అమ్మాయిలు.. అదే దూకుడు
ABN , Publish Date - Nov 20 , 2024 | 02:51 AM
మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 2-0తో జపాన్‌ను ఓడించింది. ఇక తమ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సలీమా టెటే బృందం బుధవారం జరిగే ఫైనల్లో...
సాయంత్రం 4.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో
ఫైనల్లో భారత్
చైనాతో టైటిల్ పోరు నేడు
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
రాజ్‌గిర్: మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర సాగిస్తోంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 2-0తో జపాన్‌ను ఓడించింది. ఇక తమ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సలీమా టెటే బృందం బుధవారం జరిగే ఫైనల్లో చైనాను ఎదుర్కోనుంది. మరో సెమీస్‌లో చైనా 3-1తో మలేసియాపై గెలిచి తుదిపోరుకు చేరింది. ఇక.. మూడు, నాలుగో స్థానాల కోసం జపాన్-మలేసియా మధ్య పోరు జరుగనుంది. 48వ నిమిషంలో వైస్ కెప్టెన్ నవ్‌నీత్ కౌర్ తొలి గోల్ అందించగా.. 56వ నిమిషంలో లాల్‌రెమ్సియామి జట్టుకు మరో గోల్ అందించింది. వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకువచ్చిన భారత్ ఎదురుదాడితో జపాన్ రక్షణ శ్రేణి ఒత్తిడిలో పడింది. ఐదో నిమిషంలోనే సలీమాకు గోల్ చాన్స్ లభించినా ప్రత్యర్థి గోల్‌కీపర్ కుడో వమ్ము చేసింది. రెండో క్వార్టర్స్ ఆరంభంలోనే వరుసగా మూడు పీసీలు లభించినా ఫలితం లేకపోయింది.
ఇలా ఆ తర్వాత కూడా భారత్ నుంచి ఎదురుదాడులను కీపర్ కుడో సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. నాలుగో క్వార్టర్ 47వ నిమిషంలో భారత్‌కు లభించిన 12వ పీసీ కూడా వృధా అయ్యింది. ఆ తర్వాత నిమిషానికే దీపికను జపాన్ ప్లేయర్ కవాయ్ వెనుక నుంచి నెట్టడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దీన్ని నవ్‌నీత్ గోల్‌గా మలచడంతో 1-0 ఆధిక్యం దక్కించుకుంది. దీంతో మరింత జోరు చూపిన భారత్‌కు మరో ఎనిమిది నిమిషాల్లోనే లాల్‌రెమ్సియామి రెండో గోల్‌ను అందించడంతో విజయం ఖరారైంది.