Share News

కోల్‌కతా కమాల్‌

ABN , Publish Date - May 04 , 2024 | 05:35 AM

ఒకటి కాదు.. రెండు కాదు.. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం రుచి చూసింది. ఓ దశలో 57/5 స్కోరుతో ఇబ్బందిపడినా, వెంకటేశ్‌ అయ్యర్‌...

కోల్‌కతా కమాల్‌

నేటి మ్యాచ్‌

బెంగళూరు X గుజరాత్‌, రాత్రి 7.30 గం. వేదిక : బెంగళూరు

ముంబై అవకాశాలు దాదాపు గల్లంతు

అదరగొట్టిన బౌలర్లు

పేసర్‌ స్టార్క్‌కు నాలుగు వికెట్లు

రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌

ముంబై: ఒకటి కాదు.. రెండు కాదు.. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం రుచి చూసింది. ఓ దశలో 57/5 స్కోరుతో ఇబ్బందిపడినా, వెంకటేశ్‌ అయ్యర్‌ (52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 70) కీలక ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌ కోలుకుంది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని కాపాడే క్రమంలో బౌలర్లు ఆరంభం నుంచే ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. పేసర్‌ స్టార్క్‌ (4/33) స్థాయికి తగ్గ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 24 రన్స్‌తో నెగ్గిన కేకేఆర్‌ 14 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అటు ముంబైకిది వరుసగా నాలుగో ఓటమి. కేవలం 6 పాయింట్లతో ఉన్న ఈ జట్టు ఇక ముందుకెళ్లడం అసాధ్యమే. ముందుగా కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. మనీశ్‌ పాండే (31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) సహకరించాడు. బుమ్రా, తుషారలకు మూడేసి వికెట్లు, హార్దిక్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఛేదనలో ముంబై 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్‌ (56) ఒక్కడే రాణించాడు. స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌.. పేసర్‌ రస్సెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా వెంకటేశ్‌ నిలిచాడు.


బౌలర్ల హవా: ఓ మాదిరి ఛేదనలో ముంబై ఇన్నింగ్స్‌ కూడా తడబడుతూనే సాగింది. స్పిన్నర్లు నరైన్‌, వరుణ్‌ల ధాటికి పవర్‌ప్లేలోనే ఇషాన్‌ (13), నమన్‌ (11), రోహిత్‌ (11)ల వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత మధ్య ఓవర్లలో రస్సెల్‌.. ఆఖర్లో స్టార్క్‌ కీలక వికెట్లతో దెబ్బతీశారు. ఓవైపు సూర్యకుమార్‌ నిలిచినా.. మరో ఎండ్‌లో అతడికి సహక రించేవారు కరువయ్యారు. మధ్య ఓవర్లలో తిలక్‌ (4), నేహల్‌ వధేరా (6), హార్దిక్‌ (1)ల వికెట్లు కోల్పోవడంతో 71/6 స్కోరుతో ముంబై ఓటమి దిశగా పయనించింది. కానీ 14వ ఓవర్‌లో సూర్య చెలరేగి 4,6,4,4తో 20 రన్స్‌ సాధించడంతో పాటు 30 బంతుల్లో ఫిఫ్టీ కూడా పూర్తి చేశాడు. చివరి 30 బంతుల్లో 51 రన్స్‌ అవసరమైన వేళ మ్యాచ్‌ ముంబై వైపు తిరిగింది. కానీ 16వ ఓవర్‌లో సూర్యను రస్సెల్‌ అవుట్‌ చేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. ఇక 19వ ఓవర్‌లో టిమ్‌ డేవిడ్‌ (24), చావ్లా (0), కొట్జీ (8)లను స్టార్క్‌ పెవిలియన్‌కు చేర్చి 7 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


