Share News

T20 World Cup 2024: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం

ABN , Publish Date - Jun 18 , 2024 | 10:23 AM

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) సంచలన రికార్డు నమోదయింది. గ్రూప్-సీలో చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌పై ఒకే ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించింది.

T20 World Cup 2024: ఒకే ఓవర్‌లో 36 పరుగులు.. టీ20 వరల్డ్ కప్‌లో సంచలనం

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) సంచలన రికార్డు నమోదయింది. గ్రూప్-సీలో చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టు ఆఫ్ఘనిస్థాన్‌పై ఒకే ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టి రికార్డు సృష్టించింది. విండీస్ బ్యాటర్లు జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ ఇద్దరూ కలిసి ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ వేసిన నాలుగో ఓవర్‌లో పరుగుల వరద పారించారు. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సాధించిన జట్లలో ఒకటిగా వెస్టిండీస్ నిలిచింది.


2007 టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ విధ్వంసంతో టీమిండియా ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్ 36 పరుగులు రాబట్టింది. భారత్‌ సాధించిన ఈ రికార్డును విండీస్ జట్టు ఇప్పుడు సమం చేసింది. అయితే ఒమర్జాయ్ వేసిన ఓవర్ ఒక నో-బాల్, ఒక వైడ్+4, 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.


టీ20 ప్రపంచ కప్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు..

1. ఇంగ్లండ్‌పై ఇండియా(2007) - 36 పరుగులు - బ్యాటర్ యువరాజ్, బౌలర్ స్టువర్ట్ బ్రాడ్(6,6,6,6,6,6)

2. ఆఫ్ఘనిస్థాన్‌పై వెస్టిండీస్ (2024) - 36 పరుగులు- బ్యాటర్లు నికోలస్ పూరన్, జాన్సన్ ఛార్లెస్, బౌలర్ ఒమర్జాయ్ (6, 4+నో బాల్, వైడ్+4,0, లెగ్‌బై4,4,6,6)

3. కెనడాపై అమెరికా (2024) - 33 పరుగులు - బ్యాటర్లు ఆండ్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్- బౌలర్ జెరెమీ గోర్డాన్ (వైడ్,6,4,వైడ్,నో బాల్,1నో బాల్,6,వైడ్,1,6,4)

4. ఆఫ్ఘనిస్థాన్‌పై ఇంగ్లండ్ (2012) - 32 పరుగులు -బ్యాటర్లు ల్యూక్ రైట్, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో - బౌలర్ ఇజతుల్లా దావ్లాట్‌జాయ్ - (4,వికెట్,6నో బాల్,1నోబాల్,6,6,6,1)

5. పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా(2014) - 30 పరుగులు బ్యాటర్లు ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్‌వెల్, బౌలర్ బిలావల్ (4,1,4,6,6,4నోబాల్,4).


విండీస్ ఘన విజయం

గ్రోస్ ఐలెట్‌లోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యా్చ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో 53 బంతుల్లో 98 (నాటౌట్) పరుగులు బాదిన పూరన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చార్లెస్ 43, హోప్ 25, పావెల్ 23 చొప్పున కీలక పరుగులు రాబట్టారు. ఇక 219 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో మెక్‌కే 3, హోసెన్, మోతీ చెరో 2, రస్సెల్, జోసెప్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు అన్ని మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో విఫలమయ్యారు.

Updated Date - Jun 18 , 2024 | 10:23 AM