Share News

కోల్‌కతా కేక

ABN , Publish Date - May 22 , 2024 | 01:49 AM

లీగ్‌ దశలో ‘నెంబర్‌వన్‌’ ఆటతీరుతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్వాలిఫయర్‌-1లోనూ అదే జోరును ప్రదర్శించింది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌తో వహ్వా.. అనిపించుకుంటూ సునాయాసంగా ఐపీఎల్‌ ఫైనల్‌కు...

కోల్‌కతా కేక

ఫైనల్లో నైట్‌రైడర్స్‌

రాణించిన శ్రేయాస్‌, వెంకటేశ్‌

చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్‌

విజృంభించిన పేసర్‌ స్టార్క్‌

అహ్మదాబాద్‌: లీగ్‌ దశలో ‘నెంబర్‌వన్‌’ ఆటతీరుతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్వాలిఫయర్‌-1లోనూ అదే జోరును ప్రదర్శించింది. అటు బౌలింగ్‌.. ఇటు బ్యాటింగ్‌తో వహ్వా.. అనిపించుకుంటూ సునాయాసంగా ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక, ఇప్పటిదాకా భారీస్కోర్లతో బెంబేలెత్తించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసింది. అత్యంత ఖరీదైన బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ (3/34) ఆదిలోనే వెన్నువిరవడంతో రైజర్స్‌ కోలుకోలేకపోయింది. స్వల్ప ఛేదనను కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ (24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 58 నాటౌట్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీలతో ముగించారు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఓడిన రైజర్స్‌ శుక్రవారం జరిగే క్వాలిఫయర్‌-2లో ఆడి మరోసారి ఫైనల్‌ కోసం ప్రయత్నించనుంది. ముందుగా సన్‌రైజర్స్‌ 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ త్రిపాఠి (35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 55), క్లాసెన్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32), కమిన్స్‌ (24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) రాణించారు. స్టార్క్‌కు 3, వరుణ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో కోల్‌కతా 13.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 164 రన్స్‌ చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా స్టార్క్‌ నిలిచాడు.


శ్రేయాస్‌, వెంకటేశ్‌ హాఫ్‌ సెంచరీలు: స్వల్ప ఛేదనను కోల్‌కతా అలవోకగా ముగించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌ (23), నరైన్‌ (21) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. మిగతా ఛేదనను శ్రేయాస్‌, వెంకటేశ్‌ ముగించారు. లక్ష్యం తక్కువగానే ఉండడంతో రైజర్స్‌ బౌలర్లు చేసేదేమీ లేకపోయింది. ఫిల్‌ సాల్ట్‌ స్థానాన్ని భర్తీ చేస్తూ గుర్బాజ్‌ వేగంగా ఆడాడు. రెండో ఓవర్‌లోనే నరైన్‌ రెండు ఫోర్లు, గుర్బాజ్‌ సిక్సర్‌తో కమిన్స్‌ 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత భువీ ఓవర్‌లో గుర్బాజ్‌ 6,4తో 18 రన్స్‌ అందించాడు. నాలుగో ఓవర్‌లో అతడిని నటరాజన్‌ అవుట్‌ చేసినా అప్పటికే స్కోరు 44 పరుగులకు చేరింది. ఇక వచ్చీ రాగానే వెంకటేశ్‌ బ్యాట్‌కు పనిచెబుతూ వరుస ఫోర్లు సాధించాడు. దీంతో పవర్‌ప్లేలో స్కోరు 63/1కి చేరింది. ఆ తర్వాత నరైన్‌ను కమిన్స్‌ అవుట్‌ చేసినా.. శ్రేయాస్‌ రాకతో కేకేఆర్‌ మరో వికెట్‌ కోల్పోకుండా ఆడింది. ఇద్దరూ స్వేచ్ఛగా ఆడేయడంతో 10వ ఓవర్‌లోనే స్కోరు 100 దాటింది. వెంకటేశ్‌ ఓ సిక్సర్‌తో 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇక 13వ ఓవర్‌లో శ్రేయాస్‌ చెలరేగి వరుసగా 6,4,6,6తో 22 పరుగులు రాబట్టడమే కాకుండా 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేస్తూ మ్యాచ్‌ను ముగించాడు. ఈ జోడీ అజేయంగా మూడో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.