ఆదుకున్న వెంకటేశ్‌-మనీశ్‌ పాండే: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఆరంభం పేలవంగా ఉన్నా.. ఇన్నింగ్స్‌ను గౌరవప్రదంగానే ముగించింది. దీనికి వెంకటేశ్‌ అయ్యర్‌-మనీశ్‌ పాండే అందించిన భాగస్వామ్యమే కారణం. కానీ డెత్‌ ఓవర్లలో తిరిగి పుంజుకున్న ముంబై బౌలర్లు కేకేఆర్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. పేసర్‌ తుషార తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు తీసి కేకేఆర్‌ వెన్నువిరిచాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ సాల్ట్‌ (5)ను తొలి ఓవర్‌లోనే అవుట్‌ చేయగా.. తన మరో ఓవర్‌లో రఘువంశీ (13), కెప్టెన్‌ శ్రేయాస్‌ (6)ల పనిబట్టాడు. ఇంకో ఓపెనర్‌ నరైన్‌ (8)ను హార్దిక్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. రింకూ సింగ్‌ (9) కూడా నిరాశపరిచి చావ్లాకు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దెబ్బకు 57/5 స్కోరుతో కేకేఆర్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వెంకటేశ్‌, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ మనీశ్‌ పాండే మధ్య ఓవర్లలో అండగా నిలిచారు. వికెట్‌ కాపాడుకునేందుకు ఆరంభంలో నెమ్మదిగానే ఆడినా.. పదో ఓవర్‌లో పాండే ఫోర్‌తో స్కోరులో కాస్త కదలిక వచ్చింది. ఇక 12వ ఓవర్‌లో వెంకటేశ్‌ 4,6తో 15 రన్స్‌ అందించగా, స్కోరు కూడా వంద పరుగులు దాటింది. అటు బుమ్రా ఓవర్‌లో పాండే 4,6తో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లో వెంకటేశ్‌ హాఫ్‌సెంచరీ పూర్తయ్యింది. అంతా సజావుగా సాగుతున్న వేళ చివర్లో జట్టు ఒక్కసారిగా తడబడింది. 17వ ఓవర్‌లో హార్దిక్‌ 20 పరుగులిచ్చుకున్నా ముంబైకి కావాల్సిన బ్రేక్‌ ఇచ్చాడు. పాండే వికెట్‌ తీయడంతో ఆరో వికెట్‌కు 83 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. అదే ఓవర్‌లో సమన్వయలోపంతో రస్సెల్‌ (7) రనౌట్‌ కావడం జట్టు భారీ స్కోరుపై ప్రభావం పడింది. తర్వాతి ఓవర్‌లోనే రమణ్‌దీప్‌ (2), స్టార్క్‌ (0)లను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖరి ఓవర్‌లో వెంకటేశ్‌ను కూడా బుమ్రా బౌల్డ్‌ చేయడంతో మరో బంతి ఉండగానే కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 10 8 2 0 16 0.622

కోల్‌కతా 10 7 3 0 14 1.098

లఖ్‌నవూ 10 6 4 0 12 0.094

హైదరాబాద్‌ 10 6 4 0 12 0.072

చెన్నై 10 5 5 0 10 0.627

ఢిల్లీ 11 5 6 0 10 -0.442

పంజాబ్‌ 10 4 6 0 8 -0.062

గుజరాత్‌ 10 4 6 0 8 -1.113

ముంబై 11 3 8 0 6 -0.356

బెంగళూరు 10 3 7 0 6 -0.415

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌


స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్‌ (సి) తిలక్‌ (బి) తుషార 5, నరైన్‌ (బి) హార్దిక్‌ 8, రఘువంశీ (సి) సూర్యకుమార్‌ (బి) తుషార 13, శ్రేయాస్‌ (సి) డేవిడ్‌ (బి) తుషార 6, వెంకటేశ్‌ (బి) బుమ్రా 70, రింకూ (సి అండ్‌ బి) చావ్లా 9, మనీష్‌ పాండే (సి/సబ్‌) బ్రేవిస్‌ (బి) హార్దిక్‌ 42, రస్సెల్‌ (రనౌట్‌) 7, రమణ్‌దీప్‌ (సి) కొట్జీ (బి) బుమ్రా 2, స్టార్క్‌ (బి) బుమ్రా 0, వైభవ్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.5 ఓవర్లలో 169 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-7, 2-22, 3-28, 4-43, 5-57, 6-140, 7-153, 8-155, 9-155, 10-169; బౌలింగ్‌: తుషార 4-0-42-3, బుమ్రా 3.5-0-18-3, కొట్జీ 2-0-24-0, హార్దిక్‌ 4-0-44-2, నమన్‌ ధిర్‌ 3-0-25-0, పీయూష్‌ 3-0-15-1.

ముంబై: ఇషాన్‌ (బి) స్టార్క్‌ 13, రోహిత్‌ (సి) మనీష్‌ (బి) నరైన్‌ 11, నమన్‌ ధిర్‌ (బి) వరుణ్‌ 11, సూర్యకుమార్‌ (సి) సాల్ట్‌ (బి) రస్సెల్‌ 56, తిలక్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 4, వధేరా (బి) నరైన్‌ 6, హార్దిక్‌ (సి) మనీష్‌ (బి) రస్సెల్‌ 1, టిమ్‌ డేవిడ్‌ (సి) శ్రేయాస్‌ (బి) స్టార్క్‌ 24, కొట్జీ (బి) స్టార్క్‌ 8, పీయూష్‌ (సి) నరైన్‌ (బి) స్టార్క్‌ 0, బుమ్రా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 18.5 ఓవర్లలో 145 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-16, 2-38, 3-46, 4-61, 5-70, 6-71, 7-120, 8-144, 9-144, 10-145; బౌలింగ్‌: వైభవ్‌ 3-0-35-0, స్టార్క్‌ 3.5-0-33-4, వరుణ్‌ చక్రవర్తి 4-0-22-2, నరైన్‌ 4-0-22-2, రస్సెల్‌ 4-0-30-2.

1

ఐపీఎల్‌లో 2 వేల రన్స్‌, 100+ వికెట్లు తీసిన రెండో ప్లేయర్‌గా రస్సెల్‌. గతంలో జడేజా ఈ ఫీట్‌ సాధించాడు.

ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు (184) తీసిన రెండో బౌలర్‌గా పీయూష్‌ చావ్లా. చాహల్‌ (200) ముందున్నాడు.

4

ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఇరుజట్లు ఆలౌటవడం ఇది నాలుగోసారి.

Updated Date - May 04 , 2024 | 05:35 AM