Share News

NRI: యూఎస్ స్కాలర్‌షిప్ కోసం భారీ నాటకం! భారతీయ విద్యార్థికి షాక్!

ABN , Publish Date - Jun 28 , 2024 | 05:26 PM

అమెరికా యూనివర్సిటీ స్కాలర్‌షిప్ కోసం తండ్రి చనిపోయాడంటూ నాటకమాడిన భారతీయ విద్యార్థికి భారీ షాక్ తగిలింది. అక్కడి అధికారులు నిందితుడిని మాతృదేశానికి పంపించేశారు.

NRI: యూఎస్ స్కాలర్‌షిప్ కోసం భారీ నాటకం! భారతీయ విద్యార్థికి షాక్!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా యూనివర్సిటీ స్కాలర్‌షిప్ కోసం తండ్రి చనిపోయాడంటూ నాటకమాడిన భారతీయ విద్యార్థికి భారీ షాక్ తగిలింది. అక్కడి అధికారులు నిందితుడిని (NRI) మాతృదేశానికి పంపించేశారు. రెడిట్‌లో నిందితుడు స్వయంగా పెట్టిన పోస్టు అతడి పాలిట భస్మాసుర హస్తంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, ఆర్యన్ ఆనంద్ అనే విద్యార్థి పెన్సిల్వేనియాలోని లీహై యూనివర్సిటీలో స్కాలర్‌షిప్‌పై చదువుకునే వాడు. స్కాలర్ షిప్ కోసం పొందేందుకు అతడు అనేక అడ్డదారులు తొక్కాడు. ఆర్థిక అంశాల నుంచి ట్రాన్స్‌క్రిప్ట్స్, తన స్కూల్ ప్రిన్సిపాల్ పేరిట నకిలీ ఈమెయిల్ అకౌంట్, తండ్రి చనిపోయినట్టు మరో సర్టిఫికేట్ ఇలా అన్నీ నకిలీ ధ్రువపత్రాలతో పూర్తి స్థాయి స్కాలర్ షిప్ సంపాదించి యూనివర్సిటీలో అడుగుపెట్టానని అతడు గుర్తు తెలియని వ్యక్తి లాగా నటిస్తూ రెడిట్ పోస్టులో రాసుకొచ్చాడు.

NRI: డాలస్‌లో మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

అసత్యాలే పునాదిగా తన చదువు, కెరీర్ నిర్మించుకున్నట్టు చెప్పాడు. ఆ తరువాత తన చదువుపై ఆసక్తి తగ్గిపోవడంతో చివరకు పరీక్షల్లో కాపీ కొట్టడం కూడా ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ఈ పోస్టును చదవిని ఓ కంటెంట్ మోడరేటర్‌ను అనుమానం రావడంతో అతడిపై నిఘా పెట్టి చివరకు సంబంధిత యూనివర్సిటీకి ఉప్పందించాడు (Indian Student Fakes Father's Death For US Scholarship Gets Exposed By Moderator).


ఈ క్రమంలో యూనివర్సిటీ పోలీసు అధికారులు ఆర్యన్‌ పోస్టుపై దర్యాప్తు చేసి అతడి నిర్వాకం బయట్టబయలు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించడం, మోసం తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని ఈ ఏప్రిల్ 30న అరెస్టు చేశారు. అతడి తండ్రి బతికే ఉన్నారని, ఇండియాలో ఉంటున్నారని కూడా గుర్తించారు. ఈ క్రమంలో అమెరికా వలసల శాఖ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తను చేసిన నేరానికి గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే, యూనివర్సిటీ అధికారుల అభ్యర్థన మేరకు అతడిని కళాశాల నుంచి తొలగించడంతో పాటు ఇండియాకు తిరిగి పంపించేశారు.

కాగా, అంతకుమునుపు కెనడాలో కూడా దాదాపు ఇదే ఉదంతం వెలుగులోకి వచ్చింది. మేహుల్ ప్రజాపతి అనే ఓ డేటా సైంటిస్టు తాను స్థానిక ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఉచితంగా ఆహారం పొందుతూ డబ్బులు ఎలా పొదుపు చేసుకుంటున్నదీ చెప్పి అభాసుపాలయ్యాడు. పేదల కోసం ఉద్దేశించిన ఫుడ్ బ్యాంక్‌ను దుర్వినియోగపరిచినందుకు విమర్శలు వెల్లువెత్తడంతో అతడు తలెత్తుకోలేకపోయాడు.

Read Latest NRI News and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 05:26 PM