ఒలింపిక్స్ నుంచి బజ్రంగ్ అవుట్
ABN , Publish Date - May 10 , 2024 | 01:56 AM
డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియాపై వేటు పడింది. ఈ ఏడాది చివరి వరకు అతడు ఏ టోర్నీలోనూ...
స్టార్ రెజ్లర్‌పై ఏడాది చివరిదాకా నిషేధం
వరల్డ్ రెజ్లింగ్ నిర్ణయం
న్యూఢిల్లీ: డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించిన టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పూనియాపై వేటు పడింది. ఈ ఏడాది చివరి వరకు అతడు ఏ టోర్నీలోనూ పాల్గొనకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) నిషేధం విధించింది. దీంతో అతడి పారిస్ ఒలింపిక్స్ అవకాశాలు ముగిసినట్టే. ఇటీవలే జరిగిన ట్రయల్స్ సందర్భగా డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్ ఇచ్చేందుకు పూనియా నిరాకరించాడు. దీంతో గతనెల 23న జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా ప్రపంచ సమాఖ్య అతడిపై ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ జూలైలో మొదలయ్యే విశ్వక్రీడల్లో బజ్రంగ్ పాల్గొనేందుకు అవకాశం లేదు. కాగా, బజ్‌రంగ్‌పై నాడా సస్పెన్షన్ గురించిన సమాచారం ఉన్నా.. విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) అతడికి రూ. 9 లక్షలు మంజూరు చేయడం గమనార్హం. అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో తాను విదేశాలకు వెళ్లడం లేదని 30 ఏళ్ల పూనియా తెలిపాడు.