ఆదుకున్న త్రిపాఠి-క్లాసెన్‌: సహజంగా సన్‌రైజర్స్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగితే బౌలర్లు చేష్టలుడిగిపోవాల్సిందే. కానీ ఈసారి వారి ఆటతీరు అంచనాలకు భిన్నంగా సాగింది. ఆది నుంచే పరుగుల వరద పారించే అలవాటున్న ఈ జట్టును కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. పవర్‌ప్లేలోనే జట్టు కీలక నాలుగు వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రాహుల్‌ త్రిపాఠి, క్లాసెన్‌ మాత్రమే ప్రభావం చూపారు. చివర్లో కమిన్స్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో కాస్త పరువు కాపాడుకుంది. మిగతా బ్యాటర్లు మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ (0) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డకౌటయ్యాడు. తొలి ఓవర్‌ రెండో బంతికే స్టార్క్‌ అతడిని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇక మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (3)ను రెండో ఓవర్‌లో వైభవ్‌ అవుట్‌ చేశాడు. మూడో ఓవర్‌లోనే త్రిపాఠి కూడా ఎల్బీ కావాల్సి ఉన్నా కేకేఆర్‌ రివ్యూకు వెళ్లకపోవడంతో బతికిపోయాడు. మరోవైపు నితీశ్‌ (9), షాబాజ్‌ (0)లను వరుస బంతుల్లో స్టార్క్‌ పెవిలియన్‌ చేర్చడంతో 39/4 స్కోరుతో రైజర్స్‌ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ దశలో త్రిపాఠి, క్లాసెన్‌ అడపాదడపా బౌండరీలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొమ్మిదో ఓవర్‌లో త్రిపాఠి 4, క్లాసెన్‌ 6,4తో 18 పరుగులు వచ్చాయి.

అటు త్రిపాఠి ఓ ఫోర్‌తో 29 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ 11వ ఓవర్‌లో క్లాసెన్‌ను స్పిన్నర్‌ వరుణ్‌ అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా తడబడింది. 14వ ఓవర్‌లో సమద్‌ (16)తో సమన్వయలోపంతో త్రిపాఠి రనౌటవడం భారీస్కోరుపై ప్రభావం చూపింది. ఆ వెంటనే ఇంపాక్ట్‌ ప్లేయర్‌ సన్వీర్‌ను నరైన్‌ డకౌట్‌ చేశాడు. మిగతా వికెట్లు కూడా టపటపా పడడంతో 16 ఓవర్లలో జట్టు స్కోరు 126/9. ఈ స్థితిలో కెప్టెన్‌ కమిన్స్‌ ఎడాపెడా బౌండరీలతో బ్యాట్‌ ఝుళిపించాడు. స్టార్క్‌ ఓవర్‌లో వరుసగా 6,4తో ఆకట్టుకున్నాడు. అలాగే ఆఖరి వికెట్‌కు 33 పరుగులు జోడించి జట్టు స్కోరును 150 దాటించాడు. ఆఖరి ఓవర్‌లో కమిన్స్‌ వికెట్‌తో రస్సెల్‌ వీరి ఇన్నింగ్స్‌కు తెర దించాడు.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: హెడ్‌ (బి) స్టార్క్‌ 0, అభిషేక్‌ (సి) రస్సెల్‌ (బి) అరోరా 3, త్రిపాఠి (రనౌట్‌) 55, నితీశ్‌ (సి) గుర్బాజ్‌ (బి) స్టార్క్‌ 9, షాబాజ్‌ (బి) స్టార్క్‌ 0, క్లాసెన్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 32, సమద్‌ (సి) శ్రేయాస్‌ (బి) హర్షిత్‌ 16, సన్వీర్‌ (బి) నరైన్‌ 0, కమిన్స్‌ (సి) గుర్బాజ్‌ (బి) రస్సెల్‌ 30, భువనేశ్వర్‌ (ఎల్బీ) వరుణ్‌ 0, విజయకాంత్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.3 ఓవర్లలో 159 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-0, 2-13, 3-39, 4-39, 5-101, 6-121, 7-121, 8-125, 9-126, 10-159; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-34-3, వైభవ్‌ 2-0-17-1, హర్షిత్‌ రాణా 4-0-27-1, నరైన్‌ 4-0-40-1, రస్సెల్‌ 1.3-0-15-1, వరుణ్‌ 4-0-26-2.

కోల్‌కతా: గుర్బాజ్‌ (సి) విజయకాంత్‌ (బి) నటరాజన్‌ 23, నరైన్‌ (సి) విజయకాంత్‌ (బి) కమిన్స్‌ 21, వెంకటేశ్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 51, శ్రేయాస్‌ (నాటౌట్‌) 58, ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 13.4 ఓవర్లలో 164/2; వికెట్ల పతనం: 1-44, 2-67; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-28-0, కమిన్స్‌ 3-0-38-1, నటరాజన్‌ 3-0-22-1, విజయకాంత్‌ 2-0-22-0, హెడ్‌ 1.4-0-32-0, నితీశ్‌ 1-0-13-0.


1

ప్లేఆ్‌ఫ్సలో ఎక్కువ (2) 50+ స్కోర్లు సాధించిన కెప్టెన్‌గా శ్రేయాస్‌. ఈ క్రమంలో ధోనీ, రోహిత్‌, వార్నర్‌తో సమంగా నిలిచాడు.

4

ఐపీఎల్‌ ఫైనల్‌ చేరడం కోల్‌కతాకు ఇది నాలుగోసారి. గతంలో 2012, 2014, 2021లో తుదిపోరులో నిలిచింది. చెన్నై (10), ముంబై (6) తర్వాత ఎక్కువసార్లు ఫైనల్‌కు వచ్చిన జట్టిదే.

Updated Date - May 22 , 2024 | 01:49 AM