Share News

ఘనంగా ముగించారు

ABN , Publish Date - Jul 15 , 2024 | 05:47 AM

సిరీస్‌ చివరి మ్యాచ్‌లోనూ యువ భారత్‌ నుంచి అదే జోరు. సంజూ శాంసన్‌ (45 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 58) అర్ధసెంచరీకి తోడు.. పేసర్‌ ముకేశ్‌ (4/22) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో ఆఖరిదైన...

ఘనంగా ముగించారు

4-1తో సిరీస్‌ నెగ్గిన భారత్‌

పేసర్‌ ముకేశ్‌కు నాలుగు వికెట్లు

ఐదో టీ20లోనూ జింబాబ్వే చిత్తు

హరారే: సిరీస్‌ చివరి మ్యాచ్‌లోనూ యువ భారత్‌ నుంచి అదే జోరు. సంజూ శాంసన్‌ (45 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 58) అర్ధసెంచరీకి తోడు.. పేసర్‌ ముకేశ్‌ (4/22) కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో ఆఖరిదైన ఐదో టీ20లో భారత్‌ 42 పరుగుల తేడాతో నెగ్గింది. అలాగే సిరీ్‌సను సైతం 4-1తో ఘనంగా ముగించింది. ఆదివారం జరిగిన ఈ నామమాత్రపు మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. దూబే (26), పరాగ్‌ (22) రాణించారు. ముజరబానికి రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. పేసర్‌ ముకేశ్‌ (4/22) ఆరంభ, చివర్లో దెబ్బతీయగా... మధ్య ఓవర్లలో స్పిన్నర్లు కట్టడి చేశారు. దీంతో 18.3 ఓవర్లలో 125 రన్స్‌కే ఆలౌటైంది. మైర్స్‌ (34), మరుమని (27) మాత్రమే ఆకట్టుకోగా, డెత్‌ ఓవర్లలో ఫరాజ్‌ (27) వేగంగా ఆడి ఓటమి తేడాను తగ్గించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దూబే 26 పరుగులు చేయడమేగాక, రెండు వికెట్లు తీశాడు. అలాగే సిరీ్‌సలో 8 వికెట్లతో రాణించిన వాషింగ్టన్‌ సుందర్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా నిలిచాడు.


ఆదుకున్న శాంసన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో ఈసారి దూకుడు తగ్గింది. టాపార్డర్‌ విఫలం కాగా, సంజూ శాంసన్‌ ఒక్కడే సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతడికి పరాగ్‌ సహకారంతో పాటు చివర్లో దూబే మెరుపులు తోడయ్యాయి. దీంతో స్కోరు 160 దాటగలిగింది. చివరి మ్యాచ్‌లో అజేయంగా చెలరేగిన ఓపెనర్‌ జైస్వాల్‌ (12) తొలి ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మూడో ఓవర్‌లో అభిషేక్‌ (14) సిక్సర్‌, గిల్‌ రెండు ఫోర్లతో 16 రన్స్‌ వచ్చాయి. కానీ ఆ తర్వాత వరుస ఓవర్లలో ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. పవర్‌ప్లేలో 44/3 స్కోరుతో నిలిచిన జట్టును మధ్య ఓవర్లలో శాంసన్‌-పరాగ్‌ జోడీ ఆదుకుంది. 12వ ఓవర్‌లో శాంసన్‌ రెండు సిక్సర్లతో 15 రన్స్‌ అందించాడు. ఇందులో తొలి సిక్సర్‌ అయితే ఏకంగా 110మీ. దూరం వెళ్లి స్టేడియం బయటపడింది. అయితే జట్టు స్కోరు వంద పరుగులు దాటాక 15వ ఓవర్‌లో పరాగ్‌ను మవుట అవుట్‌ చేయడంతో నాలుగో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు 39 బంతుల్లో కెరీర్‌లో రెండో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న శాంసన్‌ కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు. ఈ దశలో దూబే చెలరేగి 18వ ఓవర్‌లో 4,6,4తో విలువైన రన్స్‌ అందించినా.. ఆఖరి ఓవర్‌ తొలి బంతికే రనౌట్‌గా వెనుదిరిగాడు. కానీ చివరి రెండు ఓవర్లలో దూబే, రింకూ (11 నాటౌట్‌) ఆటతీరుతో జట్టు 30 పరుగులు సాధించగలిగింది.


స్కోరుబోర్డు

భారత్‌: జైస్వాల్‌ (బి) రజా 12; గిల్‌ (సి) రజా (బి) ఎన్‌గరవ 13; అభిషేక్‌ (సి) మదండె (బి) ముజరబాని 14; శాంసన్‌ (సి) మరుమని (బి) ముజరబాని 58; పరాగ్‌ (సి) ఎన్‌గరవ (బి) మవుట 22; దూబే (రనౌట్‌) 26; రింకూ (నాటౌట్‌) 11; సుందర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 20 ఓవర్లలో 167/6. వికెట్ల పతనం: 1-13, 2-38, 3-40, 4-105, 5-135, 6-153; బౌలింగ్‌: రజా 4-0-37-1; ఎన్‌గరవ 4-0-29-1; ఫరాజ్‌ 4-0-39-0; ముజరబాని 4-0-19-2; మవుట 4-0-39-1.

జింబాబ్వే: మధెవెరె (బి) ముకేశ్‌ 0; మరుమని (ఎల్బీ) సుందర్‌ 27; బెన్నెట్‌ (సి) దూబే (బి) ముకేశ్‌ 10; మైర్స్‌ (సి) అభిషేక్‌ (బి) దూబే 34; రజా (రనౌట్‌) 8; క్యాంప్‌బెల్‌ (సి) తుషార్‌ (బి) దూబే 4; మదండె (సి) శాంసన్‌ (బి) అభిషేక్‌ 1; ఫరాజ్‌ (సి) శాంసన్‌ (బి) ముకేశ్‌ 27; మవుట (సి అండ్‌ బి) తుషార్‌ 4; ముజరబాని (నాటౌట్‌) 1; ఎన్‌గరవ (బి) ముకేశ్‌ 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 18.3 ఓవర్లలో 125 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-1, 2-15, 3-59, 4-85, 5-87, 6-90, 7-94, 8-120, 9-123, 10-125; బౌలింగ్‌: ముకేశ్‌ 3.3-0-22-4; తుషార్‌ 3-0-25-1; బిష్ణోయ్‌ 3-0-23-0; సుందర్‌ 2-0-7-1; అభిషేక్‌ 3-0-20-1; దూబే 4-0-25-2.


ఒక్క బంతికి 13 రన్స్‌

ఓపెనర్‌ జైస్వాల్‌ ఒక్క బంతికే 12 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ మొదటి బంతికే స్పిన్నర్‌ రజా ఫుల్‌టాస్‌ బంతి వేయగా జైస్వాల్‌ సిక్సర్‌ బాదాడు. దీన్ని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించడంతో, తర్వాతి ఫ్రీహిట్‌ బాల్‌ను సైతం జైస్వాల్‌ సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఒక్క లీగల్‌ డెలివరీకి జట్టుకు 13 పరుగులు రాగా.. అటు జైస్వాల్‌ 12 రన్స్‌ సాధించినట్టయ్యింది. అలాగే పురుషుల టీ20ల్లో ఈ ఫీట్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

Updated Date - Jul 15 , 2024 | 05:47 AM