Share News

Rashid Khan: గుల్బదిన్‌పై చీటింగ్ ఆరోపణలు.. కెప్టెన్ రషీద్ ఖాన్ క్లారిటీ

ABN , Publish Date - Jun 25 , 2024 | 07:19 PM

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు గుల్బదిన్ నయీబ్ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ జొనాథన్ ట్రాట్ సైగల మేరకు తనకు కండరాల...

Rashid Khan: గుల్బదిన్‌పై చీటింగ్ ఆరోపణలు.. కెప్టెన్ రషీద్ ఖాన్ క్లారిటీ
Rashid Khan

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు గుల్బదిన్ నయీబ్ (Gulbadin Naib) ప్రవర్తించిన తీరుపై సర్వత్రా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోచ్ జొనాథన్ ట్రాట్ సైగల మేరకు తనకు కండరాల నొప్పి వచ్చినట్లు వ్యవహరించినందుకు.. కొందరు అతనిది ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇది చీటింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా మీడియా సైతం దీనిని ఒక పెద్ద స్కాండల్‌గా చూపిస్తూ.. రకరకాల వార్తా కథనాలను ప్రచురించింది.


అయితే.. దీనిపై పెద్ద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదంటూ ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) స్పందించాడు. తాము ఐదు నిమిషాల వ్యవధిలోనే తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాం కాబట్టి.. గుల్బదిన్ వ్యవహారం ఆటపై పెద్ద ప్రభావం చూపలేదని పేర్కొన్నాడు. ‘‘ఫస్ట్ స్లిప్‌లో గుల్బదిన్ ఫీల్డింగ్‌కి వెళ్లినప్పుడు.. అతని కాలు తిమ్మిరెక్కింది. నిజానికి.. అతనికి ఏం జరిగిందో నాకైతే తెలియదు. సోషల్ మీడియాలోనూ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా.. అదే సమయంలో వర్షం పడటంతో మేము కొన్ని నిమిషాల పాటు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఐదు నిమిషాల్లోనే వర్షం ఆగిపోవడంతో.. ఓవర్లను కుదించలేదు. ఎక్కడైతే ఆటని ఆపామో, తిరిగి అక్కడి నుంచే ప్రారంభించాం. కాబట్టి.. గుల్బదిన్ వ్యవహారం ఇక్కడ పెద్ద ప్రభావం చూపలేదు’’ అని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చాడు.


అసలేం జరిగింది?

లక్ష్య ఛేధనలో భాగంగా బంగ్లాదేశ్ స్కోరు 81/7 ఉన్నప్పుడు.. వర్షపు జల్లులు కురిశాయి. అప్పుడు డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా 2 పరుగులు వెనుకబడే ఉంది. అప్పుడు స్లిప్‌లో ఉన్న గుల్బదిన్ కండరాల నొప్పి అంటూ ఒక్కసారిగా నేలమీద పడిపోయాడు. ఈలోగా వర్షం కూడా పెరగడంతో మ్యాచ్‌ను ఆపేశారు. ఒకవేళ మ్యాచ్ ఆపకుండా కొనసాగి ఉండి.. బంగ్లా జట్టు బౌండరీ కొట్టి ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవి. కానీ.. నెమ్మదిగా ఆడమని కోచ్ సైగలు చేయడం చూసి, గుల్బదిన్ తనకు కండరాలు పట్టేసినట్లు నటించాడు. అయితే.. కొద్దిసేపటికే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ మళ్లీ కొనసాగింది. చివరికి అఫ్గాన్‌ విజయం సాధించింది. ఏదేమైనా.. గుల్బదిన్ వ్యవహారం మాత్రం ఇప్పుడు క్రికెట్ రంగంలో పెనుదుమారం రేపుతోంది.

Read Latest Sports News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 07:19 PM