్గినా స్పష్టమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి వారానికి 150 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. అంటే వారంలో ఐదు రోజుల పాటు, రోజుకు 30 నిమిషాల నడక సరిపోతుంది. వేగంగా నడవడం లేదా అంతే సమానమైన ఫలితం దక్కే ఇతరత్రా వ్యాయామాలు కూడా ఎంచుకోవచ్చు.

సరిపడా నిద్ర: రోజుకు 8 గంటలు తగ్గకుండా నిద్ర పోవాలి. రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతూ, ఉదయం ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు మానుకోవాలి. అలాగే మధ్యాహ్న సమయాల్లో కునుకులకు స్వస్థి చెప్పాలి. నిద్ర లేమి తీపి తినాలనే కోరికను పెంచుతుంది. ఫలితంగా మరుసటి ఉదయం తీయని పదార్థాలను ఎక్కువగా తింటూ ఉంటాం. అధిక క్యాలరీలు కలిగి ఉండే తీపి వల్ల శరీర బరువు పెరుగుతుంది.

సమతులాహారం: మాంసకృత్తులు, పీచు, పిండిపదార్థాలు సమతులంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ పరిమాణాలు కాకుండా తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు తినాలి. వీలైనంత ఎక్కువ పీచు, మాంసకృత్తులు, వీలైనంత తక్కువ పిండిపదార్థాలు తీసుకోవాలి. ఆకుకూరలు, తీపి తక్కువ ఉండే పళ్లు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే తృణధాన్యాలను కూడా తీసుకుంటూ ఉండాలి. పాలిష్‌ పట్టిన బియ్యం, గోధుమలకు బదులుగా ముడి బియ్యం, పొట్టుతో కూడిన పప్పుదినుసులను ఎంచుకోవాలి.

దురలవాట్లు: ధూమపానం, మద్యపానం అలవాట్లను మానేయడం ద్వారా ప్రిడయాబెటిస్‌, మరింత పెరగకుండా ఆపే వీలుంది

డాక్టర్‌ సందీప్‌ రెడ్డి గంట

సీనియర్‌ ఎండోక్రైనాలజిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - Nov 14 , 2024 | 05:20 AM