Share News

AP Elections: రఘురామను కాదని శ్రీనివాసవర్మకు టికెట్.. ఇంతకీ ఎవరీయన..!?

ABN , Publish Date - Mar 25 , 2024 | 11:03 AM

Narasapuram MP Candidate: నరసాపురం నుంచి కూటమి తరఫున భూపతిరాజు శ్రీనివాసవర్మను బీజేపీ ప్రకటించింది. ఇంతకీ ఎవరీ వర్మ..? రఘురామకృష్ణం రాజును ఎందుకు కూటమి వద్దనుకుంది..? తెరవెనుక ఏం జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

AP Elections: రఘురామను కాదని శ్రీనివాసవర్మకు టికెట్.. ఇంతకీ ఎవరీయన..!?

ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ–బీజేపీ–జనసేన (TDP-Janasena-BJP) కూటమి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయ్యింది. నరసాపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను (Bhupathiraju Srinivasa Varma) ఎంపిక చేసినట్లు పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. కైకలూరు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ కామినేని శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారైంది. సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధికారికంగా ప్రకటించింది. నర సాపురం లోక్‌సభ నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ పక్షాన రాష్ట్ర కార్యదర్శి, సీనియర్‌ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ అభ్యర్థిత్వాన్ని ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీకి నేతలు వర్మ, పాకా సత్యనారాయణ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు సాధారణ కార్యకర్త నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన శ్రీనివాసవర్మకు చాన్స్‌ ఇచ్చారు. సాధారణ కార్యకర్త గుర్తింపు ఇదే నిదర్శనమని, అందరిని కలుపుకుని పోవడం ద్వారా కచ్చితంగా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందడం ఖాయమని శ్రీనివాసవర్మ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్‌ షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు.

AP Elections: చిత్తయినా..అదే ఎత్తు..!



Bhupathiraju-Srinivasa-Varm.jpg

రఘురామకు నిరాశ

నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి తాను పొత్తులో భాగంగా ఏ పార్టీ అయినా పోటీ చేయడం ఖాయమని సిట్టింగ్‌ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishnam Raju) విశ్వాసంతో ఉన్నారు. ఆయన పోటీ ఖాయమని కొందరు పందేలకు సైతం దిగారు. చివరి వరకు ఢిల్లీ బీజేపీ పెద్దలు రఘురామ వైపే ఉంటారని అందరూ భావించారు. దీనికి విరుద్దంగా ఆయనకు పార్టీ పరంగా పోటీ చేసే అవకాశం చేజారింది. నరసాపురం పోటీకి తనకు అవకాశం రాకుండా సీఎం జగన్‌ అడ్డుపడ్డారని చెప్పారు. టిక్కెట్‌ రాకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఆది నుంచి సీఎం జగన్‌ అవినీతిపైన, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన దండెత్తిన ఆయనకు అటు బీజేపీ గాని, ఇత ర పార్టీలు గాని అవకాశం లేకుండా చేయడం దారుణమని అంటున్నారు. నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలో ఆయన అభిమానులు సోమవారం నిరసనలు వ్యక్తం చేసే అవకాశం లేకపోలేదు.

Raghurama.jpg

కైకలూరుకు కామినేని!

టీడీపీ–జనసేన–బీజేపీ పొత్తులో భాగంగా కమలం పార్టీకి నరసాపురం పార్లమెంట్‌, కైకలూరు స్థానాలను కేటాయించారు. కైకలూరులో రాజకీయ అనుభవం వున్న మాజీ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపించింది. మూడు పార్టీల కూటమి ఏర్పడినప్పటి నుంచి డాక్టర్‌ కామినేని పేరు కైకలూరులో పిక్స్‌ అయినట్లేనని అంతా భావించారు. తాజా సమాచారం మేరకు కామినేని అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేశారు. ఒక దశలో ఏలూరు లోక్‌సభ స్థానం బీజేపీ పక్షాన ఆశించిన తపనా చౌదరిని ప్రత్యామ్నాయంగా కైకలూరు అసెంబ్లీ స్థానానికి వెళతారా అని పార్టీ పెద్దలు కోరారు. అయితే తాను ఎంపీ స్థానంలో మాత్రమే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కాని, టీడీపీ ఏలూరు లోక్‌సభ అభ్యర్థిగా పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

Kamineni.jpg

జనసేన అభ్యర్థులు వీరే..

పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను ఆదివారం రాత్రి అఽధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే ఆయా అభ్యర్థులను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పిలిచి ఎన్నికల నియమావళిని అందజేసి ప్రచారం చేసుకోవాలని పవన్‌ ఆదేశించారు. తాజాగా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం నుంచి పత్సమట్ల ధర్మరాజు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాసు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్‌, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్‌ పోటీ చేస్తున్నట్లు జాబితా ప్రకటించారు. వీరంతా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. పార్టీ సైతం ఇక అధికారికంగా ప్రకటించడంతో ఉన్న చిక్కులన్ని వీడినట్లు అయ్యింది. ఓ వైపు బీజేపీ మరోవైపు టీడీపీ, జనసేన తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థుల జాబితాను పూర్తిగా ప్రకటించింది.

TDP-JANASENA-BJP-PATH.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 25 , 2024 | 01:06 PM