Share News

ICC : ఒప్పుకొంటారా? తప్పుకొంటారా?

ABN , Publish Date - Nov 30 , 2024 | 04:57 AM

చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై తాడోపేడో తేల్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ పద్దతికి అంగీకరించాల్సిందేనని

ICC : ఒప్పుకొంటారా? తప్పుకొంటారా?

చాంపియన్స్‌ ట్రోఫీపై పాక్‌ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం

న్యూఢిల్లీ/దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై తాడోపేడో తేల్చేందుకు ఐసీసీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైబ్రిడ్‌ పద్దతికి అంగీకరించాల్సిందేనని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు స్పష్టం చేసింది. ఒకవేళ పీసీబీ ఇందుకు ఒప్పుకోకపోతే ఆతిథ్య హక్కులను వదులుకోవాల్సి ఉంటుందని ఏకంగా అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ.. పాక్‌ బోర్డు ఈ టోర్నీని బాయ్‌కాట్‌ చేయాలనుకుంటే, ఆ జట్టు లేకుండానే చాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుందని ఖరాఖండీగా చెప్పేసింది. పాక్‌ నిర్ణయం తెలిపేందుకు శనివారం వరకు గడువిచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో ఐసీసీకి తలొగ్గడం మినహా పాక్‌ బోర్డుకు మరో దారి లేదని ఇతర సభ్య దేశాలు కూడా భావిస్తున్నాయి. భద్రతా కారణాలరీత్యా వచ్చే ఏడాది జరిగే ఈ మెగా టోర్నీ కోసం తాము పాక్‌లో అడుగుపెట్టమని బీసీసీఐ ఇదివరకే ఐసీసీకి తెలిపింది. అంతేకాదు.. పాక్‌లో భారత జట్టు పర్యటనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కేంద్ర విదేశాంగ శాఖ కూడా శుక్రవారం స్పష్టం చేసింది. కానీ పాక్‌ మాత్రం మ్యాచ్‌లన్నీ తమ దేశంలోనే జరగాలని, హైబ్రిడ్‌ పద్దతిని ఒప్పుకోమంటూ వాదిస్తోంది. శుక్రవారం జరగాల్సిన ఐసీసీ బోర్డు సమావేశం కూడా ఇందుకే వాయిదాపడింది. హైబ్రిడ్‌ పద్దతికి పాక్‌ అనుకూలంగా ఉంటే మాత్రం భారత్‌ ఆడే మ్యాచ్‌లు యూఏఈలో జరుగనున్నాయి. ‘ఒకవేళ భారత్‌ ఈ టోర్నీలో ఆడకపోతే బ్రాడ్‌కాస్టర్‌ సంస్థ పెన్నీ కూడా ఐసీసీకి ఇవ్వదు. ఆ విషయం పాక్‌కు కూడా తెలుసు. హైబ్రిడ్‌ పద్దతికి పాక్‌ బోర్డు చైర్మన్‌ నఖ్వీ అంగీకరిస్తేనే శనివారం సమావేశం జరుగుతుంది. ఇందుకు నేటి వరకు గడువిచ్చాం. ఒకవేళ వారు మరీ పట్టుదలగా వ్యవహరించి బహిష్కరించాలనుకుంటే, పాక్‌ లేకుండానే మరో దేశంలో చాంపియన్స్‌ ట్రోఫీని నిర్వహించడం ఖాయం. ఏదిఏమైనా పీసీబీ హైబ్రిడ్‌ పద్దతికి అంగీకరిస్తుందనే భావిస్తున్నాం’ అని ఐసీసీ బోర్డు అధికారి పేర్కొన్నాడు. ఈ సంకటస్థితిలో పాక్‌ క్రికెట్‌ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. డిసెంబరు 1న జైషా ఐసీసీ కొత్త బాస్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. దీంతో ప్రస్తుత చైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహణపై అధికారికంగా చివరి నిర్ణయం తీసుకోనున్నాడు.

Updated Date - Nov 30 , 2024 | 05:38 PM