Share News

Team India: వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ తర్వాత తొలిసారి ఆ స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు!

ABN , Publish Date - Aug 09 , 2024 | 09:38 PM

శ్రీలంకతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు పూర్తయ్యాయి. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం చేజార్చుకుంది. ఆగస్టు 7తో మూడు మ్యా్చ్‌ల వన్డే సిరీస్ పూర్తయ్యింది.

Team India: వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ తర్వాత తొలిసారి ఆ స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు!

శ్రీలంకతో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లు పూర్తయ్యాయి. పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వన్డే సిరీస్‌ను మాత్రం చేజార్చుకుంది. ఆగస్టు 7తో మూడు మ్యా్చ్‌ల వన్డే సిరీస్ పూర్తయ్యింది. తదుపరి టీమిండియా బంగ్లాదేశ్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను స్వదేశంలోనే ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. గతేడాది నవంబర్ 19న వన్డే ప్రపంచకప్-2023 ఫైనల్ మ్యాచ్‌ తర్వాత అతడు ఇంతవరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడలేదు.


వరల్డ్ కప్ సమయంలోనే చీలమండ గాయానికి గురైన షమీ ఫిబ్రవరి నెలలో లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. క్రమక్రమంగా కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు నెట్స్‌లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కాగా చీలమండ గాయం నుంచి కోలుకునే విషయంలో షమీ పురోగతిని సాధించాడని ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫో కథనం పేర్కొంది. బంగ్లాదేశ్‌తో జరగబోయే సిరీస్‌కు అతడు ఫిట్‌గా అందుబాటులో ఉండొచ్చని పేర్కొంది. అయితే బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు దులీప్ ట్రోఫీలో షమీ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కాగా సెప్టెంబర్ 5న అనంతపురం వేదికగా దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీపై ప్రదర్శన ఆధారంగా షమీని బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో షమీ పునరావాసం ముగింపు దశకు చేరుకుంది. గత నెలలో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. క్రమంగా ఎక్కువ సమయం పాటు ప్రాక్టీస్ చేస్తు్న్నాడు.


కాగా శ్రీలంక పర్యటనకు జట్టు ఎంపిక సమయంలో మహహ్మద్ షమీ గురించి ప్రశ్నించగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. షమీ ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తాడో తెలియదని అన్నారు. కొందరు ఆటగాళ్లు గాయాలతో ఉన్నారని, వారు త్వరగా జట్టులోకి తిరిగి వస్తారని ఆశిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. షమీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడని, ఇది మంచి సంకేతమని అన్నారు. సెప్టెంబర్ 19న భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ జరగనుందని పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - Aug 09 , 2024 | 09:42 PM